– జేవీఆర్‌ఓసీలో లక్ష టన్నులు, కిష్టారం 32వేలు టన్నులు
– బొగ్గు తోలకాలు లేక నిలిచిన టిప్పర్లు
నవతెలంగాణ-సత్తుపల్లి
ఎడతెరిపీ లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సత్తుపల్లి బొగ్గుగనుల్లోకి భారీగా నీరు చేరడంతో ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీ నుంచి ప్రతిరోజూ మూడు షిఫ్ట్‌లకు గాను 30వేల టన్నుల బొగ్గును వెలికి తీయడంతో పాటు 1.20లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని (ఓవర్ బర్డెన్) గనుల నుంచి తొలగిస్తారు. అలాగే మండలంలోని కిష్టారం ఓసీ నుంచి కూడా ప్రతిరోజూ మూడు షిఫ్ట్‌ల్లో 8వేల టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు 20వేల క్యూబిక్ మీటర్ల ఓబీని తొలగిస్తారు. ప్రతిరోజూ రెండు ఓసీల నుంచి సుమారుగా 40వేల టన్నుల బొగ్గు వెలికితీతతో పాటు 1.40లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీయాల్సి ఉంటుంది. వర్షాల కారణంగా ఆయా ఓసీల్లో భారీగా నీరు చేరడంతో ఇప్పటి వరకు ఈ ఐదారు రోజుల్లో 1.32లక్షల టన్నుల బొగ్గు వెలికితీతకు ఆటంకం ఏర్పడటంతో పాటు 4.80లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగింపుకు ఆటంకం ఏర్పడిందని జేవీఆర్, కిష్టారం ఓసీ ప్రాజెక్టు ఆఫీసర్లు ప్రహ్లాద్, మునగంటి వేదాద్రి నరసింహారావు తెలిపారు. గనుల నుంచి బొగ్గు తోలకాలు లేకపోవడంతో టిప్పర్లు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి.