బతుకులు ఆగం..!

Let's live..!– జీడీపీ పెరిగింది సరే..కుటుంబ వ్యయం తగ్గుతుందెందుకు?
– పడిపోతున్న ఆదాయాలు
– ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో పెరిగిన కష్టాలు
– వినియోగ వ్యయం తగ్గిపోతోంది
ఇటీవల విడుదలైన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు ప్రభుత్వ వర్గాలకు, వాటికి మద్దతు తెలిపే ఆర్థికవేత్తలకు అనందం కలిగించి ఉంటాయి. 2023-24 రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.6%గా నమోదైంది. తొలి త్రైమాసికంలో ఈ వృద్ధి 7.8%గా ఉంది. సగటున ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్థభాగంలో జీడీపీ 7.7% వృద్ధి రేటు సాధించింది. ఈ గణాంకాలపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు ఇది ఫలితమని చెప్పుకొచ్చారు. అయితే దేశ ఆర్థిక పరిస్థితి ఆశించినంత గొప్పగా లేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ప్రభుత్వ వ్యయాన్ని పెంచడమే. అప్పుడే ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ప్రజలకు కొంత ఊరట లభిస్తుంది.
కానీ జీడీపీలో ప్రభుత్వ వ్యయం తగ్గిపోతోంది. అదే ఆందోళన కలిగించే విషయం.
న్యూఢిల్లీ : ఆర్థిక కష్టాలన్నింటికీ 7.6% వృద్ధి రేటు పరిష్కారం చూపుతుందని ప్రభుత్వ పెద్దలు నమ్ముతున్నప్పటికీ అసలు గణాంకాలు ఏం చెబుతున్నాయో పరిశీలించాల్సిన అవసరం ఉంది. రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్‌) ప్రైవేటు తుది వినియోగ వ్యయం (పీఎఫ్‌సీఈ) కేవలం 3.1% మాత్రమే పెరిగింది. పీఎఫ్‌సీఈ అంటే దేశంలోని అన్ని కుటుంబాలు, వ్యాపార సంస్థలు, ఇతర కంపెనీలు చేసిన మొత్తం ఖర్చు. జీడీపీ లెక్కించే దేశ సగటు ఉత్పత్తిలో ఇది ఓ ముఖ్యమైన భాగం. జీడీపీలో ఇది సుమారు 57%గా ఉంటుంది. ప్రజలు వస్తువులు, సేవలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఖర్చు చేసినప్పుడు ఆర్థిక కార్యకలాపాలు పెరుగు తాయి. ప్రజలు ఎక్కువ ఖర్చు చేయకపోతే ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగదు. కాబట్టి ప్రజల కొనుగోలు, ఆదాయ శక్తిని లెక్కించ డానికి పీఎఫ్‌సీఈ ఉపయోగపడుతుంది.
దేశంలో వినియోగ వ్యయం కోవిడ్‌ కాలంలో పడిపోయింది. 2021-22లో అది మళ్లీ గాడిన పడింది. అయితే గత సంవత్సరం నుండి వినియోగ వ్యయం దారుణంగా తగ్గింది. గత సంవత్సరం అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్య ఇది 2.2%కి పడిపోయింది. గడచిన త్రైమాసిక కాలంలో కొంచెం పెరిగి 2.8%కి చేరింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వినియోగ వ్యయం పెరిగినా రెండో త్రైమాసికంలో తగ్గింది. వినియోగ వ్యయం తగ్గడానికి కారణమేమిటి? ఖర్చు చేయడానికి కావాల్సిన ఆదాయం ప్రజల వద్ద లేకపోవడమే. ప్రజలు తక్కువ ఆదాయంతో ఎలాగో ఒకలా బతుకులు నెట్టుకొ స్తుంటే.. మూలిగే నక్కపై తాటికాయ పడిన విధంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తోడ య్యాయి. అయితే జీడీపీలో ఇవి ప్రత్యక్షంగా ప్రతిబింబిం చవు. కానీ వాటి నీడలు తక్కువగా ఉన్న వినియోగ వ్యయ వృద్ధి స్థాయిలలో స్పష్టంగా కన్పిస్తాయి.
జీడీపీకి, దాని వృద్ధికి ఏయే రంగాలు ఎంత మేరకు దోహదపడుతున్నాయో తెలిపే గణాంకాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. వీటి ప్రకారం వ్యవసాయ రంగం పాత్ర స్వల్పంగా ఉండడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. తయారీ రంగం, మైనింగ్‌, నిర్మాణం, విద్యుత్‌, నీరు వంటివి జీడీపీ వృద్ధికి దోహపడుతున్నప్ప టికీ వ్యవసాయ రంగం కారణంగా ఆ వృద్ధి ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. దేశంలో ఉపాధి కల్పనకు వ్యవసాయం అతి పెద్ద వనరుగా ఉన్నందున ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని మూడింట రెండు వంతుల జనాభాకు వ్యవసాయంతో సంబంధం ఉంది. అలాంటి ఈ రంగంలో వృద్ధి తక్కువగా ఉండడం దేనికి సంకేతం? ఈ రంగంపై ఆధారపడిన అనేక మందికి ఆదాయం మెరుగ్గా లేదు. అంతేకాక ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువగానే ఉంటాయి.