రష్యా దేశపు పట్టణం కజన్‌లో బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశం అక్టోబర్ 22 నుండి 24 వరకు జరిగింది. ఈ చారిత్రాత్మక సమావేశం ”భాగస్వామ్య దేశాలు” అనే ఒక కొత్త ప్రాతిపదికన 13 దేశాలను కలుపుకోడానికి ఆమోదం తెలిపింది. ఆ దేశాలు బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా)లో పూర్తి స్థాయి సభ్యత్వం పొందే క్రమంలో ఇది తొలి మెట్టు అవుతుంది. ఆ 13 దేశాలలో బొలీవియా, క్యూబా ఉన్నాయి. సామ్రాజ్యవాదుల పెత్తనం నుంచి తమ తమ దేశాల స్వాతంత్య్రాన్ని కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్న దేశాలపై అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాద దేశాలు ఏకపక్షంగా అమలు చేస్తున్న ఆంక్షలను ఈ సమావేశం వ్యతిరేకించింది. ఐఎంఎఫ్‌కు, అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థకు సంస్కరణలు ప్రతిపాదించింది. డాలర్ ఆధిపత్యాన్ని అధిగమించవలసిన ఆవశ్యకతను, అధిగమించడానికి చేపట్టవలసిన చర్యలను కజన్ ప్రకటన క్లుప్తంగా తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు రష్యన్ ప్రభుత్వసంస్థలు తమ తమ పత్రాలలో వివరంగా ప్రస్తావించాయి.
ఇవన్నీ మనం ఆహ్వానించవలసిన ముఖ్యమైన పరిణామాలు. ఐతే, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ), ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల పట్ల బ్రిక్స్ అవలంబించిన వైఖరిలో ఉన్న మౌలికమైన పరిమితులను మనం ఎంతమాత్రమూ విస్మరించ కూడదు. ఈ సంస్థలలో మరింత ఎక్కువ భాగస్వామ్యం ఇతర దేశాలకు కల్పించాలనే వైఖరిని బ్రిక్స్ తీసుకుంది. కాని అంతమాత్రం చేతనే మూడవ ప్రపంచ దేశాల సమస్యలు తీరిపోవు. బ్రిక్స్ అనేది భిన్న స్వభావం కల దేశాల కూటమి. దానికి అనేక పరిమితులు ఉన్నాయి. అందుచేత అది ఏదో విప్లవాత్మకమైన ఎజండాను చేపట్టగలదని మనం ఆశించజాలం. ఎటువంటి ఎజండాను చేపడితే అది విప్లవాత్మకమైన మార్పులకు దారి తీయగలదు అన్న అంశాన్ని నేనిక్కడ ప్రస్తావించదలిచాను.
ప్రపంచ వాణిజ్య సంస్థ, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలన్నీ ప్రస్తుతం సామ్రాజ్యవాద దేశాల పెత్తనంలో కొనసాగుతున్నందువల్లనే వాటి ప్రకటిత లక్ష్యాలు నెరవేరడం లేదని, వాటిలో ఇతర దేశాలకు కూడా తగిన ప్రాతినిధ్యం కల్పిస్తే పరిస్థితిని చక్కదిద్దవచ్చునని భావించి బ్రిక్స్ దేశాలు కజన్‌లో ప్రకటన రూపొందించాయి. ఐతే, ఈ అంతర్జాతీయ సంస్థలు అనుసరించే విధానాల్లో ఉన్న లోపాలను ఇతర దేశాల భాగస్వామ్యంతో చక్కదిద్దవచ్చునని భావించడం సరైనది కాదు. ఈ సంస్థల సారాంశమే తప్పుడు లక్ష్యాలతో కూడినటువంటిది, అందుచేత వాటిని ఎవరు నిర్వహించినా ఆ నిర్వహణ లోపభూయిష్టంగానే ఉంటుంది. గుత్త పెట్టుబడిదారీ విధానం వలన, కార్టెల్స్ వలన కార్మికులు ప్రస్తుత వ్యవస్థలో దోపిడీకి గురౌతున్నారని, వాటి వరకూ నిషేధించి, తతిమ్మా స్వేచ్ఛా మార్కెట్ విధానాలను అమలు చేస్తే కార్మికులపై సాగే దోపిడీని నిర్మూలించవచ్చునని భావించడం ఎంత పొరపాటో, అంతర్జాతీయ సంస్థల పట్ల బ్రిక్స్ అనుసరిస్తున్న వైఖరిదీ అంతే పొరపాటు.
ప్రపంచ వాణిజ్య సంస్థనే ఉదాహరణగా తీసుకోండి. సంపన్న దేశాలు తమ తమ మార్కెట్లను రక్షణాత్మక చర్యలతో నియంత్రిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని కజన్ ప్రకటన పేర్కొంది. ఈ విధంగా వ్యవహరించడం వలన మూడవ ప్రపంచ దేశాలు వివక్షతకు గురవుతున్నాయని ప్రకటించింది.
