సబ్సిడీలకు తూట్లు…

Links to subsidies...– కేటాయింపుల్లో కత్తెరింపులు దశాబ్దపు కనిష్టానికి వ్యయాలు
– మూలధన పెట్టుబడులకు ప్రాధాన్యత
– బీజేపీ పాలనలో సామాన్యులకు ఎగనామం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజల సంక్షేమానికి తూట్లు పొడుస్తోంది. సంక్షేమ పథకాలకు కేటాయింపులు, వ్యయాలను భారీగా తగ్గిస్తూ వస్తోంది. మరోవైపు ఇతర మూలధన పెట్టుబడులకు మాత్రం విపరీత ప్రాధాన్యతను ఇస్తోంది. గత 20 ఏండ్ల బడ్జెట్‌ను విశ్లేషిస్తే.. మోడీ ప్రభుత్వ హయాంలోని 10 సంవత్సరాల కాలంలో మొత్తం ప్రభుత్వ వ్యయంలో వాస్తవ మూలధన వ్యయం యొక్క వాటా చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకుంది. మరోవైపు సబ్సిడీల వాటా దశాబ్దపు కనిష్టానికి పడిపోయింది. వ్యయాల్లో యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ (యూపీఏ), బీజేపీ ప్రభుత్వాల వ్యయాల్లో స్పష్టమైన తేడా కనబడుతోంది. మోడీ ప్రభుత్వ హయాంలో సబ్సిడీల వ్యయాలు పదేండ్ల కనిష్టానికి పడిపోగా.. మూలధన వ్యయాలు నూతన గరిష్ట స్థాయిలకు చేరాయని యూనియన్‌ బడ్జెట్‌ డాక్యుమెంట్ల ఆధారంగా ది ప్రింట్‌ ఓ కథనం ప్రచురించింది. ప్రభుత్వ వ్యయంలో మూలధన వ్యయం అనేది భవనాలు, రోడ్లు, వంతెనలు మొదలైన స్థిర ఆస్తులను సృష్టించటం, స్వాధీనం చేసుకోవటంపై ప్రభుత్వం చేసే ఖర్చు. మౌలిక వసతులు, ఇన్నోవేషన్‌, భవనాలు, రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, జాతీయ రహదారులు, రైల్వేలు, రక్షణ తదితర ఎంపిక చేసిన మంత్రిత్వ శాఖలకు మూలధన వ్యయాలను అమాంతం పెంచింది. మరోవైపు సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసింది. గ్యాస్‌, పెట్రోల్‌, విద్యుత్‌, ఎరువులపై ఇచ్చే సబ్సిడీలకు మంగళం పాడగా.. అనేక సంక్షేమ కార్యక్రమాలకు కోతలు పెట్టింది. అదే కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో సబ్సిడీలు, సంక్షేమానికిి రెట్టింపు కేటాయింపులు జరిగాయి.
యూపీఏతో పోల్చితే అంతా రివర్స్‌..
కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ పాలనను నిందిస్తూ ఎప్పుడూ ఆరోపణలు చేసే మోడీ సర్కారు.. ఈ విషయంలో మాత్రం మిన్నకుండినట్లు వ్యవహరించింది. యూపీఏ, ఎన్డీఏ పాలనాకాలం 2004-24 కాలంలో చేసిన లోతైన విశ్లేషణలో పలు అంశాలు వెల్లడయ్యాయి. తాజా బడ్జెట్‌ ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ వాస్తవ మూలధన వ్యయం దాని మొత్తం వ్యయంలో 18.6 శాతంగా ఉంది. ఇది గత 20 ఏండ్లలోనే అత్యధికం. 2020-21 మహమ్మారి సంవత్సరం నుంచి ఇది పెరుగుతోంది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-15 నుంచి మొత్తం ప్రభుత్వ వ్యయంలో సబ్సిడీల వాటా క్షీణిస్తోంది.
మూలధన పెట్టుబడులపై దృష్టి సారించటం కారణంగా దాని ప్రభావం సబ్సిడీల వాటాపై పడుతుంది. 2023-24లో మొత్తం వ్యయంలో మూలధన వ్యయం వాటా 22.2 శాతంగా ఉంది. ఇది 2014-15లో 11.8 శాతంగా ఉంది. 2018-19 ముగిసే నాటికి ఇది 13.3 శాతానికి పెరిగింది. ఇక రెండో సారి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూలధన వ్యయాన్ని అమాంతం పెంచుతూ.. సబ్సిడీలకు కత్తెరలు వేస్తోంది. ఇది యూపీఏ దశాబ్ద కాలంలో జరిగిన దానికి భిన్నంగా వ్యవహారించింది. యూపీఏ-1 అధికారం చేపట్టిన 2004-05లో మొత్తం వ్యయంలో 17.2 శాతం మూలధన వ్యయాన్ని కలిగి ఉంది. ఇది 2008-09 నాటికి 10.8 శాతానికి పడిపోయింది. 2013-14లో యూపీఏ-2 పాలన ముగిసే సమయానికి మూలధన వ్యయం 12 శాతంగా ఉంది. మోడీ హయాంలో 2023-24 నాటికి గణనీయంగా 18.6 శాతానికి పెరిగింది.
సబ్సిడీల వాటా ఇలా..
మొత్తం వ్యయంలో సబ్సిడీల వాటా చూస్తే మోడీ పాలనలో తగ్గిపోయింది. యూపీఏ పాలన పర్వాలేదనిపించింది. ఈ వాటా 2004-05లో తొమ్మిది శాతం నుంచి 2008-09లో 14.4 శాతానికి పెరిగింది. యూపీఏ-2 పాలన ముగిసేనాటికి 2013-14లో సబ్సిడీల వాటా 16.3 శాతానికి పెరగటం విశేషం. దీనికి విరుద్ధంగా.. మోడీ ప్రభుత్వ హయాంలో(మహమ్మారి ప్రభావిత కాలాన్ని మినహాయిస్తే) సబ్సిడీల వ్యయం వాటా తగ్గింది. 2014-15 ముగింపు నాటికి ఇది 15.3 శాతానికి పడిపోయింది.
ఎన్డీఏ-1 పాలన ముగిసే నాటికి 2018-19లో 9.6 శాతానికి క్రమంగా పడిపోయింది. 2023-24లో ఏకంగా తొమ్మిది శాతానికి పడిపోవటం గమనార్హం. పదేళ్ల మోడీ పాలనలో దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలలో ఏ మాత్రమూ మార్పు రాలేదనీ, వారి ఆర్థిక పరిస్థితులు ఆశించినంతగా లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మోడీ ప్రభుత్వం తాను చేసే వ్యయంలో మూలధన పెట్టుబడుల (క్యాపెక్స్‌) పైనే అధికంగా దృష్టి సారిస్తుందని అంటున్నారు. కార్పొరేట్లకు భారీగా ప్రోత్సాహాకాలు, సహజ వనరులను అప్పనంగా కట్టబెడుతూ.. మరోవైపు వృథా ఖర్చులను తగ్గించాలన్న ప్రభుత్వ మాటలు నీటి మూటేలేననీ.. పదేళ్ల మోడీ పాలనలోని బడ్జెట్‌ విశ్లేషణ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. సబ్సిడీలకు కోతలు పెట్టి పేద, మధ్య తరగతి ప్రజలపై పెను భారాలను మోపిన మోడీ ప్రభుత్వాన్ని ఎవరూ మర్చిపోరని నిపుణులు విమర్శిస్తున్నారు.