– టీమిండియాదే ఆధిపత్యం
– బౌలింగ్ కోచ్ మోర్కెల్
పెర్త్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా మరోసారి ఆధిపత్యం చెలాయించడం ఖాయమని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2018, 2020 సీజన్‌లలో టైటిళ్లు నెగ్గిన భారత్.. వరుసగా మూడోసారి టైటిల్‌ను చేజిక్కించుకొని హ్యాట్రిక్ కొడుతుందని వారు తెలిపారు. అలాగే టీమిండియా ఫ్టాస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నాయకత్వ సామర్థ్యంపై భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ప్రశంసల జల్లు కురిపించాడు. పెర్త్ వేదికగా జరిగే తొలిటెస్ట్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేని పక్షంలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌కు ఈ మిస్టరీ బౌలర్‌ను సెలెక్షన్ కమిటీ వైస్ కెప్టెన్‌గా నియమించింది. బుమ్రా గతంలో 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో యువ ఫాస్ట్ బౌలర్లకు బుమ్రా మార్గనిర్దేశం చేస్తాడని బౌలింగ్ కోచ్ మోర్కెల్ పేర్కొన్నారు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మోర్కెల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. అలాగే విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లతో బుమ్రా సలహాలు అవసరమైన సలహాలు సూచనలు తీసుకోగలడని.. అది కెప్టెన్‌గా ముందుకు సాగడంలో సహాయపడుతుందని మోర్కెల్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా గడ్డపై బుమ్రాకు అద్భుతమైన రికార్డు ఉంది. ఏడు టెస్టు మ్యాచచుల్లో 32 వికెట్లు పడగొట్టాడు. 2018-19, 2020-21 పర్యటనల్లో విజయం సాధించిన తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు వరుసగా మూడో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోందని తెలిపాడు.