బోర్నవీటా హెల్త్‌డ్రింక్‌ కాదు

బోర్నవీటా హెల్త్‌డ్రింక్‌ కాదు– కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ : బోర్నవీటాను తయారు చేస్తున్న మోండెలెజ్‌ ఇండియా ఫుడ్స్‌కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ భారీ షాక్‌ ఇచ్చింది. బోర్నవీటా హెల్త్‌ డ్రింక్‌ కాదని స్పష్టం చేసింది. ఈ విషయమై ఆ సంస్థ సహ, ఈ కామర్స్‌ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బోర్నవిటా సహా ఇతర పానియాలను హెల్త్‌ డ్రింక్స్‌’ కేటగిరీ నుంచి తొలగించాలని ఇ-కామర్స్‌ వేదికలకు కేంద్రం ఏప్రిల్‌ 10న జారీ చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. పిల్లల హక్కుల పరిరక్షణ చట్టం- 2005 సెక్షన్‌ 3 ప్రకారం దేశంలోని ఆహార చట్టాలలో ‘హెల్త్‌ డ్రింక్‌’ అని ఎక్కుడా వినియోగించకూడదని రెగ్యూలేటరీ బాడీ తెలిపింది. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ చట్టం 2006లో హెల్త్‌ డ్రింక్‌ అని దేన్నీ నిర్వచించలేదు. ఈ క్రమంలోనే బోర్నవీటా సహా అన్ని పానియాలను హెల్త్‌ డ్రింక్స్‌ కేటగిరీ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐ)కి సమర్పించిన నియమాలు, నిబంధనల్లో బోర్న్‌వీటాను హెల్త్‌ డ్రింక్‌గా నమోదు చేసినట్టు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇకపై హెల్త్‌ డ్రింక్‌ పేరుతో అమ్మకాలు నిర్వహిస్తే సదరు కంపెనీలపై చర్యలుంటాయని తెలిపింది.