మన కంచంలో బ్రెజిల్‌ పప్పు

Brazil lentil in our glass– దిగుమతులపైనే మోడీ సర్కార్‌ దృష్టి
– శాస్త్రవేత్తల పరిశోధనలు..దిగుబడులు ఉన్నా విదేశాలపైనే ఆధారం
భారతదేశంలో పండించే పంటలకు బహిరంగ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంటోంది. విదేశాల్లోనూ ఎగబడి కొనుగోలు చేస్తారు. అయితే ఇప్పటికే నూనెలు..ఇతర వస్తువులను విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటుండగా ..ఇకపై మన కంచంలోకి బ్రెజిల్‌ పప్పు కూడా రాబోతోంది. విదేశాల నుంచి అవసరం ఉన్నా.. లేకపోయినా మోడీ పర్యటనల్లో  ఎంఓయూలు కుదుర్చుకోవటం సర్వసాధారణమైపోయింది. అయితే ఇక్కడి రైతు మద్దతు ధర ఇవ్వాలని వీధుల్లోకొచ్చి మొత్తుకుంటున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. మీరు  పంట పండించకపోయినా..విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటామన్న ధోరణి కనిపిస్తోంది.
న్యూఢిల్లీ: పప్పులు…ముఖ్యంగా కందిపప్పు, మినపపప్పు వాణిజ్యంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవ డానికి భారత్‌, బ్రెజిల్‌ కృషి చేస్తున్నాయి. ఇటీవల రెండు దేశాల అధికారులు సమావేశమై దీనిపై చర్చించారు. పప్పుల సరఫరాలో బ్రెజిల్‌ను విశ్వసనీయ దేశంగా తాము పరిగణి స్తున్నామని ఈ సందర్భంగా భారత అధికారులు తెలిపారు. పప్పు ధాన్యాలకు సంబంధించిన ఆహార భద్రతలో ఉమ్మడి భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడం పై చర్చించామని న్యూఢిల్లీలోని బ్రెజిల్‌ రాయబార కార్యాలయంలో పని చేస్తున్న ఉన్నతాధికారి మరీసియో తెలిపారు.
గత సంవత్సరం బ్రెజిల్‌ నుండి మూడు వేల టన్నుల మినపపప్పును దిగుమతి చేసుకున్నామని వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ ఇటీవల చెప్పారు. పెరుగుతున్న దేశీయ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మరో 20 వేల టన్నులను దిగుమతి చేసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ద్వైపాక్షిక వ్యవసాయ వాణిజ్యాన్ని విస్తరించుకునేందుకు పప్పు ధాన్యాలు దోహదపడతాయని ఆయన చెప్పారు. కాగా దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి పడిపోతున్న నేపథ్యంలో మినుము, కంది పంటలు పండించాలని బ్రెజిల్‌లోని వ్యాపారులు, అధికారులను రోహిత్‌ కుమార్‌ గత నవంబరులో కోరారు.
ప్రపంచంలో భారత్‌లోనే అత్యధికంగా పప్పు ధాన్యాల పంటలు పండిస్తున్నారు. వాటి వినియోగం కూడా మన దేశంలో ఎక్కువే. ఏటా 28 మిలియన్‌ టన్నుల పప్పులు అవసరమవుతున్నాయి. దేశీయంగా డిమాండ్‌ పెరుగు తుండడంతో పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకోవాలని భారత్‌ భావిస్తోంది.
భారత్‌లో పప్పుధాన్యాల పంటల ఉత్పత్తి ఎంతంటే..
ప్రపంచ వ్యాప్తంగా 171 దేశాలలో పప్పుధాన్యపు పంటలను పండిస్తున్నారు. మన భారత దేశం పప్పుధాన్యాల పంటల ఉత్పత్తి 25 శాతంగా, ఆహారంగా తీసుకోవడం 27 శాతంగా ఉన్నది. అంటే ఈ లెక్కన గ్యాప్‌ చాలా తక్కువ. కాని కేంద్రం దిగుమతి చేసుకోవడంలోనే 14 శాతం ముందుంది. ఆహార గింజల విస్తీర్ణంలో పప్పుధాన్యాలు 20 శాతం, అదే విధంగా ఉత్పత్తిలో 7-10 శాతం వరకు ఆక్రమిస్తున్నాయి. పప్పుధాన్యాలను ఖరీఫ్‌, రబీ కాలంలో పండిస్తున్నప్పటికీ, రబీలో పప్పుధాన్యపు పంటల సాగు 60 శాతము వరకు ఉంది. పప్పుధాన్యపు పంటల విస్తీర్ణం 1950-1951వ సంవత్సరములో 19 మి.హెగా వుండగా, 2013-14వ సంవత్సరంలో 25 మి.హె.గా వుంది. అదే కాలంలో ఉత్పత్తి 8.41 మి.ట. నుండి 19.27 మి.ట. గా పెరిగింది. మన దేశంలో పప్పుధాన్యాలను పండించే ఐదు రాష్ట్రాలు వరుసగా మధ్యప్రదేశ్‌, మహరాష్ట్ర రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ , కర్నాటక ఉన్నాయి.
