సరిహద్దుల్లో నిఘా

– ఇతర రాష్ట్రాలు, విదేశీ మద్యం లక్ష్యంగా తనిఖీలు
– చెక్‌ పోస్టులో సీసీ కెమెరాల ఏర్పాటు
– శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోనూ ఆలర్ట్‌
– ఎన్నిలక వేళ అక్రమ మద్యం కట్టడికి అబ్కారీ శాఖ చర్యలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అబ్కారీ శాఖ అప్రమత్తమైంది. సరిహద్దులో నిఘా పెంచింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. విదేశీ మద్యంపైనా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆలర్ట్‌ చేసింది. రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయం అబ్కారీ శాఖ నుంచి వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా, ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్రమ మద్యాన్ని అరికట్టేవిధంగా అప్రమత్తంగా ఉండాలని అబ్కారీ శాఖ ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ రాష్ట్రంలో 10 ఉమ్మడి జిల్లాల్లో పది డివిజన్లు, 36 సూపరింటెండెంట్‌ యూనిట్లు, 139 ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి రోజూ రూ.150కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో అబ్కారీ శాఖ కీలకంగా మారింది. గతేడాది ఈ శాఖ నుంచి రూ.33వేల కోట్ల ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే.
ఆదాయంలో పెద్దన్నపాత్ర
శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో అబ్కారీ శాఖ అప్రమత్తమైంది. ఎన్నికల్లో మద్యం ప్రభావాన్ని తగ్గించడంతోపాటు పక్కరాష్ట్రాల నుంచి మద్యానికి అడ్డకట్ట వేయాలని నిర్ణయించింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలకు అవసరమయ్యే నిధులను కూడా అబ్కారీ శాఖనే ఎక్కువగా సమకూరుస్తుందనే ప్రచారమూలేకపోలేదు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతంగా వేతనాలు ఇస్తున్న ఏకైక శాఖ అబ్కారీశాఖనే.
సరిహద్దుల్లో నిఘా
తెలంగాణ రాష్ట్రంలోని 10జిల్లాలోని 37 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయి. మొత్తం 20 సరిహద్దు చెక్‌పోస్టులు ఉన్నాయి. ఎనిమిది మహారాష్ట్ర, ఎనిమిది ఆంధ్రప్రదేశ్‌, నాలుగు కర్ణాటక సరిహద్దు చెక్‌పోస్టులున్నాయి. ఆరు అటవీశాఖకు సంబంధించిన చెక్‌పోస్టులు ఉన్నాయి.వీటితోపాటు పోలీసు చెక్‌పోస్టులను సైతం వినియోగించాలని అబ్కారీ శాఖ నిర్ణయించింది. అన్ని చెక్‌పోస్టుల్లో సిబ్బందిని పెంచడంతోపాటు సీసీకెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. మౌలికవసతులపై ప్రత్యేక దృషి పెట్టాలని అధికారులకు కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు.
1503లీటర్ల అక్రమ మద్యం
నిరంతరం తనిఖీలు చేయడంతో 14రోజుల్లోనే 1,503లీటర్ల ప్రభుత్వానికి డ్యూటీ చెల్లించని మద్యాన్ని పట్టుకున్నారు. ఢిల్లీ, హర్యాన, చండిఘర్‌, గోవా రాష్ట్రాలతోపాటు సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ నుంచి వస్తున్నదని అధికారులు గుర్తించారు.దీంతో అబ్కారీ శాఖ అధికారులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుతోపాటు సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌, వికారాబాద్‌ జిల్లాలోని కోడంగల్‌, నిజామాబాద్‌ జిల్లాలోని సాలూర, రాయచూరు సమీపంలోని నందిని, రంగారెడ్డి జిల్లాలోని రామోజీఫిల్మ్‌సిటీ వద్ద చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు.
1834 కేసులు
అబ్కారీ శాఖ అధికారులు 14రోజుల్లోనే 1834 కేసులు నమోదు చేశారు. 785 మందిని అరెస్టుచేశారు.119 వాహనాలను సీజ్‌ చేశారు. 2836లీటర్ల సారా, 11,736 కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు రూ.16లక్షల విలువైన 318కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఎల్‌స్డీ బోల్ట్స్‌, 50గ్రాముల ఎండీఎం, ఎక్స్‌టాక్స్‌పిల్స్‌27, యాష్‌అయిల్‌ 24లీటర్ల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 10ఉమ్మడి జిల్లాలోని అబ్కారీశాఖ అధికారులు నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాల్లో ప్రతిరోజూ 80-90 అక్రమ మద్యం బాటిల్స్‌ దొరుకుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఆ రైతులకు రైతుబంధు బంద్‌
రాష్ట్రంలో గంజాయిని సాగు చేస్తున్న రైతులకు రైతుబంధును నిలిపేయాలని అబ్కారీ శాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను కలెక్టర్లకు పంపించింది. నాగర్‌కర్నూల్‌, మహబుబాబాద్‌, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, వికారాబాద్‌ జిల్లాల్లో 130ఎకరాల్లో గంజాయిని సాగు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కలెక్టర్ల ద్వారా సీసీఎల్‌ఏకు పంపించారు. ఈ విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.