బౌలర్లు బేజారు

బౌలర్లు బేజారు– రోజంతా చెమటోడ్చినా ఏడు వికెట్లే
– ట్రావిశ్‌ హెడ్‌, స్మిత్‌ శతక జోరు
– ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 405/7
– భారత్‌, ఆసీస్‌ మూడో టెస్టు రెండో రోజు
పచ్చికతో కూడిన పిచ్‌. వర్షంతో తొలి రోజు ఆటకు ఆటంకం. మేఘావృత వాతావరణం. సహజంగానే ఈ పరిస్థితుల్లో పేసర్లు వికెట్ల జాతర సాగిస్తారు. కానీ ట్రావిశ్‌ హెడ్‌ (152), స్టీవ్‌ స్మిత్‌ (101) శతక మోత మోగించారు. ట్రావిశ్‌ హెడ్‌ తనదైన శైలిలో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ ఇద్దరు జోరందుకోగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. భారత పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా (5/72) ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
నవతెలంగాణ-బ్రిస్బేన్‌
భారత పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా (5/72) ఐదు వికెట్ల ప్రదర్శనతో నిప్పులు చెరిగినా.. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. విధ్వంసక బ్యాటర్‌ ట్రావిశ్‌ హెడ్‌ (152, 160 బంతుల్లో 18 ఫోర్లు) మరోసారి భారత్‌పై విరుచుకుపడ్డాడు. తాజా సిరీస్‌లో మరో కండ్లుచెదిరే ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. సంప్రదాయ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ (101, 190 బంతుల్లో 12 ఫోర్లు) పేలవ ఫామ్‌కు చెక్‌ పెడుతూ సెంచరీతో కదం తొక్కాడు. అలెక్స్‌ కేరీ (45 నాటౌట్‌, 47 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. గబ్బా టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 101 ఓవర్లలో 405/7 పరుగులు చేసింది. మిచెల్‌ స్టార్క్‌ (7 నాటౌట్‌), అలెక్స్‌ కేరీ అజేయంగా క్రీజులో నిలిచారు. నేడు ఉదయం సెషన్లో వీలైనన్ని ఎక్కువ పరుగులు పిండుకునేందుకు ఆసీస్‌ ఎదురుచూస్తోంది!. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరుతో భారత్‌పై ఆతిథ్య ఆస్ట్రేలియా ఒత్తిడి పెంచింది.
హెడ్‌, స్మిత్‌ శతక్కొట్టారు
ఓవర్‌నైట్‌ స్కోరు 28/0తో రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియా ఉదయం సెషన్లో మూడు వికెట్లు కోల్పోయింది. జోరుమీదున్న ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా (21) సహా యువ ఓపెనర్‌ నాథన్‌ మెక్‌స్వీనీ (9)లను బుమ్రా సాగనంపాడు. మార్నస్‌ లబుషేన్‌ (12)ను తెలుగు తేజం నితీశ్‌ అవుట్‌ చేశాడు. ఉదయం సెషన్లో ఆసీస్‌ టాప్‌ ఆర్డర్‌పై ఒత్తిడి పెంచిన బౌలర్లు మూడు వికెట్లు వేగంగా పడగొట్టారు. కానీ స్టీవ్‌ స్మిత్‌ (101), ట్రావిశ్‌ హెడ్‌ (152) నాల్గో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ జోడీ నాల్గో వికెట్‌కు 303 బంతుల్లోనే 241 పరుగులు చేశారు. ఓ ఎండ్‌లో హెడ్‌ ధనాధన్‌ దంచికొట్టగా.. మరో ఎండ్‌లో స్మిత్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. దీంతో రెండో సెషన్లో భారత బౌలర్లకు ఒక్క వికెట్‌ కూడా దక్కలేదు. ఆడిలైడ్‌ జోరు కొనసాగించిన ట్రావిశ్‌ హెడ్‌ ఆరు ఫోర్లతో 71 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. 13 ఫోర్లతో 115 బంతుల్లో సెంచరీ బాదాడు. మరో వైపు స్టీవ్‌ స్మిత్‌ 128 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో అర్థ సెంచరీ అందుకున్నాడు. వరుస మ్యాచుల్లో పేలవ ప్రదర్శనతో ఒత్తిడిలో ఉన్న స్మీవ్‌ స్మిత్‌.. బ్రిస్బేన్‌లో ఏకంగా శతకబాదాడు. సెంచరీ తర్వాత హెడ్‌ మరింత దూకుడు పెంచాడు. 18 ఫోర్లతో 157 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ చేరుకున్నాడు. 75/3 వద్ద మొదలైన హెడ్‌, స్మిత్‌ భాగస్వామ్యం.. 316/4 వద్ద ముగిసింది. టీ విరామం అనంతరం ఆసీస్‌ పరుగుల వేటలో వెనక్కి తగ్గకపోయినా.. భారత బౌలర్లు ఓ నాలుగు వికెట్లు పడగొట్టారు. స్మిత్‌, మిచెల్‌ మార్ష్‌ (5), ట్రావిశ్‌ హెడ్‌ సహా పాట్‌ కమిన్స్‌ (20) పెవిలియన్‌కు చేరారు. కానీ చివరి సెషన్లో 31 ఓవర్లలో 171 పరుగులు పిండుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 405/7 పరుగులు చేసింది. రెండో రోజు ఆటలోనే ఆసీస్‌ ఏకంగా 405 పరుగులు చేసింది. ఓవర్‌కు నాలుగు పరుగుల చొప్పున పిండుకున్న కంగారూలు గబ్బా టెస్టుపై అప్పుడే పట్టు బిగించారు!. భారత బౌలర్లలో జశ్‌ప్రీత్‌ బుమ్రా (5/72) ఐదు వికెట్లు పడగొట్టినా..ఇతర బౌలర్లు విఫలమయ్యారు. మహ్మద్‌ సిరాజ్‌ (1/97), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (1/65), ఆకాశ్‌ దీప్‌ (0/78), రవీంద్ర జడేజా (0/76) తేలిపోయారు.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : ఉస్మాన్‌ ఖవాజా (సి) పంత్‌ (బి) బుమ్రా 21, నాథన్‌ మెక్‌స్వీనీ (సి) కోహ్లి (బి) బుమ్రా 9, మార్నస్‌ లబుషేన్‌ (సి) కోహ్లి (బి) నితీశ్‌ 12, స్టీవ్‌ స్మిత్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 101, ట్రావిశ్‌ హెడ్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 152, మిచెల్‌ మార్ష్‌ (సి) కోహ్లి (బి) బుమ్రా 5, అలెక్స్‌ కేరీ నాటౌట్‌ 45, పాట్‌ కమిన్స్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 20, మిచెల్‌ స్టార్క్‌ నాటౌట్‌ 7, ఎక్స్‌ట్రాలు : 33, మొత్తం :(101 ఓవర్లలో 7 వికెట్లకు) 405.
వికెట్ల పతనం : 1-31, 2-38, 3-75, 4-316, 5-326, 6-327, 7-385.
బౌలింగ్‌ : జశ్‌ప్రీత్‌ బుమ్రా 25-7-72-5, మహ్మద్‌ సిరాజ్‌ 22.2-4-97-1, ఆకాశ్‌ దీప్‌ 24.2-5-78-0, నితీశ్‌ కుమార్‌ 13-1-65-1, రవీంద్ర జడేజా 16-2-76-0.