వాగ్దాన భంగం!

Breach of promise!ఆనాడు రోమ్‌ నగరాన్ని అగ్ని దహించి వేసినట్టుగా, ‘నిరుద్యోగం’, ఉపాధిలేమి వంటి సమస్యలు నేడు మనదేశాన్ని దహించి వేస్తున్నాయి. చక్రవర్తి నీరోలాగే… ప్రధాని మోడీ ఫిడేల్‌ వాయిస్తున్నారు. అంతా ఫీల్‌గుడ్‌ అంటూ కొంతమంది అక్కడక్కడా తమ సొంత కాళ్లపై స్ఫూర్తిదాయకంగా నిలిచినవారిని తమ గొప్పగా చెప్పుకోవడం తప్ప మోడీ ప్రభుత్వం ఈ కాలంలో చేసిందేమీ లేదు. ప్రతీసారి ఏవేవో సూక్తులు, భావోద్యేగ అంశాలను ముందుకు తెస్తూ నిరుద్యోగం, ఉపాధి సమస్యలు ఎన్నికల సమయంలో తెరపైకి రాకుండా కాషాయపెద్దలు జాగ్రత్తపడుతూవచ్చారు. గత ఎన్నికల్లో జాతీయ భద్రత, వైమానికదాడులు, హిందూత్వం, హిందూ మతోన్మాదం వంటి అంశాలతో మోడీ బయటపడగా.. మూడోసారి గెలిచి అధికారం చేపట్టేందుకూ వాటిపైనే ఫోకస్‌ పెట్టారు. అంతే తప్ప ఆర్థిక విధానాలలో ముఖ్యమైనది ఉపాధి రంగం గురించి పట్టించుకునేందుకు దృష్టి సారించడం లేదన్నది స్పష్టం.
మునుపెన్నడూ లేనంతగా రికార్డుస్థాయిలో దేశంలో నిరుద్యోగం 47ఏండ్ల గరిష్టానికి చేరింది. 18-25ఏండ్ల లోపు పట్టభద్రుల్లో నిరుద్యోగిత ఏకంగా 42శాతానికి చేరుకొన్నది. అంటే దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరు నిరుద్యోగిగానే ఉండిపోతున్నారు. వారంతా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. కొంతమందైతే ఉపాధి దొరకడం కష్టమని నిరాశ నిస్పృహలతో దరఖాస్తు చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇవి అజీజ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన సెంటర్‌ ఫర్‌ స్టెయిన్‌బుల్‌ ఎంప్లాయీమెంట్‌ సంస్థ చేసిన సర్వేలో బయటపడిన వాస్తవాలు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) తాను విడుదల చేసిన ప్రకటనలోనూ సమస్య తీవ్రతను వెల్లడించింది.
కేంద్రంలో 2014లో మోడీ సర్కారు కొలువుతీరాక యువతకు ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయి. మోడీ ఎన్నికలకు ముందుచేసిన అతి ముఖ్యమైన హామీ ఉద్యోగాల కల్పన, ఉపాధి సృష్టి. పదేండ్ల యూపీఏ హయాంలో యువతకు అన్యాయం చేసిందని చెప్పి గద్దెనెక్కిన మోడీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి రెండు కోట్ల కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు… ఉన్న ఖాళీలే భర్తీ కాలేదు. మంజూరైన పోస్టులను సైతం భర్తీ చేయలేదు. పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు కోతలు పెట్టింది. ఆయన చెప్పిన ప్రకారం తొమ్మిదేండ్లలో 18కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పించబడాలి. 389 ప్రభుత్వ రంగసంస్థల్లో 2014లో 16.9లక్షల ఉద్యోగులు ఉంటే, 2022 నాటికి ఈ సంఖ్య 14.6లక్షలకు తగ్గింది. సృష్టించబడాల్సింది పోయి శాశ్వత ఉద్యోగాలనే లేకుండా చేశారంటే కేంద్రప్రభుత్వ విధానాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయనేది తెలుస్తోంది. వందసార్లు ‘మన్‌కీ బాత్‌’లో మోడీ పాల్గొన్నా ఎన్ని కొత్త ఉద్యోగాలు కల్పించింది చెప్పడానికి సాహసం చేయలేదు. చేస్తేనే కదా లెక్కలుండేది. ప్రయివేటురంగంలో ఉద్యోగాలంటే విదేశీ, స్వదేశీ కంపెనీలు పెట్టుబడులు పెడితే వస్తాయి. వాటికోసమూ మోడీ ప్రభుత్వం చేసింది శూన్యం. ఇప్పుడు ఆ లెక్కలు కనపడకుండా దాచే ప్రయత్నం చేస్తోంది.
దేశంలో నిరుద్యోగం పెరగకుండా ఉండాలంటే ఏటా 80లక్షల చొప్పున కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం ఉంటుందని ప్రపంచబ్యాంకు నివేదిక గతంలోనే వెల్లడించింది. దేశంలో ప్రతినెలా 13లక్షల మంది కొత్తగా ఉద్యోగాల కోసం క్యూ కడుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటురంగాల్లో ఒక్కో పోస్టుకు వేల సంఖ్యల్లో పోటీ పడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయాలని, ఉపాధి హామీ చట్టానికి నిధులు అధికంగా కేటాయించాలని నిపుణులు సూచించినా పట్టించుకున్నదెక్కడీ. అచ్చేదిన్‌, ఉద్దీపనలు, ఆత్మనిర్బరతా అంటూ కోట్ల రూపాయలను పారిశ్రామిక వేత్తలకు అప్పగించారు తప్ప చాంతాడులా పెరుగుతున్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేసింది శూన్యం. వాటికి కేటాయించిన నిధుల్లో సగమిచ్చినా ఎంతోమందికి ఉపాధి దొరికి ఆర్థిక వ్యవస్థ బాగుండేది. ప్రజల వద్ద డబ్బులుంటేనే ద్రవ్వోల్బణం అదుపులో ఉంటుంది. ధరలు పెరగవు. ఇది కూడా గమనంలో లేకపోతే ఎలా? ఇలాంటి అంశాలపై ఆర్‌బీఐలో పనిచేసిన మాజీ గవర్నర్లు చెప్పినా వినిపించుకోలేదు. ఏవెవో కాకిలెక్కలు, కుంటిసాకులు చెబుతూ వారి పాలనకు వారే కితాబిచ్చుకునేలా మోడీ, ఆయన భజన బృందం పని చేస్తుందనేది వాస్తవం.
దేశంలో నయా ఉదారవాద విధానాలు తీవ్రత పెరిగాక ప్రభుత్వరంగంలో ఉద్యోగాలు తగ్గనారంభించాయి. దీని ఫలితంగానే యువత నిరాశ నిస్పృహలకు లోనవుతున్నది. ఆయా రాష్ట్రాల్లో అలజడి పెరగడానికి కారణం నిరుద్యోగమే. ఉద్యోగ కల్పనలో తమ వర్గానికి రిజర్వేషన్‌ కల్పించాలని ఆందోళనలు జరుగుతుంటే, వీటికి పరిష్కారం చూపకుండా అగ్గికి ఆజ్యం పోసే విధంగా యువతకు ఎంతో మేలు చేశామని మోడీ చెప్పుకోవడం సిగ్గుచేటు.