మెరిసిన పంత్‌, పాండ్య

మెరిసిన పంత్‌, పాండ్య– సంజూ, దూబె విఫలం
– భారత్‌ స్కోరు 182/5
నవతెలంగాణ-న్యూయార్క్‌
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సన్నాహక సమరంలో వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ (53, 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో రాణించాడు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య (40 నాటౌట్‌, 23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) డెత్‌ ఓవర్లతో ధనాధన్‌ మోత మోగించాడు. పంత్‌, పాండ్య మెరుపులతో బంగ్లాదేశ్‌తో ఏకైక వార్మప్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించిన బంగ్లాదేశ్‌.. బలమైన భారత్‌ను 182 పరుగులకు కట్టడి చేసింది.
పంత్‌ ఫటాఫట్‌ : న్యూయార్క్‌ నయా స్టేడియంలో టాస్‌ నెగ్గిన టీమ్‌ ఇండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆలస్యంగా జట్టుతో చేరిన విరాట్‌ కోహ్లి వార్మప్‌ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. జట్టుతో పాటు స్టేడియానికి వచ్చినా.. మైదానంలోకి అడుగుపెట్టలేదు. కోహ్లి లేకపోవటంతో రోహిత్‌ శర్మ తోడుగా యశస్వి జైస్వాల్‌ ఓపెనర్‌గా వస్తాడని అంచనా వేయగా.. సంజు శాంసన్‌ (1) ఓపెనర్‌గా వచ్చాడు. ఆరు బంతులు ఆడిన శాంసన్‌ ఒక్క పరుగే వికెట్‌ కోల్పోయాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (23) సైతం ఆశించిన ప్రదర్శన చేయలేదు. రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 19 బంతుల్లో 23 పరుగులే చేశాడు. నం.3 బ్యాటర్‌గా వచ్చిన రిషబ్‌ పంత్‌ (53) ధనాధన్‌ దంచికొట్టాడు. పవర్‌ప్లేలో సూపర్‌ షాట్లతో అలరించాడు. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 32 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. అర్థ సెంచరీ అనంతరం పంత్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెళ్లాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (31, 18 బంతుల్లో 4 ఫోర్లు) మిడిల్‌ ఓవర్లలో మెప్పించినా.. ఎక్కువ సేపు వికెట్‌ కాపాడుకోలేదు. శివం దూబె (14) లభించిన చక్కటి అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. 16 బంతుల్లో ఓ సిక్సర్‌తో 14 పరుగులే చేసి నిరాశపరిచాడు. హార్దిక్‌ పాండ్య (40 నాటౌట్‌) దంచికొట్టాడు. నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లతో భారత్‌కు మెరుగైన స్కోరు అందించాడు. రవీంద్ర జడేజా (4 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు. భారత ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు యశస్వి జైస్వాల్‌, అక్షర్‌ పటేల్‌ బ్యాటింగ్‌ చేయలేదు. బంగ్లాదేశ్‌ స్పిన్నర్‌ మెహిది హసన్‌ (1/22), షోరిఫుల్‌ ఇస్లాం (1/26), మహ్మదుల్లా (1/16) రాణించారు.