అరువు – బరువు

అరువు - బరువుపదను కానీ దాత్రికి
మూలన పడ్డ నాగలి
చేతులు సాలు సాగలేక
మూలుగుతుంటే
ఆకాశ వీధికి చూపులు సారించి
వర్షించని మేఘాన్ని పిలుస్తూ
పొలికేక పెడతాడు
వరుణుడి రాక కోసం
కళ్లల్లో వత్తులు వేసుకొని
పదును చేసే కార్తెలకై
అదును కోసం బతుకు
పొద్దంతా నిరీక్షిస్తాడు
తన స్వేదామృతంతో
మాగాణమ్మ ఎదకు ఆరుతడై
బతుకు విత్తును నాటి
ఎన్నో పచ్చని ఆశలను
తన మనోఫలకంపై
లిఖించుకుంటాడు
ఆరుగాలం శ్రమంతా
నెర్రలీడిన నేల బీటల్లో
బిగుసుకుంటుంటే
ఆ నిస్సహాయ స్థితికి నిర్జీవమైతాడు
పైరును ప్రేమించిన పాపానికి
అర్థ్రమైన వేదనంతా
మేలిమి రాసులెత్తలేక
కల్తీ విత్తనాల్లో
కన్నీటి చుక్కలై పారుతుంది
నకిలీ పురుగు మందులు
హాలికుని వెన్నును
చీడ తోలస్తున్నట్టు తొలిచి
బతుకు సారాన్ని పీల్చేస్తూంటే
శివుడు గరలాన్ని దాచినట్టు
తన బాధలన్ని
గొంతులోనే అణిచి పెడతాడు
రాత్రింబవళ్లు చేసిన
శ్రమ వృధా అయినాక
ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడుతూ
కరువు రక్కసితో
నిరంతరం యుద్ధం చేస్తూ
ప్రతిచోట భంగపడ్డా
తన ఉనికిని చాటుకుంటూ
తరాల బాటలోనే నడుస్తాడు
చిగురించేమొక్కై అంకురించడానికి
గిట్టుబాటు ధరలు కరువై
రోదిస్తూ
అధిక వడ్డీల అప్పులతో
సతమతమవుతూ
గుప్పెడు మెతుకులు
అరువైన బతుకు పోరులో గెలవలేక
ఊపిరి దీపాలను ఆర్పేసుకుంటాడు
మట్టినే దైవంగా కొలిచిన రైతు
మట్టితోనే మమేకమై
మట్టి వాసనలు కప్పుకుంటాడు
ఆ మట్టి పరిమళాన్ని విశ్వంపై వెదజల్లి ఆవిరైపోతున్న చెమట బిందువుల్లో
గుభాలిస్తాడు
మన ఆకలి బాధల
ఆకారం దాల్చే ఆ గుండె
ఎన్ని నాగలిపోట్లనైనా
ఎన్నోసార్లు తట్టుకున్నా
కొన్నిసార్లు ఆగిపోతూనే ఉంటుంది
అరువు బరువైనాక
జీవనవేదనా గమనంలో
రైతు జీవచ్ఛవంలా వుండిపోతాడు
అన్నదాత బతుకు మారితేనే కదా
వ్యవసాయ క్షేత్రం సుభిక్షం
రైతు బతుకు గట్టెక్కితేనే
అభివృద్ధి గట్టెక్కేది అది
దేశమైనా సమాజమైన…
– సునీత నెల్లుట్ల
7989460657