– బీజేపీ అభ్యర్థి కంగనా వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలివుడ్ నటి, కంగనా రనౌత్ మరోమారు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భారత తొలి ప్రధానమంత్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ఆమె పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ.. ‘మనకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు తొలి ప్రధాని బోస్ ఎక్కడికి వెళ్లారు..?’ అని వ్యాఖ్యానించారు. దేశం కోసం పోరాడిన ఆయన్ను దేశంలోకి అడుగుపెట్టనివ్వలేదని ఇష్టారీతిన చెప్పుకుంటూ వెళ్తుంటే సదరు కార్యాక్రమ వ్యాఖ్యాత ఆమె మాటలను సరిచేశారు. దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ అని గుర్తు చేశారు. కంగనా ప్రకటనపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి వారి మాటలు తేలిగ్గా తీసుకోవద్దని, వీరంతా ఎక్కడ చదువుకున్నారంటూ విపక్ష నేతలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె విద్యాశాఖ మంత్రి అయితే పరిస్థితి ఏంటో..? అంటూ కామెంట్లు పెట్టారు. గతంలోనూ ఆమె ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. 2014లో నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాతే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందంటూ వ్యాఖ్యలు చేసి, విమర్శల పాలయ్యారు. ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని అప్పట్లో పలువురు నేతలు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. మండి నియోజకవర్గానికి జూన్ ఒకటిన ఓటింగ్ జరగనుంది.