ఉడుత ఊపులకు భయపడేది లేదు, ఆంక్షలు విధించినా మరొకటి చేసినా రష్యా ఒంటరి కాదు అన్నదే రష్యాలోని కజాన్ పట్టణంలో జరిగిన పదహారవ వార్షిక ” బ్రిక్స్ప్లస్ ” శిఖరాగ్ర సభ సందేశం. ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తున్న అమెరికా, దాని అనుంగు దేశాలకు సున్నితంగా చేసిన ఒక హెచ్చరిక ఇది. అయితే నిర్దిష్టంగా సాధించిందేమిటి? అని అడిగేవారికి అరగ్లాసు నిండిన ఉదాహరణ మాత్రమే చెప్పగలం. ప్రభుత్వాల మధ్య సహకారం, వివిధ అంశాలపై ఉమ్మడి అవగాహన సాధన వంటి వాటిపై కేంద్రీకరణతో ప్రారం భమైన ఈ కూటమి ఇంకా బాల్యదశలోనే ఉంది. అమెరికా డాలరు ఆధిపత్యం నుంచి బయటపడటంతో పాటు అనేక అంశాల మీద సానుకూల వైఖరితో ముందుకు పోతున్న కారణంగానే ఈ కూటమిలో చేరేందుకు అనేక దేశాలు ముందుకొస్తున్నాయి. ముప్పు ఊహిస్తున్నవారు బుసలు కొడుతున్నారు. స్థాపకదేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా తరువాత చేరిన దక్షిణ కొరియాలతో పాటు ఇరాన్, ఈజిప్టు, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తొలిసారిగా సభ్యత్వహోదాతో హాజరు కాగా మరికొన్ని కొత్త దేశాలు కజాన్ సభకు హాజరయ్యాయి. గతం లోనే ఆహ్వానం అందుకున్న సౌదీ అరేబియా, అర్జెంటీనాలతో పాటు కొత్తగా ఆసక్తి చూపుతున్న లేదా దర ఖాస్తు చేసుకున్న అజర్బైజాన్, బెలారస్, టర్కీ, మంగోలియా వంటి రెండు డజన్ల దేశాలకు పుతిన్ ఆహ్వానం పంపాడు. రానున్న రోజుల్లో లాంఛనాలు పూర్తి చేసుకొని అవి చేతులు కలపబోతున్నాయి.
ప్రపంచ భూవిస్తీర్ణంలో 30, జనాభాలో 45శాతం ఉన్న దేశాలు ఈ కూటమిలో ఉండగా జీడీపీలో 27శాతం, 5.2లక్షల కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం కలిగిన ఈ కూటమి దేశాలను చిన్నవైనా పెద్ద దేశాలైనా విస్మరించజాలవు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, బ్రిక్స్ కంటింజెంట్ రిజర్వు అరేంజ్మెంట్, బ్రిక్స్ గణాంకాల ఉమ్మడి ప్రచురణ వంటి చొరవలతో ఇటీవలి కాలంలో వివిధ అంశాలలో ధనిక దేశాల జి7 కూటమికి ఇవి సవాలు విసురుతున్నాయి. దీనర్ధం, అమెరికా నాయ కత్వంలోనికి కూటమి దేశాల మాదిరి ప్రపంచంలో దేశాలు, ప్రాంతాల మధ్య తంపులు పెట్టడం, ఆక్రమిం చటం, దురాక్రమణదారు లకు మద్దతు వంటి దుర్మార్గాలకు బ్రిక్స్ లేదా బ్రిక్స్ ప్లస్ మద్దతునిస్తుందని కాదు. అభివృద్ధిలో పోటీపడతుంది. తానాషాహీ నహీ చెలేగీ అని హెచ్చరిస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చట్టవిరుద్దమైన బెదిరింపు చర్యలు, ఆంక్షలు చెల్లవని, అవి ఐరాస లక్ష్యాలు, నిరంతర వృద్ధి, పర్యావరణ ఒప్పం దాలకు విరుద్దమని కజాన్ ప్రకటన హెచ్చరించింది.
పలుచోట్ల హింసాకాండ, సాయుధ వివాదాలు పెరగటం పట్ల ఆందోళన వెల్లడించింది. ఏ ఒక్కదేశం పేరు ఈ ప్రకటనలో ప్రస్తావించకపోటాన్ని అవకాశంగా తీసుకుని ఉక్రెయిన్ యుద్ధం మీద కూటమి ఏకాభిప్రాయానికి రాలేకపోయిందని, ఇది తమ విజయమే అని ఉక్రెయిన్ చెప్పుకుంది. అదే అయితే సైనిక చర్య జరుపుతున్న రష్యాను కూడా బ్రిక్స్ తప్పు పట్టలేదు. ఈ వివాదంలో ఈ కూటమిలోని రెండు పెద్ద దేశాలైన చైనా, భారత్లు తట స్థంగా ఉన్నాయి, ఇదే సమయంలో పశ్చిమదేశాల ఆంక్షలను ఖాతరు చేయకుండా రష్యా నుంచి చమురు, ఇతర ఉత్పత్తులను ఈ రెండు దేశాలు గతంకంటే ఎక్కువగా కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభ ఆక్రమిత పాలస్తీనా ప్రాంతం, దక్షిణ లెబనాన్లో నెలకొన్న పరిస్థితి మీద తీవ్ర ఆందోళన వెల్లడిం చింది. ప్రత్యేకించి సామూహిక మారణకాండ జరుపుతున్న గాజా, పశ్చిమగట్టు ప్రాంతాలలో ఇజ్రాయిల్ చర్యలను నిలిపి వేయాలని డిమాండ్ చేసింది. ఉగ్రవాదంతో సహా ముఖ్యమైన సమస్యలన్నింటి పట్ల బ్రిక్స్ సభ తన వైఖరిని తెలిపింది.
పశ్చిమదేశాలు ఏర్పాటుచేసిన సంస్థలు కలవరపడుతున్న సమయంలో బ్రిక్స్ కూటమి కొత్త ఊపిరి పోసు కుంటున్నది. రష్యాను దెబ్బతీసేందుకు ఉక్రెయిన్ శాంతిసభల పేరుతో చేసిన ప్రయత్నం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మాదిరిగా ఉంది తప్ప మరో అడుగు ముందుకు పడటం లేదు. తక్షణమే డాలరుకు ప్రత్నామాయంగా మరో కరెన్సీని బ్రిక్స్ ముందుకు తీసుకురాలేకపోయినా, ముందుగా తమ కరెన్సీలను పటిష్టపరచుకొనే పనిలో నిమగమైంది. అంతర్జాతీయ బ్యాంకింగ్, విత్త,ద్రవ్య చట్టాలు మొదలైన వాటి మీద కసరత్తు జరుపుతున్నది. వందల ఏండ్లపాటు ప్రపంచ సంపదలను కొల్లగొట్టి తెగబలిసి ఇంకా కావాలంటున్న సామ్రాజ్యవాద- ధనిక దేశాలు తమ ఆధిపత్యాన్ని అంతతేలికగా వదులుకోవు. అయితే గడ్డిపోచలు ఒకటైతే గజాన్ని కూడా బంధిస్తాయన్నట్లుగా తగిన సమయం రావాలి.
రష్యా ఒంటరి కాదు-‘బ్రిక్స్’ సందేశం
10:56 pm