ప్రకృతి వైద్యానికి జీవం పోయాలి

దేశంలోనే పేరెన్నిక గల ఆయుష్‌ కళాశాలలు వైద్యవిద్యకు తలమానికంగా ఉన్న కళాశాలలు, పరి శోధన సంస్థలు హైదరాబాద్‌ నగరంలో ఉన్నాయి. గత పదేండ్లుగా ఇవి నిర్లక్ష్యం కాబడ్డాయి. గాంధీ ప్రకృతి చికిత్సాలయం, కళాశాల, ఎర్రగడ్డలోని ఆయుర్వేద, యునాని కళాశాలలు, రామాంతపూర్‌లోని హోమియోపతి కళాశాలలు శాశ్వత అధ్యాపకులు లేక వెలవెలబోతున్నాయి. ఉన్న అరకొర అధ్యాపకులు ఉద్యోగ విరమణ పొందడం వలన కొత్తగా అధ్యాపకుల నియామకానికి నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడంతో నేడు ఈ కళాశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న గాంధీ ప్రకృతి వైద్యశాలకు నిత్యం రోగుల తాకిడి ఎక్కువగా ఉంటున్నది. అందుకనుగుణంగా చికిత్స విభాగంలో సూపర్‌ వైజర్లు, డాక్టర్లు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. అయినప్పటికీ అందుబాటులో ఉన్న డాక్టర్లు వారికి నాణ్యమైన వైద్య సేవలందించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు స్టైఫండ్‌ చాలా తక్కువగా ఉంది. పక్క రాష్ట్రం ఏపీతో పోల్చుకుంటే దాదాపు పదివేల రూపాయలు వ్యత్యాసం ఉంది. దీన్ని గమనించి తెలంగాణలోని హౌస్‌ సర్జన్లకు స్టైఫండ్‌ని పెంచడంతో పాటు సత్వరమే కళాశాలల్లో అధ్యాపకులు, డాక్టర్లను, ట్రీట్మెంట్‌ సెక్షన్‌ అసిస్టెంట్లను నియమించి ప్రకృతి వైద్యానికి జీవం పోయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
– డా. ఎం. అఖిల మిత్ర