బ్రిజ్‌ భూషణ్‌ వేధింపులు నిజమే

– ఢిల్లీ పోలీసులకు సాక్షుల వాంగ్మూలం
– సాక్షుల్లో ఇద్దరు రెజ్లర్లు, అంతర్జాతీయ రిఫరీ, కోచ్‌
– నాలుగు రాష్ట్రాల్లో 125 మంది సాక్షులు
న్యూఢిల్లీ : రెజ్లర్లను బీజేపీ ఎంపీ, డబ్లూఎఫ్‌ఐ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ లైంగి కంగా వేధించడం వాస్తవమేనని నలుగురు సాక్షులు ధ్రువీ కరించారు. ఆ సాక్షుల్లో ఇద్దరు రెజ్లర్లు, ఒక టాప్‌ రిఫరీ, ఒక రాష్ట్ర కోచ్‌ ఉన్నారు. సంఘటన జరిగిన ఆరు గంటల తరువాత తనను పిలిచారని కోచ్‌ చెప్పారు. ఆరోపణల గురించి తెలుసునని రిఫరీ తెలిపారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై కనీసం ముగ్గురు మహిళా రెజ్లర్ల ఆరోపణలను ఒక ఒలింపియన్‌, ఒక కామన్వెల్త్‌ బంగారు పతక విజేత, అంతర్జాతీయ రిఫరీ, రాష్ట్ర స్థాయి కోచ్‌ ధ్రువీకరించారు. నాలుగు రాష్ట్రాల్లోని 125 మంది సాక్షుల వాంగ్మూలాలను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. వారిలో ఈ నలుగురు ఉన్నారు.
ఏప్రిల్‌ 28న ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసిన తరువాత సాక్షులను విచారించారు. వృత్తిపరమైన సహాయానికి బదులుగా ”లైంగిక ప్రయోజనాలను” కోరిన కనీసం రెండు సందర్భాలు ఉన్నాయని తెలిపారు. దాదాపు 15 లైంగిక వేధింపుల సంఘటనలు, ఇందులో 10 ఎపిసోడ్‌లు అనుచితంగా తాకడం, వేధింపులు రొమ్ములపై చేతులు వేయడం, నాభిని తాకడం, వెంబడించడంతో సహా బెదిరింపులకు సంబంధించిన అనేక సందర్భాలు ఉన్నాయని తెలిపారు.ఈ నలుగురు సాక్షుల గురించి అడిగినప్పుడు, ఢిల్లీ పోలీసు ప్రతినిధి సుమన్‌ నల్వా ”ఈ కేసులో దర్యాప్తు, సాక్ష్యం ఏమిటనే దానిపై మేము వ్యాఖ్యానించలేము. విచారణ ఇంకా కొనసాగుతోంది. దీనిపై సిట్‌ విచారణ చేపట్టి నివేదికను కోర్టుకు అందజేస్తుంది” అని అన్నారు.
బ్రిజ్‌ భూషణ్‌ వేధింపుల ఘటన జరిగిన ఆరు గంటలకు దాని గురించి రెజ్లర్‌ తనకు ఫోన్‌లో తెలియజేసినట్లు ఫిర్యాదుదారుల్లో ఒకరి కోచ్‌ చెప్పినట్లు తెలిసింది. ఇద్దరు మహిళా రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించినప్పుడు వారి వాదనను ధ్రువీకరించారు. వారి వాంగ్మూలాలలో లైంగిక వేధింపుల సంఘటనలు జరిగిన ఒక నెల తరువాత ఫిర్యాదుదారు తమకు తెలియజేసినట్లు వారు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ సర్క్యూట్‌లో పేరున్న రిఫరీ, తాను స్వదేశంలో, విదేశాలలో టోర్నమెంట్‌లకు వెళ్లినప్పుడు మహిళా రెజ్లర్ల కష్టాల గురించి తాను విన్నానని ఢిల్లీ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.ఢిల్లీ పోలీసులు మహిళా పోలీసు సిబ్బందితో సహా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేశారు. లైంగిక వేధింపుల సంఘటనలు జరిగినట్లు ఆరోపించబడిన టోర్నమెంట్‌కు హాజరైన వారి గురించి డబ్ల్యుఎఫ్‌ఐ నుండి వివరాలను కోరింది. సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదులపై దర్యాప్తు చేసేందుకు బాక్సర్‌ మేరీకోమ్‌ అధ్యక్షతన ప్రభుత్వం నియమించిన పర్యవేక్షణ కమిటీ నివేదికను కూడా పోలీసులు సేకరించారు.
