గాజాకు ఆహారాన్ని పంపించిన బ్రెజిల్‌ సామాజిక ఉద్యమం

Gazaబ్రసీలియా : ఇజ్రాయిల్‌ ఆంక్షలతో, దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న గాజా ప్రజలకు రెండు టన్నుల ఆహారాన్ని బ్రెజిల్‌లోనే అతిపెద్ద సామాజిక ఉద్యమమైన ది ల్యాండ్‌లెస్‌ రూరల్‌ వర్కర్స్‌ మూవ్‌మెంట్‌ (ఎంఎస్‌టీ) పంపించింది. ఇంకా మరింత సాయాన్ని పంపాలని భావిస్తున్నట్టు ప్రకటించింది. మొదటి విడత సాయం సోమవారం బయలుదేరింది. వ్యవసాయ సంస్కరణలకు కేటాయించిన ఎంఎస్‌టీ ఏరియాలపై ఆధారపడి జీవించే కుటుంబాలు ఉత్పత్తి చేసిన బియ్యం, మొక్కజొన్న పిండి, పాలును తీసుకుని బ్రెజిల్‌ వైమానిక దళానికి చెందిన విమానం గాజా వెళ్ళింది. ఈ మూవ్‌మెంట్‌ అందచేస్తున్న ఇతర సరఫరాలు కూడా ఇప్పటికే అందుబాటులో వున్నాయి. ఈ సరుకును తీసుకెళ్ళడానికి ముందుకొచ్చే విమానాల కోసం ఎదురుచూస్తున్నాయి. వంద టన్నుల వరకు సాయాన్ని పంపాలన్నది లక్ష్యంగా వుందని ఎంఎస్‌టిజాతయీ నాయకత్వ సభ్యుడు కేసియా బెచారా చెప్పారు. దేశవ్యాప్తంగా గల ఎంఎస్‌టి కుటుంబాలు ఈ సంఘీభావ చర్యలో పాలుపంచుకున్నాయి. భూమి లేని ఈ నిరుపేద కుటుంబాలన్నీ పాలస్తీనియన్ల పోరాటానికి, గాజా ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు సమీకృతమయ్యాయి. ఆహారాన్ని విరాళంగా అందచేయడమే కాకుండా, వివిధ రకాల కార్యకలాపాలు, చర్యలు, సమీకరణలతో కూడా వారు సంఘీభావం తెలియచేశారని బెచారా తెలిపారు. గాజాలో రైతు కుటుంబాలకు అంతర్జాతీయ విరాళాలు అందచేయడంలో కూడా ఈ మూవ్‌మెంట్‌ పాల్గొంటోంది.