తల్లిపాలు గ‌ట్టి పునాది

తల్లిపాలు శిశువుకు ప్రకృతి సహజ సిద్ధమైనవి, సురక్షితమైనవి, పుష్టికరమైనవే కాక సంపూర్ణ ఆహారం. కానీ బిడ్డకు తల్లిపాలు సరిగా అందడం లేతల్లిపాలు శిశువుకు ప్రకృతి సహజ సిద్ధమైనవి, సురక్షితమైనవి, పుష్టికరమైనవే కాక సంపూర్ణ ఆహారం. కానీ బిడ్డకు తల్లిపాలు సరిగా అందడం లేదు. అందుకే ప్రతి ఏడాది ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటాం. నవజాత శిశువుల సరైన అభివృద్ధికి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. ప్రస్తుత ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తల్లిపాల కంటే మెరుగైన ఆహారాన్ని తయారు చేయలేక పోయింది. అందుకే తల్లిపాల విశిష్టతను వివరిస్తూ ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తారు.
WABA (World Alliance for Breast feeding Action) అనే సంస్థ ఆధ్వర్యంలో WHO, UNICEF, IBFAN (International Baby Food Action Network) & BPNI (Breast feeding promotion NetWork of India)తదితర సంస్థలు ఈ తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 దేశాలు 1991 నుంచి క్రమం తప్పకుండా తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నాయి. తల్లులు శిశువు పుట్టిన ఒక గంటలోపు నుంచే తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించాలని నిపుణులు చెబుతున్నారు. తల్లులు మొదటి ఆరు నెలలు పిల్లలకు తప్పకుండా తల్లిపాలు ఇవ్వాలి. శిశువుకు రెండేండ్లు వచ్చే వరకు పాలను కొనసాగిస్తూనే సురక్షితమైన ఆహారాన్ని తినిపించే ప్రయత్నం చేయాలి. అయితే భారతదేశంలో కేవలం 42 శాతం మంది తల్లులు మాత్రమే బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు తాగిస్తున్నారు. 55 శాతం మంది మాత్రమే బిడ్డకు ఆరునెలల పాటు తల్లిపాలు తాగిస్తున్నారు.
ముర్రుపాలు పట్టడం వల్ల
పౌష్టికాహార లోపంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు పది మిలియన్ల మంది చిన్నారులు ఐదేండ్లలోపే మరణిస్తున్నారు. అందులో నాలుగు మిలియన్ల మంది చిన్నారులు పుట్టిన 28 రోజుల్లోనే మరణిస్తున్నారు. ఇక ఏడాదిలోపు మరణాలు ముఖ్యంగా విరేచనాలు, శ్వాసకోశ వ్యాధుల వల్ల సంభవిస్తున్నాయి. శిశువు జన్మించిన గంటలోపే ముర్రుపాలు పట్టడం వల్ల దేశంలో ఏడాదికి రెండున్నర లక్షలమంది చిన్నారుల ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు తేల్చి చెప్తున్నారు. తల్లి ప్రసవం అయిన వెంటనే ఆమె స్తనాల నుంచి ప్రథమంగా కొలస్ట్రం అనే పసుపురంగు చిక్కటి పాలు వస్తాయి. వీటిని ముర్రుపాలు అంటారు. అవి బిడ్డకు అమృతంతో సమానమైనవి. ఒకరకంగా జీవితకాలం పని చేసే టీకా అని చెప్పవచ్చు. ఇవి పసికందు మెదడు చురుకుగా పని చేయడంతోపాటు జ్ఞాపక శక్తి పెరిగేందుకు దోహదపడుతాయి. గుండె, చర్మ, సంబంధ వ్యాధులు, ఉబ్బ సం, ఆస్తమా, బీపీ, షుగర్‌ రాకుండా చేస్తాయి.