”సిట్‌ 158 మంది వ్యక్తుల జాబితాను సిద్ధం చేసింది. వారు హర్యానా, ఉత్తరప్రదేశ్‌, జార?ండ్‌, కర్ణాటకలను సందర్శించి సాక్ష్యాలను సేకరించి వాంగ్మూలాలను నమోదు చేశారు. ఇప్పటివరకు. వారు 125 మంది వ్యక్తుల వాంగ్మూలాలను నమోదు చేశారు. వారిలో నలుగురు తమ వాంగ్మూలాలలో ముగ్గురు మహిళా రెజ్లర్ల ఆరోపణలను ధ్రువీకరించారు”అని ఒక అధికారి తెలిపారు.
ఎఫ్‌ఐఆర్‌ల నమోదు తరువాత బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను సిట్‌ రెండుసార్లు ప్రశ్నించింది. ఈ రెండు సందర్భాల్లో, అతను తన ప్రమేయాన్ని తిరస్కరించాడని, తనను తప్పుగా ఇరికించారని పేర్కొన్నారు. రెజ్లర్లు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేరున్న డబ్ల్యుఎఫ్‌ఐ కార్యదర్శి వినోద్‌ తోమర్‌ను కూడా సిట్‌ మూడు నుంచి నాలుగు గంటల పాటు ప్రశ్నించింది. ”ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు మహిళా రెజ్లర్లు, ఒక మైనర్‌ తమ ఫిర్యాదులలో చేసిన ఆరోపణలను ధ్రువీకరించిన క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సిఆర్పిసి) సెక్షన్‌ 164 కింద మేజిస్ట్రేట్‌ ముందు వారి వాంగ్మూలాలను నమోదు చేశారు” అని ఒక అధికారి తెలిపారు.
రెజ్లర్ల అంశాన్ని జాతీయాధ్యక్షుడు జెపి నడ్డాకు రెండుసార్లు తెలిపా: చౌదరి బీరేంద్ర సింగ్‌
బీజేపీ ఎంపీ,, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్య్యూఎఫ్‌ఐ) చైర్మెన్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను తక్షణమే అరెస్టు చేయాలంటూ దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసనకు నాయకత్వం వహిస్తున్న విషయంపై తాను పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను రెండుసార్లు కలిశానని హర్యానా బిజెపి సీనియర్‌ నాయకుడు చౌదరి బీరేంద్ర సింగ్‌ తెలిపారు.మొదటి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన చౌదరి బీరేంద్ర సింగ్‌, నడ్డాతో ఫోన్‌లో మాట్లాడుతూ ”ప్రజల మనోభావాలు మల్లయోధుల వద్ద ఉన్నాయని, బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై చర్య తీసుకోకపోవడం వెనుక బీజేపీకి ఏదైనా రాజకీయ లెక్కలు ఉంటే, అది నష్టం జరుగుతుంది” అని అన్నారు. వినేశ్‌ ఫోగట్‌, బజరంగ్‌ పునియా, సాక్షి మాలిక్‌ .నేతృత్వంలోని రెజ్లర్లకు అనుకూలంగా మాట్లాడిన హర్యానాకు చెందిన అతికొద్ది మంది బీజేపీ నాయకులలో ఆయన ఒకరు. మిగిలిన ఇద్దరు హర్యానా బీజేపీ చీఫ్‌ ఒ.పి. ధంకర్‌, రాష్ట్ర హౌం, ఆరోగ్య మంత్రి అనిల్‌ విజ్‌ కూడా ఉన్నారు.
”కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నేను నడ్డాను కలిశాను. మే 7 లేదా 8, నాకు సరిగ్గా గుర్తు లేదు. ఈ సమస్య తీవ్రమైనదని, దీని వల్ల బీజేపీ రాజకీయంగా దెబ్బతింటుందని నేను ఆయనకు చెప్పాను. యువజన వ్యవహారాలు, క్రీడలు, హౌం మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకెళ్తానని బిజెపి అధ్యక్షుడు సమాధానం ఇచ్చారు” అని అన్నారు. దాదాపు వారం తరువాత తాను చర్చించిన అంశాన్ని మళ్ళీ నడ్డాకు గుర్తు చేసినట్లు బీరేంద్ర సింగ్‌ చెప్పారు. ”బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై చర్య తీసుకోవడాన్ని విస్మరించినందుకు పార్టీ మనస్సులో కొన్ని రాజకీయ లెక్కలు ఉంటే, వారు తప్పుగా భావిస్తారు. దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని నేను నిస్సందేహంగా నడ్డాతో చెప్పాను” అని ఆయన అన్నారు. ”ఎఫ్‌ఐఆర్‌లోని విషయాలలో మరింత తీవ్రమైన విషయం ఏమిటంటే, తాము లైంగిక వేధింపుల విషయాన్ని రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ దష్టికి తీసుకెళ్లామని మహిళా రెజ్లర్లు పేర్కొనడం. ఇది చిన్న విషయం కాదు” అని అన్నారు.
బ్రిజ్‌ భూషణ్‌ ను వెంటనే అరెస్టు చేయాలి : ఎస్కేఎం
పోక్సో చట్టాన్ని సవరించాలంటూ బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ చేసిన ప్రకటనలను సంయుక్త కిసాన్‌ మోర్చా తీవ్రంగా ఖండించింది. ఆయనను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్కేఎం, కార్మిక సంఘాలు, మహిళలు, యువకులు, విద్యార్థులు, సాంస్కృతిక కార్యకర్తలు, వ్యాపారులు, సాధారణ పౌరుల ఉమ్మడి వేదిక జూన్‌ 5న దేశవ్యాప్తంగా నిరసనలను నిర్వహించనున్నట్లు తెలిపింది. దేశంలోని గ్రామ, పట్టణ కేంద్రాలలో ప్రదర్శనలు, కొవ్వొత్తుల మార్చ్‌ లు నిర్వహించనున్నట్లు తెలిపారు. లైంగిక వేధింపుల నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న ప్రధానమంత్రి మోడీ .నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ, మన కుమార్తెలకు సంఘీభావంగా ముందుకు రావాలని పౌరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపింది. మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతాయని హెచ్చరించింది.
రెండేండ్ల కిందటే ప్రధానికి చెప్పాం : ఎఫ్‌ఐఆర్‌లో రెజ్లర్లు
డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయాన్ని ఒక మహిళా రెజ్లర్‌ రెండు సంవత్సరాల క్రితమే అంటే 2021లోనే ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసికెళ్లారు. తగిన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ కూడా ఇచ్చారు. బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో మహిళా రెజ్లర్లు ఈ విషయాన్ని పేర్కొన్నారు.
ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం…క్రీడాకారులను గౌరవించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని మహిళా రెజ్లర్‌ కలిసి లైంగిక వేధింపుల ఉదంతాన్ని వివరించారు. లైంగికంగా, భావోద్వేగపరంగా, మానసికంగా, శారీరకంగా తన పైన, తోటి రెజ్లర్ల పైన నిందితుడు జరిపిన అకృత్యాలను ఆమె ప్రధానికి తెలియజేశారు. నిందితుడి సన్నిహిత సహచరులు కూడా ఈ చర్యలకు మద్దతు తెలిపారని చెప్పారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ ఈ విషయాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని, త్వరలోనే సమాచారం ఇస్తుందని హామీ ఇచ్చారు. అయితే నేటి వరకూ ప్రధాని నుండి కానీ, ప్రభుత్వంలోని ఇతర పెద్దల నుండి కానీ రెజ్లర్లకు ఎలాంటి న్యాయం లభించలేదు.