బ్రిజ్‌భూషణ్‌ తిరుగుబాటు?

య్– కీడాశాఖ విధించిన సస్పెన్షను గుర్తించమని సంజయ్ సింగ్‌ వ్యాఖ్య
న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ (డబ్య్లూఎఫ్‌ఐ) మరింత సంక్షోభంలో కూరుకునే ప్రమాదంలో పడింది. మహిళా రెజ్లర్లపై బిజెపి ఎంపీ, డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడగా అతడిపై చట్టపర చర్యలకు డిమాండ్‌ చేస్తూ భారత స్టార్‌ రెజ్లర్లు జంతర్‌మంతర్‌ వద్ద మూడు నెలల పాటు తీవ్ర ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. బ్రిజ్‌భూషణ్‌,అతడి అనుచరులు రెజ్లర్లపై కక్ష సాధింపు చర్యలకు దిగగా.. రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికల జాప్యంతో ఇప్పటికే యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యుడబ్ల్యూడబ్ల్యూ) భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా రెజ్లర్ల భద్రతపై ఎటువంటి రాజీ ఉండబోదని, పారదర్శక విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. ఇక న్యాయస్థానం ఆదేశాలతో డిసెంబర్‌ 21న భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడిగా సంజరు సింగ్‌ ఎన్నికయ్యారు. బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు సంజయ్ సింగ్‌ వ్యాపార భాగస్వామి,అత్యంత సన్నిహితుడు, నమ్మిన బంటు!. దీంతో సంజరు సింగ్‌ ఎన్నికను నిరసిస్తూ అగ్రశ్రేణి రెజ్లర్లు తీవ్ర నిర్ణయాలు తీసుకున్నారు. సాక్షి మాలిక్‌ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలుకగా.. వినేశ్‌ ఫోగట్‌ ఖేల్‌రత్న, అర్జున అవార్డులను, బజరంగ్‌ పూనియా పద్మశ్రీ పురస్కారాలను వెనక్కి ఇచ్చారు. దీంతో సార్వ్రతిక ఎన్నికల ముంగిట రాజకీయ ప్రయోజనాలు కాపాడుకునేందుకు రెజ్లింగ్‌ సమాఖ్య నూతన ఎగ్జిక్యూటివ్‌ బాడీని సస్పెండ్‌ చేస్తూ కేంద్ర క్రీడాశాఖ అధికారులు సర్క్యూలర్‌ జారీ చేశారు. క్రీడాశాఖ నిర్ణయం అనంతరం బీజేపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో బ్రిజ్‌భూషణ్‌ సమావేశమయ్యారు. క్రీడా రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటన చేశారు. బీజేపీ పెద్దలతో సమావేశం అనంతరం తెర ముందు నుంచి తెర వెనక్కి వెళ్లిన బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌.. సంజరు సింగ్‌ భుజాలపై గన్‌ పెట్టి షూట్‌ చేయటం మొదలెట్టారు!.
గుర్తించం, సహకరించం : భారత రెజ్లింగ్‌ సమాఖ్య నూతన కార్యవర్గం ఎన్నికైన మూడురోజుల్లోనే సస్పెన్షన్‌ ఎదుర్కొవటంపై అధ్యక్షుడు సంజయ్ సింగ్‌ స్పందించారు. ప్రజాస్వామికంగా ఎన్నికైన కార్యవర్గాన్ని సస్పెండ్‌ చేసే అధికారం క్రీడాశాఖకు లేదని వ్యాఖ్యానించాడు. ‘ క్రీడాశాఖ ఏ అధికారంతో రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ కార్యవర్గాన్ని సస్పెండ్‌ చేసింది. హైకోర్టు విశ్రాంత మాజీ చీఫ్‌ జస్టిస్‌ రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించి, ఎన్నికైన దవప్రతాలు అందించారు. నిబంధనల ప్రకారమే జాతీయ చాంపియన్‌షిప్స్‌ షెడ్యూల్‌ ప్రకటించాం. క్రీడాశాఖ మాపై వేసిన సస్పెన్షన్‌ను గుర్తించబోము. క్రీడాశాఖ ఏర్పాటు చేసిన అడ్‌హాక్‌ కమిటీకి ఏమాత్రం సహకరించేది లేదు. ఫిబ్రవరిలో జైపూర్‌ వేదికగా నేషనల్‌ చాంపియన్‌షిప్స్‌ ఏర్పాటుకు అడ్‌హాక్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. సస్సెన్షన్‌పై క్రీడాశాఖకు కార్యవర్గం తరఫున లేఖ రాశాం. రెండు మూడు రోజుల్లో చర్చలకు ముందుకొస్తే సరే.. లేదంటే కొత్త కార్యవర్గమే రెజ్లింగ్‌ సమాఖ్య వ్యవహారాలను చూసుకుంటుంది. మేమే జాతీయ చాంపియన్‌షిప్‌ పోటీలను నిర్వహిస్తాం. రాష్ట జట్లను పంపించకుంటే అడ్‌హాక్‌ కమిటీ ఏం చేయగలదు? అని సంజయ్ సింగ్‌ ప్రశ్నించారు. భారత రెజ్లింగ్‌ సమాఖ్యలో 25 అనుబంధ రాష్ట సంఘాలు ఉన్నాయి. వీటిలో కనీసం 23 రాష్ట్ర సంఘాలు బ్రిజ్‌భూషణ్‌ కనుసన్నల్లో నడుస్తున్నాయి. సంజరు సింగ్‌ సారథ్యంలోని ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సొంతంగా జాతీయ టోర్నీలు నిర్వహిస్తే భారత రెజ్లింగ్‌లో మరో సంక్షోభం ముంచుకొచ్చినట్టే అని సంబంధిత వర్గాలు అంటున్నాయి.