ఎన్ని సార్లు ఇవ్వొచ్చు
ఆరునెలల పాటు శిశువుకు రోజుకు 12 సార్లు పాలు తాగించాలి. ఈ పాలు తాగిన పిల్లల్లో స్థూలకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ముర్రుపాలతో మొదటగా విసర్జించే నల్లటి మెకోనియం అనే మలంతో పాటు పచ్చకామెర్లు కలిగించే బైబిరూబిన్‌ అనే పదార్థం కూడా విసర్జించబడి మొదటి వారం కలిగే పచ్చకామెర్ల తీవ్రత తగ్గుతుంది. ఈ పాలలో విటమిన్‌ ఏ అధిక మోతాదులో ఉండడం వల్ల శిశువు కళ్లు ప్రకాశవంతంగా ఉంటాయి. ఆరు నెలల వరకు శిశువుకు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి. నీళ్లు, తేనె, గ్లూకోజ్‌ నీరు, జంతువుల పాలు, బయటిపాలు ఏవీ ఇవ్వరాదు. దానివల్ల విరేచనాలు అవుతాయి. అంటువ్యాధులు సోకుతాయి. ఆరు నెలలపాటు తల్లిపాలివ్వడం వల్ల శిశువుకు శారీరక పుష్టి మాత్రమే కాక తల్లితో అనుబంధం ఏర్పడుతుంది. వేసవికాలంలో కూడా తల్లిపాలలో శిశువుకు కావలసినంత నీరు, పుష్టి కలిగించే పదార్థాలు ఉంటాయి. అందువల్ల తల్లి శిశువుకు విడిగా నీరు తాగించవలసిన అవసరం లేదు. శిశువు సంపూర్ణ మానసిక వికాసానికి గాను రెండేండ్ల వయసు వచ్చే వరకు తల్లిపాలు తాగించాలి. శిశువుకు జబ్బు చేసినప్పటికీ తల్లిపాలు తాగించాలి. దాని వల్ల శిశవులో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తల్లి అనారోగ్యంగా ఉన్నప్పటికీ బిడ్డకు తల్లిపాలు తాగించవచ్చు.
రోగాలతో పోరాడే శక్తినిస్తుంది
అమృతతుల్యమైన తల్లిపాలు శిశువుకు రోగనిరోధక శక్తిని కలిగిస్తాయి. తల్లిపాలలో ఉన్న ఇమ్యునోగ్లోబ్లిన్‌ యాంటీబాడీస్‌ వలే పనిచేసి శిశువుకు రోగాలతో పోరాడే శక్తినిస్తుంది. తల్లిపాలు సులభంగా జీర్ణమై త్వరగా శరీరంలో శోషించబడుతాయి. తల్లి స్తనాలను చీకటం ద్వారా శిశవు దవడలు దృఢంగా, దంతాలు ఆరోగ్యంగా పెరుగుతాయి. తల్లి పాలు తాగే సమయంలో తల్లి నుంచి శిశువుకు స్పర్శ ద్వారా వెచ్చదనం లభిస్తుంది. బిడ్డకు చక్కటి శారీరక, మానసిక, సాంఘిక, ఆరోగ్య అభివృద్ధికి తల్లిపాలు గట్టి పునాది. తల్లి శరీరంలోని ప్రమాదకర బ్యాక్టీరియా బిడ్డ శరీరంలోకి చేరినా కీడు చేయకుండా తల్లిపాలు నిరోధిస్తాయి. తల్లిపాలలో ఉన్న ప్రోటీన్స్‌, ఫ్యాట్‌, క్యాల్షియం తొందరగా గ్రహించబడతాయి. శిశువులను విరేచనాలు నిమోనియా నుండి రక్షిస్తాయి. అలర్జీ, చెవిలో ఇన్ఫెక్షన్లు నివారించడానికి దోహదపడతాయి.
