– మెల్బోర్న్లో తొలి రోజు ఆట ఉత్కంఠభరితం
– కాన్స్టాస్, లబుషేన్, ఖవాజా, స్మిత్ అర్థ సెంచరీలు
– జశ్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్ల ప్రదర్శన
బాక్సింగ్ డే టెస్టులో ఎవరూ తగ్గలే!. ఆతిథ్య ఆస్ట్రేలియా బ్యాటర్లు అర్థ సెంచరీలతో కదం తొక్కగా.. కాస్త ఆలస్యమైనా భారత బౌలర్లు వికెట్ల వేటలో జోరందుకున్నారు. లబుషేన్ (72), స్మిత్ (68 నాటౌట్), కాన్స్టాస్ (60), ఖవాజా (57) రాణించటంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. జశ్‌ప్రీత్ బుమ్రా (3/75) మూడు వికెట్ల ప్రదర్శనతో బాక్సింగ్ డే టెస్టులో భారత్‌ను రేసులో నిలిపాడు. తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా 311 పరుగులు చేయగా, భారత్ 6 వికెట్లు పడగొట్టింది.
నవతెలంగాణ-మెల్బోర్న్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కీలక నాల్గో టెస్టులో తొలి రోజే భారత్, ఆస్ట్రేలియాలు వాతావరణాన్ని వేడెక్కించాయి. ఆటతో, ఆవేశంతో మైదానంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి!. మార్నస్ లబుషేన్ (72, 145 బంతుల్లో 7 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (68 నాటౌట్, 111 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), శామ్ కాన్స్టాస్ (60, 65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఉస్మాన్ ఖవాజా (57, 121 బంతుల్లో 6 ఫోర్లు) అర్థ సెంచరీలతో మెరిశారు. బ్యాటింగ్‌కు అనుకూలించిన తొలి రోజు పిచ్‌పై కంగారూ బ్యాటర్లు కదం తొక్కారు. ఆఖరు సెషన్లో భారత బౌలర్లు సమిష్టిగా చెలరేగి తొలి రోజు లెక్క సమం చేసే ప్రయత్నం చేశారు. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు వికెట్ల వేటలో బాధ్యత పంచుకున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 311/6తో కొనసాగుతుంది. స్టీవ్ స్మిత్‌తో కలిసి కెప్టెన్ పాట్ కమిన్స్ (8 నాటౌట్) అజేయంగా ఆడుతున్నాడు.
టాప్ ఆర్డర్ జోరు
మెల్బోర్న్లో గురువారం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పిచ్‌పై పచ్చిక ఉన్నప్పటికీ ఆరంభం నుంచీ సీమర్లకు సహకారం లభించలేదు. సీమ్, పేస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉండలేదు. సహజంగానే ఈ పరిస్థితులను ఆస్ట్రేలియా సద్వినియోగం చేసుకుంది. కీలక టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు నలుగురు అర్థ సెంచరీలతో రాణించారు. తొలి రెండు సెషన్ల పాటు బ్యాటర్ల దూకుడు కొనసాగింది. అరంగ్రేట బ్యాటర్ శామ్ కాన్స్టాస్ (60) కెరీర్ తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడాడు. తొలి సెషన్లో జశ్‌ప్రీత్ బుమ్రాను చక్కగా ఎదుర్కొన్నాడు. ర్యాంప్ షాట్లు, రివర్స్ స్వీప్ షాట్లు సహా క్రీజు వదలి ముందుకొచ్చి పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 52 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన కాస్స్టాస్ ఆసీస్‌ను ముందుండి నడిపించాడు. మరో ఎండ్‌లో ఉస్మాన్ ఖవాజా సైతం ఫామ్‌లోకి వచ్చాడు. ఆరంభంలో బుమ్రాకు వికెట్లు దక్కే అవకాశాలు చేజారటంతో.. ఆసీస్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. స్పిన్నర్ రవీంద్ర జడేజా మాయతో భారత్‌కు తొలి వికెట్ దక్కింది. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన కాన్స్టాస్ లంచ్ విరామం ముంగిట పెవిలియన్ చేరాడు. ఖవాజాతో జతకలిసిన మార్నస్ లబుషేన్ (72) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. తొలి సెషన్లో 25 ఓవర్లలో ఆసీస్ 112 పరుగులు చేసింది. భారత్‌కు ఒక్క వికెట్ దక్కింది.
