– క్యూ3లో రూ.3,181.42 కోట్ల లాభాలు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ప్రముఖ చమురు కంపెనీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. 2023-24 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 82 శాతం వృద్ధితో రూ.3,181.42 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ3లో రూ.1,747.01 కోట్ల లాభాలు ప్రకటించింది. ఇదే సమయంలో రూ.1.33 లక్షల కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన త్రైమాసికంలో రూ.1.33 లక్షల కోట్లుగా నమోదయ్యింది. రెవెన్యూ తగ్గిన లాభాలు పెరగడం విశేషం. గడిచిన అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికంలో సంస్థ వ్యయాలు రూ.1.26 లక్షల కోట్లకు తగ్గాయి. 2022-23 ఇదే క్యూ3లో రూ.1.31 లక్షల కోట్ల ఖర్చులు చూపింది. తాజా ఫలితాలతో మరో త్రైమాసికంలోనూ మెరుగైన ప్రగతిని కనబర్చామని నిరూపణ అయ్యిందని బీపీసీఎల్ ఛైర్మన్, ఎండి జి క్రిష్ణ కుమార్ పేర్కొన్నారు. నిర్వహణలో మరింత ప్రగతి కనబర్చడంతో పాటుగా వృద్థిలోనూ రాణించడంపై దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. సోమవారం ఎన్‌ఎస్‌ఇలో బీపీసీఎల్ షేర్ ధర 3.92 శాతం పెరిగి రూ.493 వద్ద ముగిసింది.