బృందావ‌న్ ఎంజిల్..

బృందావ‌న్ ఎంజిల్ఉత్తరప్రదేశ్‌.. మధురైలోని బృందావన్‌ దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందింది.  బృందావన్‌లోని యమునా నదిలో స్నానాలు చేసేందుకు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అక్కడకు వచ్చిన వారిలో వితంతువులూ ఉంటారు. అందరూ తిరిగి వెళతారు. కానీ వితంతువుల్లో కొందరు అక్కడే ఉండిపోతారు. అలాంటి వారికి సంవత్సరాలుగా సేవలందిస్తున్న డాక్టర్‌ లక్ష్మీ విజయ‌ గౌతమ్‌ను బృందావన్‌ ఏంజిల్‌గా అక్కడి ప్రజలు ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. వితంతువులు, అనాథలకు తోచిన సహాయం అందించాలన్న తపనకు బీజం ఆమె చిన్నతనంలోనే పడింది. 2013లో ప్రారంభించిన తన ఎన్జీవో ‘కనక ధార’ ద్వారా వారికి ఆపన్నహస్తం అందిస్తున్న ఆమె జీవిత ప్రస్థానం నేటి మానవిలో..
ఎనిమిదేండ్లకే భర్తను కోల్పోయానని, అప్పటి నుంచి ఈ బాధల జీవితంలోకి నెెట్టబడ్డానని ఓ వితంతువు చెప్పిన చిన్ననాటి జ్ఞాపకం డాక్టర్‌ లక్ష్మి గౌతమ్‌ మనసులో చెరగని ముద్ర వేసింది. అప్పుడు లక్ష్మికి 10 ఏండ్లు. ఆమె తండ్రి గ్రామంలో ప్రఖ్యాత పండితుడు. ఆధ్యాత్మిక మార్గనిర్దేశం కోసం తన తండ్రి వద్దకు వచ్చిన ఇద్దరు స్త్రీల రూపాన్ని ఆమె గమనించింది.
ఇద్దరు స్త్రీల కథ
‘వారిద్దరూ ఇప్పటికీ నా కండ్లలో మెదులుతారు. వారు పశ్చిమ బెంగాల్‌ నుంచి వచ్చారు – ఒకరు ఎర్ర అంచున్న తెల్లటి బెంగాలీ చీరను ధరించి, తలపై కుంకుమ, చేతులకు గాజులతో ఉన్నారు. మరొకరు గుండు, మాసిపోయిన బట్టలు, బొట్టులేదు, గాజులూ లేవు. ఇద్దరిలో ఈ వ్యత్యాసం ఏమిటో అప్పుడు నాకు అర్థం కాలేదు. ఈ విధంగా ఎందుకు అని నేను ఆశ్చర్యపోయాను..’ అంటుంది లక్ష్మి. అదే ప్రశ్న తండ్రిని అడిగింది. ‘నువ్వు చిన్న పిల్లవు. ఇలాంటివి నీకు ఇప్పుడే అర్థం కావులే…’ అన్న తండ్రి సమాధానం తెలుసుకోవాలన్న ఆసక్తిని మరింత పెంచింది. కారణాన్ని స్వయంగా తెలుసుకోవాలనుకుంది.
అప్పుడే నిర్ణయించుకుంది…
ప్రతి సంవత్సరం తమ ఇంటికి వచ్చే దూరపు కుటుంబ స్నేహితుల్లో ఒకరిని గమనించింది. ఆమె కూడా అంతే… గుండుతో, తెల్ల చీర కట్టుకొని ఉండటాన్ని చూసింది. ధైర్యాన్ని కూడగట్టుకుని.. ఆమెను అడిగింది. తొమ్మిదేండ్ల వయసులో ఆమె కంటే చాలా ఎక్కువ వయసున్న వ్యక్తితో పెళ్లయింది. భర్త మరణించటంతో ఆమె జీవితం మసకబారింది. ‘ఆ రోజు నుంచి, నాకు గుండు చేయిస్తున్నారు. ఆడుకోవడానికి కూడా బయటకు అనుమతించరు. పాత బియ్యంతో ప్రత్యేకంగా అన్నం వండుకోవాలి. బెంగాలీ ఆహారంలో ముఖ్యమైనది.. నేను చాలా ఇష్టంగా తినే చేపలను కూడా తిననివ్వరు’ అని ఆమె లక్ష్మికి చెప్పింది. భర్తలను కోల్పోయిన మహిళలు ఇంత దుర్భరమైన జీవితంలోకి ఎందుకు నెట్టబడుతున్నారో అర్థంకాలేదు. ఇలాంటి ఆచారాన్ని ధిక్కరించాలని అప్పుడే నిర్ణయించుకుంది.

