నేటి నుంచి విధుల బహిష్కరణ

– టీజూడా, టీఎస్‌ఆర్డీఏ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
డిమాండ్ల సాధన కోసం బుధవారం నుంచి అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలను బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (టీజూడా), తెలంగాణ సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (టీఎస్‌ఆర్డీఏ)లు తెలిపాయి. ఈ మేరకు బుధవారం రెండు సంఘాల నాయకులు వేర్వేరుగా డీఎంఈకి విధులను బహిష్కరిస్తున్నట్టు లేఖలు అందజేశారు. కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై హత్యాచార ఘటనపై ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల్లో నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వాల నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో విధులను బహిష్కరించాలని జాతీయ స్థాయిలో ఫైమా, ఫోర్డా, ఆర్డీఏ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో రాష్ట్రంలోనూ ఆయా సంఘాలు విధులు బహిష్కరించనున్నట్టు ప్రకటించాయి. హత్యాచార ఘటనపై విచారణను సీబీఐకి అప్పగించి పారదర్శకంగా విచారణ జరిపించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కేసులో వాస్తవాలను మార్చాలని ప్రయత్నించిన ప్రతి ఒక్కరినీ సస్పెండ్‌ చేయాలి. బాధితురాలి కుటుంబానికి తగిన పరిహారం ఇవ్వాలి. జాతీయ స్థాయిలో అన్ని పని ప్రదేశాల్లో మహిళా వైద్యులకు ప్రత్యేక రూంలు, సరిపడినన్ని సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బందిని నియమించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లను నెరవేర్చే వరకు తమ విధుల బహిష్కరణ కొనసాగుతుందని హెచ్చరించారు.