75 శాతం మంది వద్ద డబ్బుల్లేవ్‌

– జీతం 15 రోజులకు మించి ఉండదు
– అత్యవసరాలకు నిధుల కటకటే
– 25 శాతం మంది వద్దే ఎమర్జెన్సీకి సొమ్ము
– గడ్డుకాలంలో తల్లిదండ్రులు, స్నేహితులే ఆధారం
–  ఫినోలాజీ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : భారతీయుల్లో మూడొంతుల మంది వద్ద అత్యవసరానికి నగదు లేదని ఓ రిపోర్ట్‌లో వెల్లడయ్యింది. నాలుగింటిలో ఒక్క వంతు మంది వద్ద మాత్రమే ఎమర్జెన్సీకి సొమ్ము ఉందని పర్సనల్‌ ఫైనాన్స్‌ ప్లాట్‌ఫాం ఫినోలాజీ సర్వేలో వెల్లడయ్యింది. ”ఇండియా మనీ హాబిట్స్‌” పేరుతో ఫినోలాజీ నిర్వహించిన సర్వే రిపోర్ట్‌ ప్రకారం.. ”పదవీ విరమణ, పిల్లల విద్య, వివాహం వృద్ధాప్య ఆరోగ్య సంరక్షణ ఖర్చులు వంటి దీర్ఘకాలిక ప్రణాళికలో భారతీయులు గొప్పగా ఉన్నారు. అయితే.. అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోవడం లేదా కరోనా లాంటి సంక్షోభం ఏర్పడినప్పుడు 25 శాతం మంది వద్ద మాత్రమే ఎమర్జెన్సీ అవసరాలకు నిధులు ఉన్నాయి. మిగితా 75 శాతం భారతీయుల వద్ద అత్యవసర నిధులు లేవు. ఆకస్మికంగా ఉద్యోగం కోల్పోతే వారి నెలవారీ వాయిదాల (ఇఎంఐ) చెల్లింపుల్లో విఫలం కానున్నారు. గడ్డుకాలంలో భారతీయులు తమ తల్లిదండ్రులు, స్నేహితులను అత్యవసర నిధిగా పరిగణిస్తారు. ముగ్గురిలో ఒకరికి ఆరోగ్య రక్షణ లేదా అత్యవసర నిధి లేదు. మరో దారుణమైన, ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. 29 శాతం మంది భారతీయుల జీతం 15 రోజులకు మించి ఉండదు.” అని ఫినోలాజీ సర్వేలో తేలింది.
అత్యవసర నిధి అంటే..!
జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు ఆర్థిక అవసరాల కోసం ముందే పక్కన పెట్టుకున్న డబ్బు. ”ఉద్యోగ నష్టం, అనారోగ్యాలు లేదా వైకల్యం కారణంగా ఆదాయాన్ని కోల్పోయే కాలంలో ఊహించని ఖర్చులను ఎదుర్కోవటానికి లేదా అనివార్యమైన ఖర్చులను కవర్‌ చేయడానికి ఆర్థిక నిధిని రూపొందించుకోవడం,. కీలకమైన ఆర్థిక లక్ష్యాల కోసం కేటాయించిన తన పెట్టుబడులను నగదులోకి మార్చుకోవడం చేయాల్సిఉన్నది. లేదా అటువంటి ఆర్థిక అవసరాలను ఎదుర్కోవడానికి చాలా ఎక్కువ వడ్డీ రేట్లకు రుణాలను పొందవలసి వచ్చింది” అని పైసా బజార్‌ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ నవీన్‌ కుక్రేజ్‌ పేర్కొన్నారు.
అత్యవసర నిధి ఎంతుండాలి..!
ఇప్పటికే ఉన్న ఇఎంఐలు, రోజువారీ గృహ ఖర్చులు, పిల్లల ట్యూషన్‌ ఫీజు, యుటిలిటీ బిల్లులు, మందుల కోసం ఖర్చులు, బీమా ప్రీమియంలు మొదలైన అనివార్యమైన ఖర్చులను కనీసం 6 నెలల పాటు కవర్‌ చేయడానికి అత్యవసర నిధి తగినంత పెద్దదిగా ఉండాలి. తక్కువ ఆదాయం ఉన్నవారికి ఈ ఫండ్‌ కనీసం 12 నెలల పాటు ఈ ఖర్చులను కవర్‌ చేయగలగాలి. ఈ మొత్తాన్ని తక్కువ రిస్కు కలిగిన వాటిలో పెట్టుబడిగా పెట్టి ఉండాలి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎక్కువ మొత్తం కూడా అవసరం ఉండొచ్చని ఫిన్‌ఎడ్జ్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ అనిరుద్ధ బోస్‌ పేర్కొన్నారు.