లంచ్ తర్వాత సైతం ఆసీస్ దూకుడుగా ఆడింది. ఈ సెషన్లో ఆసీస్ 28 ఓవర్లలో 64 పరుగులే చేసింది. కానీ ఒక్క వికెట్‌నే కోల్పోయింది. ఖవాజా 101 బంతుల్లో ఆరు ఫోర్లతో అర్థ సెంచరీ సాధించగా.. మార్నస్ లబుషేన్ ఆరు ఫోర్లతో 114 బంతుల్లో ఫిఫ్టీ అందుకున్నాడు. ఖవాజా, లబుషేన్ నెమ్మదిగా ఆడారు. అర్థ సెంచరీ తర్వాత ఖవాజాను బుమ్రా అవుట్ చేశాడు. దీంతో 45వ ఓవర్లో భారత్‌కు రెండో వికెట్ లభించింది. గత టెస్టులో ఫామ్‌లోకి వచ్చిన స్టీవ్ స్మిత్ (68 నాటౌట్) సైతం దంచికొట్టాడు. అచ్చొచ్చిన సహచరుడు మార్నస్ లబుషేన్ జతగా మూడో వికెట్‌కు 83 పరుగులు జోడించాడు. స్మిత్ ఐదు ఫోర్లతో 71 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేశాడు. దీంతో ఆసీస్ భారీ స్కోరు దిశగా అడుగులు వేసింది.
ఆఖర్లో అదరగొట్టారు
65 ఓవర్లలో 237 పరుగులతో ఆసీస్ పటిష్టంగా కనిపించింది. ట్రావిశ్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ బ్యాటింగ్‌కు రావాల్సి ఉండటంతో.. భారత్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఇక్కడ లబుషేన్‌ను బుట్టలో వేసిన వాషింగ్టన్ సుందర్.. వికెట్ల వేటలో వేగానికి బాటలు వేశాడు. మూడో సెషన్లో 74 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు తీసిన భారత్.. లెక్క సమం చేసింది. ట్రావిశ్ హెడ్ (0)ను బుమ్రా అద్భుత బంతితో బౌల్డ్ చేయగా.. మిచెల్ మార్ష్ (4)ను పంత్ సాయంతో సాగనంపాడు. అలెక్స్ కేరీ (31)ను ఆకాశ్ దీప్ అవుట్ చేశాడు. దీంతో 237/2 నుంచి 299/6తో ఆసీస్‌ను కట్టడి చేశారు. లోయర్ ఆర్డర్లో అలెక్స్ కేరీ ఒక్కడే ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఉదయం సెషన్లో కాన్స్టాస్.. బుమ్రాపై పైచేయి సాధించాడు. కానీ ఆ తర్వాత గొప్పగా పుంజుకున్న బుమ్రా మూడు వికెట్లతో అదరగొట్టాడు. స్పిన్నర్లు జడేజా, వాషింగ్టన్ సహా పేసర్ ఆకాశ్ దీప్ వికెట్ల వేటలో బుమ్రాకు అండగా నిలిచాడు. మహ్మద్ సిరాజ్ 15 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టలేదు.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : శామ్ కాన్స్టాస్ (ఎల్బీ) జడేజా 60, ఉస్మాన్ ఖవాజా (సి) రాహుల్ (బి) బుమ్రా 57, మార్నస్ లబుషేన్ (సి) కోహ్లి (బి) వాషింగ్టన్ 72, స్టీవ్ స్మిత్ నాటౌట్ 68, ట్రావిశ్ హెడ్ (బి) బుమ్రా 0, మిచెల్ మార్ష్ (సి) పంత్ (బి) బుమ్రా 4, అలెక్స్ కేరీ (సి) పంత్ (బి) ఆకాశ్ 31, పాట్ కమిన్స్ నాటౌట్ 8, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (86 ఓవర్లలో 6 వికెట్లకు) 311.
