కేప్‌టౌన్‌ కోట బద్దలు!

– రెండో టెస్టులో భారత్‌ రికార్డు విజయం
– 7 వికెట్ల తేడాతో ఆతిథ్య సఫారీ చిత్తు
– బుమ్రా సిక్సర్‌, మార్‌క్రామ్‌ శతకం
– 1-1తో ఫ్రీడమ్‌ టెస్టు సిరీస్‌ సమం
2021 ఆరంభంలో ఆసీస్‌ కంచుకోట గబ్బా (బ్రిస్బేన్‌)లో విజయంతో కంగారూలకు గర్వభంగం చేసిన టీమ్‌ ఇండియా.. తాజాగా 2024 న్యూ ఇయర్‌ టెస్టులో దక్షిణాఫ్రికాకు దిమ్మదిరిగే విజయం సాధించింది. సఫారీ కంచుకోట కేప్‌టౌన్‌లో తొలిసారి టెస్టు విజయం నమోదు చేసి.. న్యూలాండ్స్‌ కోటను బద్దలు కొట్టింది. 32 ఏండ్లలో కేప్‌టౌన్‌లో ఏడు టెస్టులు ఆడిన భారత్‌.. ఆతిథ్య జట్టుకు షాక్‌ ఇచ్చింది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది. పేస్‌ ప్రజంభనంలో భారత్‌ పైచేయి సాధించింది. మహ్మద్‌ సిరాజ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా వరుస ఇన్నింగ్స్‌ల్లో ఆరు వికెట్ల ప్రదర్శనతో నిప్పులు చెరుగగా.. సఫారీసేన 55, 176 పరుగులకే పరిమితమైంది. 79 పరుగుల ఊరించే లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 12 ఓవర్లలోనే ఛేదించింది.
నవతెలంగాణ-కేప్‌టౌన్‌
సఫారీ గడ్డపై భారత్‌ చరిత్ర సృష్టించింది. ఇన్నాండ్లూ అందని ద్రాక్షగా కనిపించిన కేప్‌టౌన్‌ టెస్టు విజయం ఎట్టకేలకు టీమ్‌ ఇండియా సొంతమైంది. రెండు రోజుల్లోనే ముగిసిన టెస్టు సమరంలో ఆతిథ్య సఫారీ పేసర్లను తలదన్నే ప్రదర్శన భారత పేసర్లు కనబరిచారు. స్వల్ప స్కోర్లు నమోదైన టెస్టులో భారత్‌ 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. 1-1తో ఫ్రీడమ్‌ టెస్టు సిరీస్‌ను సమంగా పంచుకుంది. 79 పరుగుల ఊరించే ఛేదనలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (28, 23 బంతుల్లో 6 ఫోర్లు), రోహిత్‌ శర్మ (16 నాటౌట్‌) మెరవటంతో 12 ఓవర్లలోనే టీమ్‌ ఇండియా ఉత్కంఠకు తెరదించింది. దక్షిణాఫ్రికా ఓపెనర్‌ ఎడెన్‌ మార్‌క్రామ్‌ (106, 103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్‌లు) అసమాన శతకంతో ఆకట్టుకున్నాడు. సహచర బ్యాటర్లు పేకమేడలా కుప్పకూలినా.. ఓ ఎండ్‌లో మార్‌క్రామ్‌ పరుగులు పిండుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 176 పరుగులు చేయగా.. ఇన్నింగ్స్‌ పరాజయం నుంచి తప్పించుకుంది. భారత పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా (6/61) ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. వీడ్కోలు హీరో డీన్‌ ఎల్గర్‌తో కలిసి జశ్‌ప్రీత్‌ బుమ్రా సంయుక్తంగా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డును పంచుకున్నాడు. హైదరాబాదీ స్టార్‌ మహ్మద్‌ సిరాజ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు సొంతం చేసుకున్నాడు. భారత్‌, దక్షిణాఫ్రికా కెప్టెన్లు రోహిత్‌ శర్మ, డీన్‌ ఎల్గర్‌లు గాంధీ మండేలా ఫ్రీడమ్‌ టెస్టు సిరీస్‌ ట్రోఫీని సంయుక్తంగా అందుకున్నారు.
ఉత్కంఠ రేపినా..!: చారిత్రక టెస్టు విజయం, ఫ్రీడమ్‌ సిరీస్‌ సమం చేసే సువర్ణావకాశం. అందుకు భారత్‌ ముందున్న లక్ష్యం 79 పరుగులు. ఆధునిక క్రికెట్‌లో ఇదో సవాలే కాదు. కానీ కేప్‌టౌన్‌లో పేసర్ల వీరంగం చూసిన తర్వాత ఆ మాట అనలేం. తొలి ఇన్నింగ్స్‌లో 0 సున్నా పరుగులకే చివరి ఆరు వికెట్లు కోల్పోవటం వెంటాడుతూనే ఉంది. దీంతో భారత్‌ ఛేదన ఉత్కంఠ రేపింది. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (28) ఓ ఎండ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ అండతో రెచ్చిపోయాడు. ఆరు ఫోర్లతో ఎదురుదాడి చేశాడు. లక్ష్యాన్ని కరగదీశాడు. రోహిత్‌ శర్మ (16 నాటౌట్‌) దూకుడు చూపించాడు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించారు. దీంతో డ్రెస్సింగ్‌రూమ్‌ వాతావరణం కాస్త తేలికపడినా.. సఫారీ శిబిరంలో ఆశలు ఆవిరి కాలేదు. శుభ్‌మన్‌ గిల్‌ (11), విరాట్‌ కోహ్లి (12) విలువైన పరుగులు జోడించారు. శ్రేయస్‌ అయ్యర్‌ (4 నాటౌట్‌) ఓ బౌండరీతో ఉత్కంఠకు తెరదించి, సంబురాలకు తెరతీశాడు. సఫారీ బౌలర్లలో రబాడ, బర్గర్‌, జాన్సెన్‌లు తలా ఓ వికెట్‌ పడగొట్టారు.
