– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నేటి నుంచి రెండు రోజుల పాటు జరిగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అవగాహన తరగతులను బహిష్కరిస్తున్నట్టు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. తమ హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. శాసనసభ సమావేశాల తొలిరోజే తమను లోపలికి రానీయకుండా అరెస్టు చేయించారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు ఎత్తిచూపితే అరెస్టు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనూ తమ గొంతు నొక్కేలా వ్యవహరించారని తెలిపారు. తమ శాసనసభ్యుల్లో అతి తక్కువ మంది మాత్రమే కొత్త వాళ్లున్నారని తెలిపారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్ వ్యవహారశైలికి నిరసనగా రేపటి నుంచి జరగనున్న అవగాహన తరగతులను బహిష్కరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా పార్టీలకతీతంగా వివక్ష లేకుండా వ్యవహరించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.