ఘనంగా బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవం 

నవతెలంగాణ – పెద్దవంగర

సమాజంలోని మూఢవిశ్వాసాలను ఖండిస్తూ, అజ్ఞాన అంధకారంలో మగ్గిపోతున్న మానవాళికి జ్ఞానోదయాన్ని కలిగించిన క్రాంతిదర్శి వీరబ్రహ్మేంద్ర స్వామి అని మండల విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు బోగోజు సురేష్ బాబు, బోగోజు రత్నవిలాచారి అన్నారు. శనివారం మండల కేంద్రంలో బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జెండా ఆవిష్కరించి, మాట్లాడారు. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తన తత్వాలతో సమాజంలో చైతన్యాన్ని తీసుకు వచ్చారని, ఆయన ఒక గొప్ప కాలజ్ఞాని అని కొనియాడారు. ఏనాడో కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ప్రస్తుతం జరుగుతుంటే అది చూసి ప్రజలు చర్చించుకోవడం గమనార్హం అన్నారు. సర్వ మానవ కల్యాణాన్ని ఆశించిన ఆయన ప్రతి ఒక్కరికి మార్గదర్శకులని చెప్పారు. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి కావాల్చిన గౌరవం దక్కలేదని, ప్రతి యూనివర్సిటీలో వారి జీవితంపై పరిశోధనలు చేసేందుకు ప్రోత్సాహం అందించాలన్నారు. కార్యక్రమంలో నరేంద్ర చారి, సోమయ్య, రాంప్రసాద్, సతీష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.