డబ్ల్యు.టి.వో లో ఇతర దేశాల ప్రాతినిధ్యం మెరుగుపడితే ఈ వివక్షత లేకుండా చూడవచ్చునని తెలిపింది. ఐతే, డబ్ల్యు.టి.వో ఏర్పడడానికి ప్రాతిపదిక స్వేచ్ఛా వాణిజ్య సూత్రం. ఈ సూత్రమే తప్పు. మార్కెట్‌లో మొత్తంగా చూసినప్పుడు డిమాండ్‌కు ఎన్నడూ కొరత ఉండదు అన్న ‘సే’ సూత్రం మీద స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతం ఆధారపడింది. డిమాండ్‌కు కొరత ఉండదు గనుక మార్కెట్ల కోసం పోరాటం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని ఈ సిద్ధాంతం భావిస్తుంది. ప్రతీ దేశమూ పూర్తి స్థాయిలో ఉద్యోగాలను కల్పిస్తుందని, పూర్తి స్థాయిలో తన వనరులను వినియోగంలోకి తెస్తుందని భావిస్తుంది. స్వేచ్ఛా వాణిజ్యం అమలు చేయక ముందు గాని, అమలైన తర్వాత కాని ఈ స్థితిలో ఏ మార్పూ ఉండదని అంటుంది. ఆ యా దేశాలు ఏయే సరుకులు ఉత్పత్తి చేయాలన్న అంశం మాత్రమే అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా మారుతుందని స్వేచ్ఛా మార్కెట్ సిద్ధాంతం చెప్తుంది.
ఇది పెట్టుబడిదారీ విధానపు వాస్తవికతతో బొత్తిగా సంబంధం లేని అర్ధరహితమైన అవగాహన. ఆర్థికంగా బలహీనమైన మూడవ ప్రపంచ దేశాలను స్వేచ్ఛా వాణిజ్యంలోకి నెట్టడమంటే వాటిని మనుగడ కోసం సాగే తీవ్రమైన పోటీలోకి దించడమే. దాని ఫలితంగా వాటి మధ్య పరస్పర సహకారం అందించుకునే అవకాశం దెబ్బతినిపోతుంది. డబ్ల్యు.టి.వో సిద్ధాంతాన్ని ఆచరణలో పెడితే అది వివిధ దేశాల నడుమ సహకారాన్ని పెంపొందించడం కాకుండా వాటి మధ్య పీకలు తెగ్గోసుకునేంత తీవ్రమైన పోటీ నెలకొంటుంది.
ఏ దేశమూ రైతులకు మద్దతు ధరలు అమలు చేయకూడదన్నది డబ్ల్యు.టి.వో నిబంధనలలో ఇంకొకటి. దీనిని భారతదేశం అమలు చేస్తుందా లేక ఉల్లంఘిస్తుందా అన్నది పక్కన పెడితే ఇన్‌పుట్ సబ్సిడీలు అమలు చేయకూడదని, దాని వలన స్వేచ్ఛా మార్కెట్‌లో కొన్ని దేశాలు తక్కినవాటికన్నా ఎక్కువ ప్రయోజనం పొందుతాయని, పండిన పంట విలువ మీద ఆధారపడి కొంతమేరకు సబ్సిడీ ఇవ్వవచ్చునని డబ్ల్యు.టి.వో అంటుంది. స్వేచ్ఛా మార్కెట్ ‘సామర్ధ్యాన్ని’ ఇన్‌పుట్ సబ్సిడీలు దెబ్బ తీస్తాయని అది అర్ధం లేని వాదన చేస్తుంది.
అంతర్జాతీయ వాణిజ్యం అంతా డాలర్ కరెన్సీలోనే నడుస్తోందని, దానిని మార్చి అంతర్జాతీయ వాణిజ్యం ఆ యా దేశాల జాతీయ కరెన్సీల ద్వారా జరపాలని బ్రిక్స్ దేశాల ప్రకటన పేర్కొంది. డాలర్ పెత్తనాన్ని లేకుండా చేయాలన్న లక్ష్యం మంచిదే. కాని అది మాత్రమే సరిపోదు. దానితోబాటు ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యాన్ని కూడా తొలగించాలి. ఇది జరగాలంటే కనీసం మూడు షరతులు నెరవేర్చాలి. మొదటిది: అంతర్జాతీయ వాణిజ్యంలో లోటు ఖాతాలు ఉన్న దేశాల ఖాతాలను సర్దుబాటు చేయడం బదులు మిగులు ఖాతాలు ఉన్న దేశాల ఖాతాలను సర్దుబాటు చేయాలి. అప్పుడే ఖాతాలలో ప్రస్తుతం ఉన్న అసమానతలు తొలగిపోతాయి. రెండవది: ఈ అసమానతలు తొలగిపోయే వరకూ మిగులు ఖాతాలు ఉన్న దేశాలు లోటు ఖాతాలు ఉన్న దేశాల నుంచి అందవలసిన మొత్తాలను వసూలు చేయకుండా నిలిపివేయాలి. మూడవది: బకాయి ఉన్న రుణాలను చెల్లువేసే పేరుతో ఒక దేశం ఆస్తులను వేరొక దేశానికి బదలాయించకూడదు.
