మారుతున్న ప్రపంచ వ్యవస్థకు బ్రిక్స్‌ ఒక ఉదాహరణ

To a changing world system BRICS is an example– సదస్సులో జై శంకర్‌
– స్థిరీకరణ శక్తిగా బ్రిక్స్‌ ఎదగాలన్న జిన్‌పింగ్‌
– రెండు దేశాల ఏర్పాటే పరిష్కారం : పుతిన్‌
కజన్‌ : ప్రపంచ వ్యవస్థ ఎంతలా మారుతుందో చెప్పడానికి బ్రిక్స్‌ ఒక ఉదాహరణ అని విదేశాంగ మంత్రి జై శంకర్‌ వ్యాఖ్యానించారు. 16వ బ్రిక్స్‌ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, వలస పాలన నుండి విముక్తి పొందిన దేశాలు శీఘ్రగతిన అభివృద్ధి సాధించడంలో, సామాజిక ఆర్థిక ప్రగతిని నెలకొల్పడంలో ఎంతలా విజయాలు సాధించాయో, పాత ప్రపంచ క్రమం ఎలా మారుతుందో తెలుసుకునేందుకు బ్రిక్స్‌ ఒక ప్రతీకగా ఉందన్నారు. కొత్త సామర్ధ్యాలు ఆవిర్భవించాయని, మరింత ప్రతిభ, నైపుణ్యాలను వినియోగించుకునే వెసులుబాటు కలిగిందని అన్నారు. ఈ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పున్ణసమతుల్యత కారణంగా వాస్తవమైన బహుళధ్రువ ప్రపంచం గురించి మనం యోచించగలుగుతున్నామని అన్నారు. మరింత సమతూ కంతో కూడిన ప్రపంచ వ్యవస్థను సృష్టించాలంటే స్వతంత్ర వేదికలను బలోపేతం చేస్తూ, విస్తరించడం కీలకమని అన్నారు. అక్కడ నుండే బ్రిక్స్‌ ఉద్భవించిందన్నారు.
స్థిరీకరణ శక్తిగా బ్రిక్స్‌
ప్రపంచం చాలా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోం దని, ఈ పరిస్థితుల్లో స్థిరీకరణ శక్తిగా బ్రిక్స్‌ వ్యవహరించాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ బ్రిక్స్‌ నేతలను కోరారు. ఆధునికత దిశగా ప్రపంచ పేద దేశాలు ఉమ్మడిగా అడుగు వేయడమనేది ప్రపంచ చరిత్రలోనే చాలా పెద్ద సంఘటన అని వ్యాఖ్యానించారు. శాంతి స్థాపన కోసం మనం ఒక సుస్థిర శక్తిగా వ్యవహరించాలి, అంతర్జాతీయ భద్రతా పాలనను బలోపేతం చేయాలి, సమస్యలకు మూల కారణాలను అన్వేషించి, పరిష్కారాలను కనుగొనాలని పేర్కొన్నారు. శాంతియుత అభివృద్ధికి సంబంధించి తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నాయని హెచ్చరించారు.
తక్షణమే కాల్పుల విరమణ : జిన్‌పింగ్‌
గాజాలో కాల్పుల విరమణ జరగాలని జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. లెబనాన్‌లో పరిస్థితులు మరింత పెచ్చరిల్లకుండా చూడాల్సి వుందన్నారు. పాలస్తీనా, లెబనాన్‌ల్లో రక్తపాతం, విధ్వంసం వుండరాదని అన్నారు. .
రెండు దేశాల ఏర్పాటుతోనే చారిత్రక అన్యాయం సరిదిద్దగలుగుతాం : పుతిన్‌
ఏడాది క్రితం గాజాలో మొదలైన సైనిక దాడులు ఇప్పుడు లెబనాన్‌కు విస్తరించాయని, వీటివల్ల ఆ ప్రాంతంలోని ఇతర దేశాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌, ఇరాన్‌ మధ్య ఘర్షణల స్థాయి రాన్రాను పెరుగుతోందని హెచ్చరించారు. గొలుసు కట్టుగా జరిగే ఈ పరిణామాలు మొత్తంగా మధ్య ప్రాచ్యాన్ని పూర్తిస్థాయి యుద్ధం వైపునకు నెట్టేస్తున్నాయని వ్యాఖ్యానించారు. స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడేవరకు మధ్య ప్రాచ్యంలో హింస తప్పదని అన్నారు. ”పాలస్తీనా భూభాగాల్లో శాంతి, సుస్థిరతల పునరుద్ధరణ జరగాలంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, జనరల్‌ అసెంబ్లీ ఆమోదించిన రెండు దేశాల పరిష్కారాన్ని అమలు చేయడమొక్కటే మార్గం.” అని స్పష్టం చేశారు. దీనివల్ల పాలస్తీనా ప్రజలకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దడానికి వీలవుతుందని వ్యాఖ్యానించారు. కీలకమైన ఈ డిమాండ్‌ పరిష్కారం కానంతవరకు విషపూరితమైన ఈ హింసా చట్రాన్ని విచ్ఛిన్నం చేయడం సాధ్యం కాదని అన్నారు.