మూడు రోజుల లాభాలకు బ్రేక్‌

– సెన్సెక్స్‌ 542 పాయింట్ల పతనం
ముంబయి : వరుసగా మూడు రోజులు లాభాల్లో సాగిన దేశీయ స్టాక్‌ మార్కెట్ల పరుగుకు గురువారం తెర పడింది. అమెరికా సహా అన్ని దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు వడ్డీ రేట్లు పెంచనున్నాయనే సంకేతాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 542 పాయింట్లు లేదా 0.9 శాతం కోల్పోయి 59,806కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 165 పాయింట్లు తగ్గి 17,590 వద్ద ముగిసింది. బిఎస్‌ఇ మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ 0.55 శాతం చొప్పున తగ్గాయి. సెన్సెక్స్‌-30లో ఎంఅండ్‌ఎం 3 శాతం, రిలయన్స్‌ 2 శాతం చొప్పున అధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. ఎన్‌టిపిసి షేర్‌ 0.50 శాతం పెరిగి రూ.179.75కు చేరింది. గడిచిన ఐదు సెషన్లలో ఈ సూచీ 5 శాతం రాణించింది. వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛీఫ్‌ జెరోమ్‌ పావెల్‌ ఇచ్చిన సంకేతాలు అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేశాయి. దీంతో అమెరికా సహా ఇతర కేంద్ర బ్యాంకులు మరోసారి వడ్డీ రేట్లు పెంచుతాయనే అంచనాల నేపథ్యంలో పలు దేశాల మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.