మన దేశంలో పప్పుధాన్యపు పంటల ఉత్పాదకత హెక్టారుకు 440 కిలోల (1950-51) నుంచి 769 కిలోల (2013-14) వరకు, అంటే 46 శాతం పెరిగింది. ఉత్పాదకత ఫ్రాన్స్లో హెక్టారుకు 4,219 కిలోల, కెనడాలో 1986 కిలోలు, ఆమెరికాలో 1882 కిలోలు, రష్యాలో 1648 కిలోలు, చైనాలో 1,596 కిలోలుగా వుండగా, మన దేశంలో 764 కిలోలు మాత్రమే. పప్పుధాన్యాపు పంటల విస్తీర్ణం (0.08 శాతం), ఆహార గింజలు (0.21 శాతం), వరి (0.058 శాతం), గోధుమ (1.7 శాతం) మరివు నూనెగింజలు (1.4 శాతం) తో పోలిస్తే వార్షిక సమ్మేళన వృద్ధి రేటు (సీఏజీఆర్‌) 1950-51 వ సంవత్సరం నుంచి 2013-14 సంవత్సరం వరకు తగ్గింది. కారణం, ఇప్పటికీ మన దేశంలో పప్పుధాన్యాలను సారవంతం లేని నేలల్లో , చౌడు నేలల్లో పండించడమే.
అంతే కాకుండా ఎక్కువగా వర్షాధారంగా పండిస్తుండమే. అయితే ఈ పంటను కూడా మధ్యదళారులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలించటంతో అటు రైతుకు, ఇటు వినియోగదారులని నిలువునా మోసం జరుగుతోంది. దీనిపై మోడీ ప్రభుత్వం కట్టడి చేయాల్సి ఉండగా..అందుకు భిన్నంగా వ్యవహరించటంతో..విదేశాల నుంచి దిగుమతిపైనే కేంద్రం ఆధారపడుతోంది.
పరిశోధనలు ఉన్నా..
జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు , కృషి విజ్ఞాన కేంద్రాలు పప్పుధాన్యపు పంటలలో అధిక దిగుబడి నిచ్చే రకాలు, పురుగు, తెగుళ్ళను తట్టుకునే రకాలు, ఆధునిక సాంకేతిక పద్ధతులపై ప్రదర్శనా క్షేత్రాలు, శిక్షణా కార్యక్రమాలు , ఇతర విస్తరణ కార్యక్రమాల ద్వారా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయడం జరుగుతోంది. 2010-11వ సంవత్సరం నుంచి జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా పప్పుధాన్యాపు పంటలలో ఉత్పాదకతను పెంచడానికి రైతుల పొలాల్లో మొదటి తరహా ప్రదర్శనా క్షేత్రాలను నిర్వహించి, రైతులను ప్రోత్సహించడం జరుగుతోంది. అలాగే వ్యవసాయం , రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో జాతీయ ఆహార భద్రతా పథకం ద్వారా కూడా పప్పుధాన్యపు పంటలలో ప్రదర్శనా క్షేత్రాలు నిర్వహించడం జరుగుతోంది.
ఐక్యరాజ్యసమితి, అన్ని సభ్యదేశాల అనుమతితో 2016వ సంవత్సరాన్ని ”ప్రపంచ పప్పధాన్యపు పంటల సంవత్సరంగా” ప్రకటించింది, పప్పుధాన్యపు పంటల ఉపయోగాలను, దిగుబడులు పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలను, పోషకాహారంలో పప్పధాన్యపు ప్రాముఖ్యతను గురించి తెలియజేయడానికి మోడీ ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపటంలేదని రైతులు, రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
విదేశీ దిగుమతులు ఎంతంటే..
మన దేశంలో పప్పుధాన్యాలను ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, ఉత్పత్తిలో 20 శాతం వరకు ఇతర దేశాల (కెనడా, మయన్మార్‌, రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా) నుంచి దిగుమతి అవుతున్నాయి. 2001-02లో దిగుమతి ఖర్చు రూ. 3,160 కోట్లు వుండగా, 2013-14లో రూ.10,551 కోట్లు వుంది. తలసరి పప్పుధాన్యాల లభ్యత మన దేశంలో 51.1 గ్రా/ ఒక రోజుకు (1971) నుంచి 41.9 గ్రా. / ఒక రోజుకు (2013) పడిపోయింది, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన 80 గ్రా. / ఒక రోజుకు కంటే చాలా తక్కువ, జాతీయ పప్పుధాన్యాల పరిశోధనా సంస్థ, కాన్పూరు వారి ప్రకారం మన దేశంలో జనాభా 2030 నాటికి 1.68 మిలియన్ల అవుతుందని, అందుకనుగుణంగా 32 మి.ట. పప్పుధాన్యాలు అవసరమవు తాయని తెలుపుతోంది. ఈ అవసరాన్ని అందుకోవాలంటే అదనంగా 3-5 మి.హె. విస్తీర్ణంలో పప్పుధాన్యాలు సాగు కావాలని, అలాగే ఉత్పాదకతను హెక్టారుకు 1361 కిలోలు సాధించాల్సిన అవసరం వుంది.