‘వితంతువుల నగరం’గా..
పశ్చిమ బెంగాల్‌ సహా దేశంలో బాల్య వివాహాలు చాలా ఎక్కువ. వయసు రీత్యా, ఏ కారణంతోనైనా భర్త చనిపోతే.. వీరు వితంతువులుగా మిగిలిపోతున్నారు. అవమానాలు భరించలేక.. ఇంటి నుంచి వారు వచ్చేస్తున్నారు.  బృందావన్‌లో కొన్ని ఆశ్రమాలు వితంతువులకు ఆశ్రయం ఇస్తున్నాయి.
వెలుగులోకి ఇలా…
వితంతువులకు నిజంగా ఇక్కడ మెరుగైన జీవితం ఉందా? వాస్తవం మరోలా వుంది. 2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఒకరు దర్శనం కోసం బందావనం వచ్చారు. అక్కడ వితంతువులు పడుతున్న అవస్థలను ఆయన వెలుగులోకి తెచ్చారు. పవిత్ర నది ఒడ్డున అనాథలుగా చనిపోతున్న వితంతువులు అంటూ మీడియాలో కథనాలూ వచ్చాయి. వారికి న్యాయం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో, పట్టణాన్ని సర్వే చేసి, వితంతువుల కష్టాలపై అవగాహనకు ఏడుగురు సభ్యుల ప్యానెల్‌ను నియమించింది. ఆ కమిటీలో డాక్టర్‌ లక్ష్మి కూడా ఒకరు. ఈ కమిటీలో భాగం కావడం ద్వారా వితంతువుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను లోతుగా తెలుసుకుంది. అలాగే వారి సామాజిక-ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రశ్నలు రూపొందించారు. అందులో వారి అంత్యక్రియలు నిర్వహణపైనా ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకు హృదయ విదారక సమాధానాలు వచ్చాయి. వారి అంతిమ సంస్కారాలను ఎవరూ పట్టించుకోకపోవడం ఆమెను ఆవేదనకు గురిచేసింది. ‘మృతదేహాలను క్లెయిమ్‌ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతే.. వాటిని ముక్కలుగా నరికి, గోనె సంచిలో వేసి.. పారే స్తారు…’ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.
అమలు అంతంత మాత్రమే
‘ఇది దిగ్భ్రాంతికరమైనది. షెల్టర్‌ హౌమ్‌లలో మరణించిన మహిళలకు వారి మతాచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలి’ అని మథురలోని సివిల్‌ హాస్పిటల్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ను 2012లో సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా.. అమలు అంతంత మాత్రమే.. బందావనంలో ఏ ఒక్క వితంతువు కూడా దయనీయస్థితిలో చనిపోకూడదు. అత్యంత దారుణంగా వారి అంత్యక్రియలు జరగకూడదని డాక్టర్‌ లక్ష్మి తనకు తాను వాగ్దానం చేసుకున్నది. వారి కర్మకాండలు గౌరవప్రదంగా చేయాలనే ఉద్దేశంతో ‘కనకధార’ అనే ఎన్జీఓను ప్రారంభించింది. ‘కనకధార’ అనేది ఆమె అత్తయ్య పేరు. తను స్థాపించిన ఈ ఎన్జీఓ ద్వారా వితంతువులకు ఆసరాగా నిలుస్తున్నది. ఇటు ఎన్జీఓ పనులు… అటు కళాశాల ప్రొఫెసర్‌గా విధులు.. రెండిటినీ సమతుల్యం చేయడం అంత సులభం కాదు, కానీ డాక్టర్‌ లక్ష్మి దానిని సజావుగా నిర్వహిస్తున్నది. కనక ధార ద్వారా అనేక కార్యకలాపాలు జరుగుతాయి.