వికెట్ల పతనం : 1-89, 2-154, 3-237, 4-240, 5-246, 6-299.
బౌలింగ్ : జశ్‌ప్రీత్ బుమ్రా 21-7-75-3, మహ్మద్ సిరాజ్ 15-2-69-0, ఆకాశ్ దీప్ 19-5-59-1, రవీంద్ర జడేజా 14-2-54-1, నితీశ్ కుమార్ రెడ్డి 5-0-10-0, వాషింగ్టన్ సుందర్ 12-2-37-1.
గిల్‌కు అవుట్
నాలుగేండ్ల క్రితం మెల్‌బోర్న్‌లోనే టెస్టు అరంగ్రేటం చేసిన శుభ్‌మన్ గిల్.. తాజా బాక్సింగ్ డే టెస్టులో బెంచ్‌కు పరిమితం అయ్యాడు. గాయంతో పెర్త్ టెస్టుకు దూరమైన గిల్.. ఆడిలైడ్, బ్రిస్బేన్‌లో టెస్టుల్లో 60 పరుగులు చేశాడు. సమతుల్యత కోసం ముగ్గురు ఆల్రౌండర్లను తుది జట్టులోకి తీసుకుంది. నితీశ్ కుమార్, రవీంద్ర జడేజాలకు తోడు వాషింగ్టన్ సుందర్ సైతం తుది జట్టులో నిలిచాడు.మెల్బోర్న్ పిచ్ నుంచి స్పిన్నర్లకు సహకారం ఉండబోదని క్యూరేటర్ మాట్ స్పష్టం చేశాడు. అధిగ ఉష్ణోగ్రతలతో పిచ్‌పై పగుళ్లు ఏర్పడవచ్చనే అంచనాతో టీమ్ ఇండియా ఇద్దరు స్పిన్నర్లతో రంగంలోకి దిగింది.
వర్షం సూచనలు!
బ్రిస్బేన్‌లో ఫలితాన్ని వరుణుడు శాసించగా.. మెల్‌బోర్న్‌లోనూ ఆటకు వర్షం అంతరాయం కలిగించే ప్రమాదం కనిపిస్తోంది. గురువారం రాత్రంతా ఇక్కడ వర్షం సూచనలు ఉన్నాయి. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు వర్షం కురిసే అవకాశాలు 60 శాతం వరకు ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం 1 తర్వాత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం, మేఘావృత వాతావరణం మెల్బోర్న్ పిచ్‌పై పరుగుల వేటను కఠినతరం చేయనున్నాయి. పిచ్ నెమ్మదిగా బ్యాటింగ్ నుంచి బౌలింగ్‌కు సహకారించటం ఆరంభం కానుంది. ఇది ఓ రకంగా టీమ్ ఇండియాకు ప్రతికూలమే అని చెప్పవచ్చు!.
కోహ్లికి జరిమానా
విరాట్ కోహ్లిపై మ్యాచ్ రిఫరీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత, ఓ డీ మెరిట్ పాయింట్ విధించాడు. జరిమానాను కోహ్లి అంగీకరించటంతో, ఈ అంశంలో ఎటువంటి విచారణ ఉండబోదు. 19 ఏండ్ల ఆసీస్ కుర్ర ఓపెనర్ శామ్ కాన్స్టాస్తో కోహ్లి మైదానంలో గొడవ పడ్డాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్ అనంతరం ఆటగాళ్లు ఎండ్లు మారుతుండగా.. కాన్స్టాస్, కోహ్లిలు ఢకొీన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మరో బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా, అంపైర్ మైకల్ గాఫ్ జోక్యంతో అక్కడితో పరిస్థితి సద్దుమణిగింది. టీవీ రీప్లేలు చూసిన తర్వాత.. మాజీ క్రికెటర్లు రికీ పాంటింగ్, రవి శాస్త్రిలు కోహ్లిని తప్పుబట్టారు. ఐసీసీ క్రమశిక్షణ నియామవళి ప్రకారం లెవల్ 1 తప్పిదం కింద విరాట్ కోహ్లికి జరిమానా విధించారు.