వాణిజ్య ఖాతాలో మిగులు ఉన్న దేశాల ఖాతాలు సర్దుబాటు చేయడం అంటే ఆ దేశం తన ఎగుమతులను పెంచే బదులు దేశీయ వినియోగాన్ని పెంచాల్సి వుంటుంది. అప్పుడు లోటు ఖాతా ఉన్న దేశాల ఎగుమతులు పెరిగే అవకాశం ఉంటుంది. దేశీయంగా వాటి వినియోగం పెరగకపోయినా ఎగుమతులు పెరిగే అవకాశాలు విస్తరిస్తే ఆ దేశంలో ఉత్పత్తిని పెంచవలసి వస్తుంది. దానివలన ఆ దేశంలో ఉపాధి అవకాశాలు పెరిగి అది దేశీయ డిమాండ్ కూడా పెరగడానికి దోహదపడుతుంది. అటు మిగులు ఖాతా ఉన్న దేశాలలోనూ దేశీయ వినియోగం పెరిగి, ఇటు లోటు ఖాతా ఉన్న దేశంలోనూ డిమాండ్ పెరిగి మొత్తం ప్రపంచ స్థూల డిమాండ్ పెరుగుతుంది. సంపన్న దేశాలలోని కార్మికుల వినియోగం పెరిగినందువలన వాని జీవన ప్రమాణాలు మెరుగౌతాయి. ఇటు వెనుకబడిన దేశాలలో ఉపాధి అవకాశాలు పెరిగి అక్కడ కూడా శ్రామికుల పరిస్థితి మెరుగు పడుతుంది.
అలా కాకుండా, వాణిజ్య లోటు ఉన్న దేశాల ఖాతాలను సర్దు బాటు చేయడం అంటే (ప్రస్తుతం జరుగుతున్నది ఇదే) దేశీయంగా వినియోగాన్ని తగ్గించుకుని ఆ సరుకును ఎగుమతి చేయాలి. దాని వలన దేశీయంగా మాంద్యం నెలకొంటుంది. దాని వలన ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ తగ్గిపోతుంది. దీని ప్రభావం శ్రామికవర్గం మీద ప్రధానంగా పడుతుంది. అందుచేత వాణిజ్య ఖాతాలో మిగులు ఉన్న దేశాలలోనే వాణిజ్యంలో సర్దుబాటు చేయడం మెరుగైన విధానం ఔతుంది. అయితే దీనికి ఆ దేశాలను ఒప్పించడం కష్టం.
వాణిజ్య ఖాతాల్లో మిగులు, లోటులను సర్దుబాటు చేయకుండా డాలర్ ఆధిపత్యాన్ని నిర్మూలించడం అంటే ఆచరణలో అది మరొక దేశపు కరెన్సీ ఆధిపత్యానికే దారితీస్తుంది. బ్రిక్స్ దేశాలు తమలో తాము మాత్రమే వాణిజ్యం నిర్వహించుకుంటాయని అనుకుందాం. అటువంటి వాణిజ్యం నడవాలంటే ఆ యా దేశాల కరెన్సీల మారకపు విలువలను స్థిరంగా ఉండేలా నిర్ణయించాలి (అలా స్థిరమైన మారకపు రేటు లేకపోతే నిరంతరం కొనసాగే స్పెక్యులేషన్ వలన ఆ వాణిజ్యం కొనసాగించడం అసాధ్యం ఔతుంది. అటువంటి వాణిజ్యం అమలులో ఉన్నప్పుడు ఒకానొక దేశం మరొక దేశంతో పోల్చుకున్నప్పుడు లోటు వాణిజ్యంలో ఉందనుకుందాం. ఆ లోటును పూడ్చడానికి తన దేశీయ డిమాండ్‌ను తగ్గించుకోవడం గాని, ఆ రెండో దేశానికి తాను బకాయి పడ్డట్టు రుణ పత్రాన్ని రాసి ఇవ్వడం కాని చేయాల్సి వుంటుంది. అప్పుడు క్రమంగా తన కరెన్సీ వత్తిడికి లోనవుతుంది. దాని వలన స్థిరమైన కరెన్సీ మారకపు రేటును కొనసాగించడం అసాధ్యం ఔతుంది. ఆ దేశపు కరెన్సీ మీద ఖాతాలో మిగులు ఉన్న దేశపు కరెన్సీ పైచేయి సాధిస్తుంది. అంటే బ్రిక్స్ దేశాలు కోరుతున్నట్టు డాలర్ ఆధిపత్యం పోవచ్చు. కాని దాని స్థానంలో మరో దేశపు కరెన్సీ ఆధిపత్యం చెలాయించడం మొదలు పెడుతుంది. అందుచేత ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యం డాలర్ రూపంలో ఉన్నా, మరొక కరెన్సీ రూపంలో ఉన్నా అది వాంఛనీయం కాబోదు.
ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్‌ల నిర్వహణలో మరిన్ని ఎక్కువ దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలని బ్రిక్స్ ప్రకటన కోరుతోంది. దాని వలన మూడవ ప్రపంచ దేశాలు ఆర్థిక సహాయం మరింత చౌకగా లభిస్తుందని అది భావిస్తోంది. అంతేగాక ఆ సహాయం పొందే దేశాల మీద విధించే షరతులు మరింత సరళతరం ఔతాయని అది ఆశిస్తోంది. ఇందుకోసం బ్రిక్స్ బ్యాంక్ కూడా తన నిధులను తోడు చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఇదెంత మంచి ఉద్దేశ్యంతో చేసిన ప్రతిపాదన అయినా, మూడవ ప్రపంచ దేశాల సమస్యను ఇది పరిష్కరించజాలదు. మరింత ఎక్కువ రుణాన్ని మరింత తేలికైన షరతులతో అందించడం అంటే ఆ దేశాల మెడలకు కట్టిన తాళ్ళ పొడవును మరికొంత పెంచడమే ఔతుంది. దాని వలన ఆ దేశాలు మరి కాస్త ఎక్కువ ప్రదేశంలో సంచరించగలుగుతాయే తప్ప వాటి మెడలకు కట్టిన తాళ్ళు తొలగిపోవు. ద్రవ్య పెట్టుబడి ఆవశ్యకతను తొలగిస్తే తప్ప మూడవ ప్రపంచ దేశాలకు విముక్తి లేదు.
ద్రవ్య పెట్టుబడి పాత్ర లేని అంతర్జాతీయ వాణిజ్యం అనే భావన ఊహాజనితంగా కొందరికి అనిపించవచ్చు. కాని సోవియట్ యూనియన్ ఉనికిలో ఉన్న కాలంలో భారతదేశంతో సహా పలు దేశాలు సోవియట్ యూనియన్‌తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కదుర్చుకున్నాయి. ఉభయ దేశాల కరెన్సీల మారకపు రేటును స్థిరంగా ఉండేలా నిర్ధారించడం, ఒక ఏడాదిలో వాణిజ్యంలో ఏర్పడిన మిగులును గాని తగులును గాని తర్వాతి ఏడాదికి వాయిదా వేయడం గాని, పరప్పరం అంగీకరించిన మేరకు సరుకుల, సేవల మార్పిడి ద్వారా సర్దుబాటు చేయడం గాని జరిగేది. ఈ తరహా వాణిజ్యంలో ఒక దేశపు కరెన్సీ ఆధిపత్యం చెలాయించడం అనేది ఉండేది కాదు. వాణిజ్య లోటు ఏర్పడితే ఆ దేశం ఆ లోటును సర్దుబాటు చేయడం కోసం తన దేశంలో పొదుపు చర్యలు చేపట్టడం వంటి పద్ధతుల అవసరం ఏర్పడేది కాదు. సోవియట్ యూనియన్‌లో అమలు అయినది ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థ గనుక అటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలను అది సర్దుబాటు చేయగల సామర్ధ్యాన్ని కలిగి వుండేది. సామ్రాజ్యవాదుల ఆధిపత్యం నుండి మూడవ ప్రపంచ దేశాలను కాపాడాలని బ్రిక్స్ దేశాలు భావిస్తున్నట్టైతే అవి సోవియట్ యూనియన్ తరహా సహకార ఒప్పందాలను అమలు చేసే విషయాన్ని పరిశీలించాలి.
ఇప్పుడు డబ్ల్యు.టి.వో, ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల ఆధిపత్యాన్ని ఆమోదించడం అంటే, వాటిని ఎంత ప్రజాస్వామీకరించినప్పటికీ, సామ్రాజ్యవాదం తన ప్రయోజనాల కోసమే రూపొందించిందన్న వాస్తవాన్ని విస్మరించడమే ఔతుంది.
(స్వేచ్ఛానుసరణ)
– ప్రభాత్ పట్నాయక్