తల్లిపాల వల్ల బిడ్డకు ఎన్నో లాభాలు ఉంటాయని హెల్త్ సూపర్వైజర్ స్వరూప అన్నారు. బుధవారం మండలంలోని కొన సముందర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ భీంగల్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఆరోగ్య సిబ్బంది అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణి స్త్రీలు, బాలింతలకు ముర్రుపాల విశిష్టత, తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు అమృతం లాంటిదని, బిడ్డలు ఆరోగ్యంగా ఉండేందుకు తల్లిపాలు సంజీవనిల పనిచేస్తాయని తెలిపారు. బిడ్డ పుట్టిన గంటలోపు మురుపాలు పట్టడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అన్నారు.పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి తల్లిపాలు చాలా కీలకమన్నారు. ఆరు నెలల వరకు బిడ్డ శారీరక అవసరాలన్నీ తల్లిపాలతోనే తీరుతాయన్నారు. అందుకే తల్లిపాలను బిడ్డకు సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారని వివరించారు. పోత పాల కన్నా తల్లిపాలు తాగే పిల్లలు బలంగా, తెలివిగా ఉంటారన్నారు. శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో, రోగనిరోధక శక్తిని పొందాలంటే తప్పనిసరిగా తల్లిపాలు పట్టించాలన్నారు. తల్లిపాలతో బిడ్డకు, తల్లికి లాభాలు ఉన్నాయని తెలిపారు. బిడ్డకు పాలు పట్టడం ద్వారా ఎన్నో రకాల వ్యాధుల నివారణకు దోహదపడుతుందన్నారు. ముర్రుపాల ప్రాముఖ్యత, బిడ్డకు ఎంత వయసు వచ్చే వచ్చేవరకు తల్లిపాలు ఇవ్వాలి, రోజుకు ఎన్నిసార్లు పాలు పట్టాలనే తదితరు అంశాలపై గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్య సిబ్బంది వివరించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం రూప, అంగన్వాడీ టీచర్లు లక్ష్మి, పుష్ప, ఆయాలు శారదా, లావణ్య, గ్రామ మహిళ సమైక్య అధ్యక్షురాలు మౌనిక, నడుకుడ మేఘన, కోశాధికారి యాట లక్ష్మి, కార్యదర్శి లాడే లత, వివోఏ లత, ఆశా కార్యకర్తలు సంధ్యా, సుజాత, సత్యగంగు, గర్భిణీలు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.