బుమ్రా బూమ్‌: ఓవర్‌నైట్‌ స్కోరు 62/3తో రెండో రోజు బ్యాటింగ్‌ మొదలెట్టిన దక్షిణాఫ్రికాకు భారత పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా చుక్కలు చూపించాడు. బూమ్‌ బూమ్‌ ప్రదర్శనతో చెలరేగిన బుమ్రా.. కేప్‌టౌన్‌లో రెండో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. డెవిడ్‌ బెడింగ్‌హామ్‌ (11) ఓవర్‌నైట్‌ స్కోరుకే బుమ్రాకు దాసోహం అయ్యాడు. కైల్‌ వెరెనె (9), మార్కో జాన్సెన్‌ (11), కేశవ్‌ మహరాజ్‌ (3), లుంగిసాని ఎంగిడి (8)లు బుమ్రా పేస్‌కు పడిపోయారు. ఓ ఎండ్‌లో వికెట్ల జాతర సాగినా.. మరో ఎండ్‌లో ఎడెన్‌ మార్‌క్రామ్‌ (106) అసమాన శతక ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. 17 ఫోర్లు, 2 సిక్స్‌లు సంధించిన మార్‌క్రామ్‌.. 102.91 స్ట్రయిక్‌రేట్‌తో మెరిశాడు. రెండు జట్ల నుంచి మరో బ్యాటర్‌ కనీసం అర్థ సెంచరీ సాధించని పిచ్‌పై 8 ఫోర్లతో 68 బంతుల్లో అర్థ సెంచరీ.. 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 99 బంతుల్లో శతకం సాధించాడు. మార్‌క్రామ్‌ ఒక్కడే 103 పరుగులు చేయగా.. సఫారీ బ్యాటర్లు అందరూ కలిసి 73 పరుగులే జోడించారు. భారత బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ (2/56), మహ్మద్‌ సిరాజ్‌ (1/31), ప్రసిద్‌ కృష్ణ (1/27) రాణించారు.
దక్షిణాఫ్రికా పర్యటన భారత్‌కు ఎప్పుడూ కఠిన సవాలే. ఇక్కడ టెస్టు విజయం సైతం గొప్ప ప్రదర్శనే. సిరాజ్‌ స్పెల్‌ అత్యంత అరుదుగా చూస్తాం. సిరాజ్‌, బుమ్రా ప్రదర్శన విజయంలో కీలకం. తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగుల ఆధిక్యం కలిసొచ్చింది. చివరి ఆరు వికెట్ల పతనం అసంతృప్తిని మిగిల్చింది. కేప్‌టౌన్‌లో ఇది గొప్ప విజయం. సెంచూరియన్‌ పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటాం’
– రోహిత్‌ శర్మ, భారత కెప్టెన్‌
స్కోరు వివరాలు :
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 55/10
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 153/10
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మార్‌క్రామ్‌ (సి) రోహిత్‌ (బి) సిరాజ్‌ 106, ఎల్గర్‌ (సి) కోహ్లి (బి) ముకేశ్‌ 12, టోనీ (సి) రాహుల్‌ (బి) ముకేశ్‌ 1, స్టబ్స్‌ (సి) రాహుల్‌ (బి) బుమ్రా 1, డెవిడ్‌ (సి) రాహుల్‌ (బి) బుమ్రా 11, వెరెనె (సి) సిరాజ్‌ (బి) బుమ్రా 9, జాన్సెన్‌ (సి,బి) బుమ్రా 11, మహరాజ్‌ (సి) అయ్యర్‌ (బి) బుమ్రా 3, రబాడ (సి) రోహిత్‌ (బి) ప్రసిద్‌ 2, బర్గర్‌ నాటౌట్‌ 6, ఎంగిడి (సి) యశస్వి (బి) బుమ్రా 8, ఎక్స్‌ట్రాలు :06, మొత్తం : (36.5 ఓవర్లలో ఆలౌట్‌) 176.
వికెట్ల పతనం: 1-37, 2-41, 3-45, 4-66, 5-85, 6-103, 7-111, 8-162, 9-162, 10-176.బౌలింగ్‌ : బుమ్రా 13.5-0-61-6, సిరాజ్‌ 9-3-31-1, ముకేశ్‌ 10-2-56-2, కృష్ణ 4-1-27-1.
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: యశస్వి జైస్వాల్‌ (సి) స్టబ్స్‌ (బి) బర్గర్‌ 28, రోహిత్‌ శర్మ నాటౌట్‌ 17, గిల్‌ (బి) రబాడ 10, కోహ్లి (సి) వెరెనె (బి) జాన్సెన్‌ 12, శ్రేయస్‌ అయ్యర్‌ నాటౌట్‌ 4, ఎక్స్‌ట్రాలు : 9, మొత్తం : (12 ఓవర్లలో 3 వికెట్లకు) 80.
వికెట్ల పతనం: 1-44, 2-57, 3-75.
బౌలింగ్‌: కగిసో రబాడ 6-0-33-1, బర్గర్‌ 4-0-29-1, మార్కో జాన్సెన్‌ 2-0-15-1