బయో ఎకానమీని ప్రోత్సహిస్తాం డిసెంబరు 1న జి-20 బాధ్యతలు చేపట్టనున్న బ్రెజిల్‌

రియో డీ జెనీరో : బయో ఎకానమీని (జీవ ఆర్థిక వ్యవస్థ) ప్రోత్సహించడానికి బ్రెజిల్‌ చొరవ తీసుకుంటుందని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డసిల్వా తెలిపారు. అలాగే ఆకలి, అసమానతలు, వాతావరణ మార్పు వంటి సమస్యలను ఎదుర్కొనడానికి వర్కింగ్‌ గ్రూపులను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. డిసెంబరు 1వ తేదిన జి-20 అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్‌ చేపడుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నిరుపేదలకు లబ్ది చేకూరే ఫలితాలు సాధించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న బహుళపక్ష చొరవలకు కూడా జి20 మద్దతు వుంటుందని అన్నారు. బుధవారం జి-20 నేతల వీడియో సమావేశం సందర్భంగా లూలా మాట్లాడారు. సుస్థిర అభివృద్ధికి సంబంధించిన మూడు పార్శ్వాలను పునరుద్ధరించడం అవసరమని అన్నారు. అలాగే స్థిరమైన అభివృద్ధి కోసం ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన 2030 ఎజెండాను సత్వరగతిన అమలు చేయడం కూడా అవశ్యమన్నారు. జి-20 అధ్యక్షురాలిగా న్యాయమైన ప్రపంచ నిర్మాణం, సుస్థిరమైన భూగోళమన్నది బ్రెజిల్‌ లక్ష్యంగా వుందని లూలా ప్రకటించారు. 2025లో వాతావరణ మార్పులపై 30వ ఐక్యరాజ్య సమితి సదస్సును బ్రెజిల్‌ నిర్వహించనుంది. భూగోళం సుస్థిరతకు, ప్రజల భద్రతకు హామీ కల్పించే బృహత్తరమైన వాతావరణ ఎజెండాను తీసుకురావాలన్నది లక్ష్యంగా వుందని లూలా అన్నారు.