– యుపిఐ తరహాలో యుఎల్‌ఐ : ఆర్‌బిఐ
న్యూఢిల్లీ : రుణాలు తీసుకోవడాన్ని మరింత సులభతరం చేయనున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వెల్లడించింది. ఇందుకోసం యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (యుఎల్‌ఐ)ను తీసుకురానున్నట్లు పేర్కొంది. గతేడాదే ఆగస్టు 17న ప్రిక్షన్‌లెస్ క్రెడిట్ పేరుతో ప్రారంభించిన పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలు ఇవ్వడంతో త్వరలో దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. సోమవారం బెంగళూరులో శక్తికాంత ఓ సమావేశంలో మాట్లాడుతూ.. డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో యుపిఐ ఏవిధమైన పాత్ర పోషిస్తోందో అదే తరహాలో రుణ వితరణలో యుఎల్‌ఐ కూడా దూసుకుపోనుందన్నారు. భూ రికార్డులు సహా ఇతర ముఖ్యమైన డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా యుఎల్‌ఐ పని చేస్తుందన్నారు. దీంతో రుణ ఆమోద ప్రక్రియ సరళతరం కానుందని తెలిపారు. రుణం పొందేందుకు డాక్యుమెంటేషన్ ప్రక్రియ అవసరం ఉండదన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఖాతాదారుడి సమగ్ర ఆర్థిక వివరాలను ఆర్‌బిఐ సేకరించనుందని తెలుస్తోంది.