తల్లికి మానసిక తృప్తి
శిశువుకు పాలివ్వడం వలన తల్లికి మానసిక తృప్తి లభిస్తుంది. శిశువు పట్ల గాఢమైన ప్రేమ ఏర్పడుతుంది. తల్లి పాలు అధికంగా తాగించటం వల్ల తల్లుల్లో పాల ఉత్పత్తి అధికమవుతుంది. రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్‌ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. తిరిగి త్వరగా గర్భవతి కాకుండా కాపాడి ఒక విధంగా గర్భ నిరోధకంగా పనిచేస్తుంది. బిడ్డల మధ్య వ్యవధి పాటించగల్గుతారు. బిడ్డ తల్లి రొమ్ము స్పృశించి చీకడం వలన ఆక్సీటోసిన్‌ అనే పదార్థం తల్లి శరీరంలో విడుదల అవుతుంది. దీని వల్ల రక్తస్రావం నిలిచిపోయి తల్లి గర్భాశయం కుంచించుకుపోయి యథాస్థానంలోకి వస్తుంది. తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు పెరిగిన అదనపు బరువును తల్లిపాలు ఇవ్వడం వల్ల తగ్గిస్తుంది. తల్లికి రక్తహీనత, ఎముకల బలహీనత నుండి రక్షణ కలిగిస్తుంది. కనుక తల్లిపాలు తల్లీబిడ్డలిద్దరికీ ఆరోగ్యాన్ని అందించే అమృతం.
వారోత్సవాల చరిత్ర
తల్లి పాలివ్వడాన్ని ప్రోత్సహించడానికి వరల్డ్‌ లయన్స్‌ ఫర్‌ బ్రెస్ట్‌ ఫీడింగ్‌ యాక్షన్‌ 1991లో స్థాపించబడింది. 1992లో తొలిసారిగా ప్రపంచ తల్లిపాలను వారోత్సవాలు జరుపుకున్నారు. ప్రారంభంలో ఈ రోజును ఏడాదిలో ఒక రోజు మాత్రమే జరిపేవారు. తర్వాత దాని ప్రాముఖ్యత, అవసరం గుర్తించి ప్రత్యేక వారంగా జరుపుకోవడం ప్రారంభించారు.
ఈ ఏడాది థీమ్‌
ప్రతి ఏడాది ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను వివిధ థీమ్‌లతో జరుపుకుంటారు. ఈ థీమ్‌లను వరల్డ్‌ అలయన్స్‌ ఫర్‌ బ్రెస్ట్‌ ఫీడింగ్‌ యాక్షన్‌ ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది థీమ్‌ ‘క్లోజింగ్‌ ది గ్యాప్‌ – అందరికీ బ్రెస్ట్‌ ఫీడింగ్‌ సపోర్ట్‌’. అంటే ఈ ఏడాది లక్ష్యం అన్ని స్థాయిల తల్లులకు తల్లిపాలను సులభతరం చేయడం. ప్రతి తల్లి తన బిడ్డకి తల్లి పాలివ్వడాన్ని సులభతరం చేయడానికి అవసరమైన అవగాహన కల్పించేందుకు ఈ థీమ్‌ ఉపయోగ పడుతుంది. సవాలుతో కూడిన ప్రయాణాన్ని సాఫీగా సాగించేందుకు తల్లిపాలు ఇచ్చే తల్లులకు కుటుంబం, సమాజంతో పాటు ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల ద్వారా ఎలా తోడ్పాటు అందించాలనే దానిపై అవగాహన కల్పిస్తారు.
ఇతర ప్రయోజనాలు
– తల్లి పాల ద్వారా నవజాత శిశువుకు వ్యాధినిరోధకతను పెరుగుతుంది.
– తల్లి శిశివుకు పాల పట్టడం వల్ల తల్లి బిడ్డ మద్య బంధం బలోపేతమవుతుంది.
– పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి తల్లి పాలు అవసరం.
– తల్లిపాలు ప్రసవానంతర తల్లి పునరుద్ధరణకు సహాయపడుతుంది.
– తల్లిపాలివ్వడదం వల్ల రొమ్ము, అండాశయ క్యాన్సర్‌ ప్రమాదం తగ్గుతుంది.
– ప్రసవానంతర బరువు పెరగడం, కొవ్వును వేగంగా కోల్పోవడానికి తల్లిపాలు సహాయపడుతుంది.
– శిశువుకు అవసరమైన అన్ని పోషకాలను అందించడంతో పాటు, తల్లి పాలలో ప్రతిరోధకాలు, ఎంజైమ్‌లు వంటివి ఎన్నో ఉన్నాయి. ఇవి పిల్లలను అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షించాయి.