– రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లో ఘటన
నవతెలంగాణ-మియాపూర్
కుక్కల దాడిలో బాలుడు మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిక్షాటన చేస్తున్న కుటుంబానికి చెందిన బాలుడు సాత్విక్(6) మంగళవారం సాయంత్రం ఆడుకుంటానని వెళ్లి కనిపించకుండా పోయాడు. ఎంత వెతికినా బాలుడి ఆచూకీ లభించలేదు. కాగా, బుధవారం ఉదయం మక్తాలోని నిర్మానుష్య ప్రాంతంలో బాలుని మృతదేహం కనిపించింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుని శరీరంపై ఉన్న గాయాలను బట్టి కుక్కలు దాడి చేసినట్టు గుర్తించారు. డంపింగ్ యార్డు కావడంతో అక్కడ అధికంగా కుక్కలు ఉంటాయని, కుక్కలే దాడి చేసి ఉంటాయని నిర్ధారించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.