– సిద్దిపేటలో కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షా
– మోడీ మూడోసారి ప్రధాని అయ్యాక తెలంగాణలో అవినీతి అంతం
– రాష్ట్రంలో 12 లోక్‌సభ స్థానాలను గెలిపించాలి
– సహారా ఇండియా పేమెంట్స్ చెల్లించాలంటూ సభలో కార్మికుల ప్లకార్డుల ప్రదర్శన
నవతెలంగాణ – సిద్దిపేట
కాళేశ్వరం, ఇతర పథకాల్లో అవినీతి జరిగితే కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ ఒకటేనని కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. గురువారం సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన బీజేపీ విశాల జనసభ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పదేండ్ల పాలనలో మోడీ ఎన్నో సమస్యలను పరిష్కరించారని అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం మోడీ కేసులు గెలిచి గుడిని ప్రారంభించారని తెలిపారు. మెదక్ నుంచి రఘునందన్ రావును గెలిపించాలని, మూడోసారి మోడీని ప్రధానమంత్రిని చేద్దామని అన్నారు. తెలంగాణలో బీజేపీని కనీసం 12 లోక్‌సభ స్థానాల్లో గెలిపిం చాలని కోరారు. తెలంగాణలో విమోచన దినోత్సవం నిర్వహిం చడంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు మజ్లిస్ పార్టీకి భయపడు తున్నాయని, బీజేపీ వచ్చాక సెప్టెంబర్ 17న తప్పకుండా నిర్వహి స్తామని చెప్పారు. మోడీ ప్రధాని అయితేనే తెలంగాణలో అవినీతి అంతమవుతుందన్నారు. కార్యక్రమంలో మెదక్, మల్కా జిగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులు రఘునందన్ రావు, ఈటల రాజేం దర్, బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రేమేందర్ రెడ్డి, ఆకుల విజయ, బీజేపీ సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు మోహన్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, గోదావరి నాయకులు పాల్గొన్నారు.
సహారా ఇండియా పేమెంట్స్ చెల్లించాలంటూ..
కార్మికుల ప్లకార్డుల ప్రదర్శన
సహారా ఇండియాలో పాలసీలు చేసిన ప్రజలకు సెటిల్మెంట్ ద్వారా డబ్బులు అందించడానికి కృషి చేయాలని కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్ షాను ఏజెంట్లు, పాలసీదారులు ప్లకార్డులను ప్రదర్శించి కోరారు. సిద్దిపేటలో గురువారం జరిగిన బీజేపీ విశాల జనసభ బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడుతుండగా ఆర్మూర్, నిజాంబాద్, కామారెడ్డి, మెట్ పల్లి, సిద్దిపేట, నిర్మల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన సహారా ఇండియా ఏజెంట్లు, బాధితులు ప్లకార్డులను ప్రదర్శించారు. అక్కడే ఉన్న పోలీసులు, బీజేపీ నాయకులు వారిని వారించి కూర్చోబెట్టారు.