రాహుల్‌ యాత్రకు బ్రేక్‌

Break to Rahul's trip– వారణాసి నుంచి వాయనాడ్‌ పయనం
వారణాసి : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యారు యాత్రకు శనివారం స్వల్ప అంతరాయం ఏర్పడింది. వారణాసిలో యాత్రను అర్థాంతరంగా ముగించుకొని ఆయన కేరళలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడ్‌కు వెళ్లారు. వాయనాడ్‌లో రాహుల్‌ ఉండాల్సిన అవసరం ఉన్నందున యాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చామని, ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో యాత్ర సాయంత్రం మూడు గంటలకు తిరిగి ప్రారంభమవుతుందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ తెలిపారు.
అంతకుముందు రాహుల్‌ యాత్ర వారణాసిలో ప్రవేశించింది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అజరు రారు, ఇతర నేతలతో కలిసి ఆయన కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. వాయనాడ్‌లో శుక్రవారం ఉదయం ఎనుగు జరిపిన దాడిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం కోజికోడ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి పాల్‌ పర్యాటక శాఖలో గైడ్‌గా పనిచేస్తున్నాడు. గత వారం కూడా ఓ ఏనుగు జరిపిన దాడిలో అజి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వరుస ఘటనల నేపథ్యంలో వాయనాడ్‌లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గత 17 రోజుల్లో వన్యప్రాణుల దాడుల్లో ముగ్గురు చనిపోయారు. ఈ నేపథ్యంలో శనివారం వాయనాడ్‌ జిల్లాలో హర్తాళ్‌ నిర్వహించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని ప్రజలు డిమాండ్‌ చేశారు. దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. రోడ్లపై వాహనాలేవీ నడవలేదు. అధికార ఎల్డీఎఫ్‌, ప్రతిపక్ష యూడీఎఫ్‌, బీజేపీ ఈ హర్తాళ్‌కు పిలుపునిచ్చాయి. పల్పల్లీలో ఆందోళన హింసకు దారితీసింది. నిరసనకారులు అటవీ శాఖ వాహనాన్ని ధ్వంసం చేశారు.