– ఏటీపీ ఫైనల్స్ 2024
ట్యురిన్ (ఇటలీ) : ఏడాది ఆఖర్లో జరిగే ప్రతిష్టాత్మక ఏటీపీ ఫైనల్స్‌లో భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న జోడీకి ఆరో సీడ్ లభించింది. పురుషుల డబుల్స్ విభాగంలో ఆస్ట్రేలియా భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి రోహన్ బోపన్న ఏటీపీ ఫైనల్స్ బరిలో నిలిచాడు. పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో టాప్-8లో నిలిచిన క్రీడాకారులు మాత్రమే ఈ టోర్నీలో పోటీపడతారు. ఆరో సీడ్ బోపన్న, ఎబ్డెన్ జోడీ సోమవారం తొలి రౌండ్‌లో ఇటలీ ఆటగాళ్లు బొలెలి, ఆండ్రీలతో తలపడనున్నారు. గ్రూప్ దశలో ప్రతి గ్రూప్‌లో నాలుగు జోడీలు పోటీపడతాయి. టాప్-2లో నిలిచిన జోడీలు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. పురుషుల సింగిల్స్‌లో జానిక్ సినెర్, అలెగ్జాండర్ జ్వెరెవ్, కార్లోస్ అల్కరాజ్, డానిల్ మెద్వదేవ్, టేలర్ ఫ్రిట్జ్, కాస్పర్ రూడ్, అలెక్స్ డీ, అండ్రీ రూబ్లెవ్ రేసులో నిలిచారు. నవంబర్ 11-17న ఏటీపీ ఫైనల్స్ జరుగుతాయి.