– తగ్గుతున్న కేసీఆర్ చరిష్మా ..!
– క్యాడర్, ప్రజల్లో అసంతృప్తి..!
– పండుగలకు భారంగా మారిన ఖర్చులు
– బలపడుతున్న ప్రతిపక్షాలు
– నేతలకు టెన్షన్ పెట్టిస్తున్న సర్వేలు
– ఉమ్మడి జిల్లాలో గులాబీకి ఆదరణ కరువు
నవతెలంగాణ-మిర్యాలగూడ
మూడోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలన్న కేసీఆర్ ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఎన్నికలకు నాలుగు నెలల ముందే అధికార బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో రోజురోజుకు కారు స్పీడ్ కు బ్రేకులు పడుతున్నాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేసీసఆర్ అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి నిజమైన అర్హులకు అందక పోవడంతో అటు ప్రజల్లో, తమ నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్చకపోవడంతో ఇటు ద్వితీయ శ్రేణి క్యాడర్లో ఆసంతృప్తి రోజురోజుకు పెరిగిపోతుంది. కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్చాలని కొందరు నాయకులు పట్టబడుతున్నారు. అభ్యర్థులను మార్చకపోతే ఎన్నికల్లో సహకరించబోమని తేల్చి చెప్పిస్తున్నారు. దీంతో తమ గెలుపు ప్రశ్నార్థకంగా మారిపోతుందని ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. అసంతప్తులను బుజ్జగించేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. పైగా నాలుగు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించడంతో వచ్చే రెండు మాసాలు జరగబోయే పండుగలు ఆర్థిక భారంగా మారాయి. పండుగలకు ప్రజలకు సహకరించకపోతే ఎక్కడ వ్యతిరేకత వస్తుందని భావనతో అభ్యర్థులు తప్పని పరిస్థితుల్లో ఆర్థిక భారాలను మోస్తున్నారు. పైగా సొంత క్యాడర్‌ను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో ఇప్పటి నుంచే అభ్యర్థులు రోజుకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. క్యాడర్ లో ప్రజల్లో నెలకొన్న అసంతప్తి కారణంగా కేసీఆర్ చరిష్మా కూడా రోజురోజుకు తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు బలపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల కుండా ప్రతిపక్షాలన్నీ ఏకం కావడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కారు స్పీడ్ కు బ్రేకులు పడే పరిస్థితి నెలకొంది. దీంతో సెట్టింగ్ ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం కనిపించడం లేదు.
తగ్గుతున్న కేసీఆర్ చరిష్మా
ఎన్నికలంటే ఎంతో ఇంట్రెస్ట్‌గా ముందుకెళ్లే కేసీఆర్ చరిష్మా రోజురోజుకు తగ్గిపోతుంది. ఓటర్లను మచ్చిక చేసుకునే రాజకీయ చాణిక్యుడుగా పేరుందిన కేసీఆర్ కు ప్రజల ఆదరణ తగ్గుతుంది. ఎన్నికల ముందు అనేక సంక్షేమ పథకాలతో జిమ్మిక్కులు చేస్తూ ప్రజల దష్టి మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతా తనకు అనుకూలంగా ఉందని భావించే లోపు ప్రజల నుండి సంతృప్తి కూడా ఎదురవుతుంది. తమ సమస్యలు పరిష్కరించాలని ఆయా రంగాలలో పనిచేసే కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. వారికి గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. రోజులు, నెలలు తరబడి ఆందోళన చేస్తున్న ప్రభుత్వం ప్రకటించకపోవడంతో కిందిస్థాయి ఉద్యోగస్తుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. ప్రజా ప్రతినిధుల తీరతో పై స్థాయి అధికారులు సైతం అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో పంచాయతీ కార్యదర్శులు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని నెలల తరబడి ఆందోళన చేశారు. అయినా వారి సమస్యలను పరిష్కరించలేదు. చివరికి పంచాయతీ కార్యదర్శలను చేసిన సేవలను గుర్తించి క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు కానీ అది కూడా ఇప్పటివరకు అమలు కాలేదు. అదేవిధంగా గ్రామపంచాయతీ సిబ్బంది, మెప్మాలో పనిచేసే సిబ్బంది నెలల తరబడి సమ్మె చేశారు. ఇప్పుడు అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. త్వరలో ఆయా కళాశాలలో పనిచేసే కాంట్రాక్టు అధ్యాపకులు కూడా సమ్మె చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి తోడు అనేక సంక్షేమ పథకాలు అమలులో నిజమైన అర్హులకు రాకపోవడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అన్ని వర్గాల ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ చరిస్మా పడిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
క్యాడర్లో… ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
అధికార బీఆర్‌ఎస్ పార్టీలో వ్యతిరేకత తీవ్రతరం అవుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాల్లో అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరి పనితీరుపై ద్వితీయ శ్రేణి క్యాడర్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని నాగార్జునసాగర్, దేవరకొండ, కోదాడ, నల్గొండ నియోజవర్గాలలో అభ్యర్థులను మార్చాలని బీఆర్ ఎస్ నాయకులు పట్టుబడుతున్నారు వారికి వ్యతిరేకంగా సభలు సమావేశాలు నిర్వహిస్తూ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, కవితలకు ఇప్పటికే కలిసి విన్నవించుకున్నారు. వారి నుంచి బుజ్జగింపులే తప్ప ఇతర ఏ హామీ రాకపోవడంతో క్యాడర్ మొత్తం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. రెబల్గా పోటీ చేసేందుకు వెనకాడ బొమని ప్రకటనలు చేస్తూ హెచ్చరిస్తున్నారు. మిగిలిన సూర్యాపేట, హుజూర్నగర్, మిర్యాలగూడ, నకిరేకల్, భువనగిరి, మునుగోడు, ఆలేరు తుంగతుర్తి నియోజకవర్గాలలో కింది స్థాయి కేడర్లో నేతల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి బయటపడుతుంది. తమ నేతల ముందు గంభీరంగా ఉన్నప్పటికీ బయట మాత్రం అధికార టీఆర్‌ఎస్ లో ఉండడం వల్ల తమకేమీ లాభం కాలేదని లోలోపుల మదన పడుతున్నారు. కొన్నిచోట్ల క్యాడర్ బహిరంగంగానే నేతల తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల అమలవుతున్న దళిత, బీసీ, మైనార్టీ బందు, గృహలక్ష్మి లాంటి పథకాలు సొంత పార్టీ కార్యకర్తలకే ఇవ్వడం వల్ల ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. కార్యకర్తల్లోనూ కొందరికే పథకాలు దక్కడంతో మిగతావారు అసంతృప్తిలో ఉన్నారు. పథకాలు రాక నిజమైన పేదలు ఎక్కువమంది ప్రభుత్వం, ఎమ్మెల్యేల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమం అందుతుందని వేలాది రూపాయలు ఖర్చుపెట్టి దరఖాస్తు చేసుకున్న అవి రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉండి ప్రజాప్రతినిదుల పై మండిపడుతున్నారు. మొత్తం మీద అధికార బీఆర్‌ఎస్ పార్టీపై, ప్రజాప్రతినిదులపై అసంతప్తి వెలవడుతుంది.