వితంతువులకు అంత్యక్రియలు
ఇప్పటి వరకు, డాక్టర్‌ లక్ష్మి దాదాపు వెయ్యి మందికి పైగా వితంతువులకు అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాన్ని అంబులెన్స్‌ ఎక్కించటం నుంచి… చివరి వరకూ… ప్రతిదీ ఆమె చూసుకుంటుంది. సాధువులు, కుటుంబాలు ముందుకు రావడానికి నిరాకరించిన నిరుపేదలకు కూడా తన వంతు సహాయం చేస్తున్నది. కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు. 72 రోజుల పాటు మధురలో వందలాది మంది అనాథలకు వండి వడ్డించింది. యువతులు పారిపోవటం, కిడ్నాప్‌కు గురికావటం వంటి కేసుల్లోనూ కనక ధార సహాయం చేస్తుంది. ”మేం వారి అడ్రస్‌ గుర్తించడానికి ప్రయత్నిస్తాం, పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేస్తాం. ఈ విధంగా వందలాది మంది అమ్మాయిలకు సహాయం చేసాం” అని ఆమె చెప్పింది. ఫుడ్‌ డ్రైవ్‌లు, మెడికల్‌ క్యాంపులు, ఇతర సేవా కార్యక్రమాల ద్వారా డాక్టర్‌ లక్ష్మి బందావన్‌లోని నిరుపేదలకు మెరుగైన జీవితాన్ని అందిస్తున్నారు.
కరోనా సమయంలోనూ..
అత్యంత క్లిష్టమైన కేసును గుర్తుచేసుకుంటూ.. అది మహమ్మారి దశ. ‘ఘాట్‌ వద్ద పడివున్న మృతదేహానికి సంబంధించి నాకు అర్ధరాత్రి ఒంటి గంటకు కాల్‌ వచ్చింది. నేను అక్కడికి వెళ్లి అంత్యక్రియలు నిర్వహించాను’ అని చెప్పింది లక్ష్మి. ‘మీరు భయపడలేదా?’ అని కొందరు నన్ను ప్రశ్నించారు. ‘ప్రాణమున్న వారితోనే భయపడాలి.. మృతదేహాలు ఏం చేస్తాయి?…’ అంటుంది లక్ష్మి.
సంకల్పం ఉంటే..
అత్త ప్రోత్సాహంతో పీహెచ్‌డీ పూర్తిచేసిన ఆమె లెక్చరర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే సామాజిక సేవలో భాగస్వామి అవుతున్నది. ‘నేను ఒకసారి ఇన్విజిలేషన్‌ డ్యూటీలో ఉన్నాను. ఎవరూ తీసుకెళ్ళకుండా పడివున్న ఓ వితంతువు మతదేహం గురించి ఫోన్‌ వచ్చింది. తన ఇన్విజిలేషన్‌ డ్యూటీకి ప్రధానోపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం చూపించి వెళ్ళాను’ అంటూ గుర్తుచేసుకున్నారు. నేను సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ఒక బైకర్‌ను లిఫ్ట్‌ అడిగాను. అంబులెన్స్‌ సహాయంతో మృతదేహాన్ని స్మశానవాటికకు చేర్చాం. అంత్యక్రియలు నిర్వహించాం, అంతా పూర్తయ్యే వరకూ దాదాపు మూడు గంటలు అక్కడే ఉన్నాను’ అని చెప్పింది. చేయాలన్న సంకల్పం ఉంటే చాలు. ఎలాంటి ఇబ్బందులూ అడ్డురావు అంటుంది లక్ష్మి.