బ్రిజ్‌ భూషణ్‌ను పదవి నుంచి తప్పించాలి

– అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి : టీఎస్‌యూటీఎఫ్‌ డిమాండ్‌
– రెజ్లర్ల పోరాటానికి మద్దతుగా ర్యాలీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
భారత రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను పదవి నుంచి తొలగించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.జంగయ్య డిమాండ్‌ చేశారు. వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. రెజ్లర్ల పోరాటానికి మద్దతుగా బుధవారం టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య పార్క్‌ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో దేశానికి పతకాలు సాధించిన మహిళా క్రీడాకారుల ఆవేదనను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవటం దుర్మార్గమన్నారు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే నామమాత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని, నిందితుడు అధికార పార్టీ ఎంపీ కావడంతోనే అతనిపై చర్య తీసుకోకుండా కాపాడుతున్నారని విమర్శించారు. పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభం రోజున నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న రెజ్లర్లను అడ్డుకుని కేసు పెట్టారని, ఢిల్లీ జంతర్‌ మంతర్‌లో నెల రోజులుగా నడుస్తున్న ఆందోళనా శిబిరాన్ని తొలగించి నిలువ నీడ లేకుండా చేయటం దారుణమన్నారు. ప్రజాస్వామ్య వాదు లంతా క్రీడాకారులకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గాభవాని మాట్లా డుతూ.. కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ని డబ్ల్యూఎఫ్‌ఐ పదవి నుంచి తప్పించి.. సత్వరమే రెజ్లర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో మరింత మంది మహిళా మల్ల యోధులు ముందుకొచ్చి భారత్‌కు పతకాలు తీసుకొచ్చేలా దారిచూపెట్టాల్సిన ప్రభుత్వమే ఈ విధంగా మౌనంగా ఉండటం సరైందని కాదన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, కోశాధికారి లక్ష్మారెడ్డి, కార్యదర్శులు సోమశేఖర్‌, వెంకట్‌, రాజశేఖర్‌ రెడ్డి, శాంతకుమారి, నాగమణి, రవికుమార్‌, శ్రీధర్‌, సింహాచలం, జ్ఞాన మంజరి, మహబూబ్‌ అలీ, కొండలరావు, పలువురు రాష్ట్ర కమిటీ సభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.