టెన్షన్ పెట్టిస్తున్న సర్వేలు
ఎలాగైనా ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న కేసీఆర్ ప్రతి 15 రోజులకు ఓసారి నియోజకవర్గాలలో ప్రత్యేకంగా సర్వేలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు, వారి మీద ప్రజలకు ఉన్న ఆదరభిమానాలు, బలాలు బలహీనతలు, ప్రతిపక్ష పార్టీల బలాలు బలహీనతలను ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా తెలుసుకుంటున్నారు. నేతలపై ఉన్న వ్యతిరేకతను నివారించేందుకు నేతలకు దిశ, నిర్దేశం చేస్తున్న ఫలితం లేకుండా పోతుంది అసంతప్తిగా ఉన్న కింది స్థాయి క్యాడర్ ను ఒకటికి నాలుగు సార్లు బుజ్జగించి చివరికి వినకపోతే బెదిరింపులకు దిగుతున్నట్లు విశ్వాసనీయ వర్గాల సమాచారం. సర్వే రిపోర్ట్ లు ఎలా వస్తుందో బాస్ నుండి నుండి ఎలాంటి చివాట్లు పడాల్సి వస్తుందోనని నేతల్లో టెన్షన్ నెలకొంది. దీనికి తోడు వచ్చే రెండు మాసాల్లో వినాయక చవితి దసరా దీపావళి వంటి పెద్ద పండుగలు ఉన్నాయి. వీటికి పెద్ద ఎత్తున చందాలు రాయాల్సి ఉంటుందని ఇది ఇప్పటి నుంచే తలకు మించిన భారం మని ఆందోళన చెందుతున్నారు.
బలపడుతున్న ప్రతిపక్ష పార్టీలు
కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు కంచు కోటగా నిలిచిన ఉమ్మడి నల్గొండ జిల్లా మారిన రాజకీయ సమీకరణ రీత్యా గులాబీ మయంగా మారింది. ఇప్పుడు ప్రభుత్వం ప్రజా ప్రతినిధుల వ్యతిరేకత వల్ల తిరిగి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు పుంజుకుంటున్నాయి. కాంగ్రెస్‌తో రాజకీయ ఉద్దండులు ఉన్న ఈ జిల్లాలో కమ్యూనిస్టులు తోడు కావడంతో ప్రతిపక్షాల బలం మరింత పెరిగింది. పార్టీని శాసించే స్థాయిలో ఉన్న కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి నేతలు ఈ జిల్లాలోనే ఉన్నారు. వీరు ప్రాతినిధ్య వహించేందుకు ప్రయత్నిస్తున్న నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున పట్టు ఉన్నది. దీనితోడు ఒక్కొక్కరు మరో రెండు, మూడు నియోజకవర్గాలలో గెలుపోవటములు ప్రభావితం చూపే స్తాయిలో ఉన్నారు. ఆ నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఉన్న వ్యతిరేకత వీరికి లాభం చేకూరుస్తుందని, వీరికి సునాశయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కమ్యూనిస్టులకు మంచిపట్టున్న ఈ జిల్లాలో కాంగ్రెస్ తో జతకట్టడంతో వీరి బలం మరింత పెరిగింది.మిర్యాలగూడ, నకిరేకల్, నల్గొండ, హుజూర్‌నగర్, కోదాడ, మునుగోడు, దేవరకొండ, ఆలేరు, భువనగిరి నియోజవర్గాలలో సీపీఐ(ఎం), సీపీఐలకు మంచి బలం ఉంది. మిర్యాలగూడ మునుగోడు నియోజకవర్గలలో గెలిచే సత్తా ఉంది. గతంలో కూడా గెలిచిన దాఖలాలు ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గం వీరు బలపరిచిన అభ్యర్థులు గెలిచేందుకు అవకాశం ఎక్కువగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఆయా పార్టీల అగ్ర నేతలు ఇప్పటికే ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో ప్రతిపక్ష పార్టీలు గెలిచి క్లీన్ సీప్ చేస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ జిల్లాలో అధికార బీఆర్‌ఎస్ పార్టీకి గడ్డు కాలమేనని ప్రజలు చెప్పుకోవడం విశేషం.