భారతదేశంలో ఒకనాటి సమాజ జీవనం ఎంత దుర్భరంగా ఉండేదో తెలుసుకుంటే వళ్లు గగుర్పొడుస్తుంది. నాటి సమాజంలో మార్పులు తీసుకురావడానికి అనాటి బ్రిటీషు ప్రభుత్వం చేసిన చట్టాలు ఎంతవరకు ఉపయోగ పడ్డాయీ? భయంకరంగా వేళ్లూనుకుని ఉన్న మనువాద భావజాలాన్ని అవి ఎలా తగ్గించగలిగాయీ? ఒకసారి అవలోకనం చేసుకోవడానికి నేనిక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు పొందుపరు స్తున్నాను – ‘సతీ సహగమనం’ అనే దురాచారాన్ని పాటించడం నాటి సమాజంలో తప్పనిసరిగా ఉండేది. భర్త చనిపోతే, భర్త చితిపై భార్యను తోసి సజీవంగా కాల్చేసేవారు. భార్య వయసులో ఎంత చిన్నదయినా పట్టించుకునేవారు కాదు. వయసు మళ్లిన పురుషులకు (ముసలి వాళ్లకు) చిన్నవయసు ఆడపిల్లల్ని ఇచ్చి పెండ్లి చేయడం వాడుకలో ఉండేది. ఆ వృద్ధుడు గనక చనిపోతే, భార్య అయినందువల్ల ఎంత చిన్న పిల్లయినా, యువతి అయినా సతీసహగమనం చేయాల్సిందే : మంటల్లో కాలుతున్న ఆడపిల్ల (భార్య) పెడబొబ్బలు పెడుతూ బయటికి రావడానికి ప్రయత్నిస్తే, పెద్ద పెద్ద కర్రలతో ఆమెను నిర్దాక్షిణ్యంగా మంటల్లోకి – కాలి బూడిదయ్యే దాకా మళ్లీ మళ్లీ తోసేసేవారు. దీన్ని సనాతన ధర్మంగా గొప్పగా చెప్పుకునేవారు మనుషులుగా సిగ్గుపడాలి కదా?
నాటి ఈ దురాచారాన్ని అడ్డుకోవడానికి నాటి బ్రిటీష్ ప్రభుత్వం సతీసహగమన నిషేధ చట్టం (1829) అమలు చేసింది. అలాగే హిందూ వివాహ వయసు చట్టం (1891) తెచ్చింది. వీటి వల్ల సతీ సహగమనం అగినా, బాల్యంలోనే బాలబాలికలకు వివాహాలు చేయడమనే దురాచారం కొనసాగుతూ వచ్చింది. కాబట్టి, ఒక వంద సంవత్సరాల తర్వాత, వారు మళ్లీ బాల్యవివాహాల చట్టం (1929) కూడా తేవాల్సి వచ్చింది. వాటి ఫలితంగా సమా జంలో చాలా వరకు మార్పు వచ్చింది. యుక్తవయసు వచ్చిన తర్వాతే వివాహాలు జరగడం ప్రారంభమైంది.
తొలి సంతానాన్ని గంగకు అర్పించే ఆచారం నాటి సమాజంలో ఉండేది. పసికూనల్ని గంగ (నీళ్లలో వేసి చంపడం అధర్మమవుతుందే తప్ప, ఎలా ధర్మమవుతుందీ? నీటి (గంగ)లో కొట్టుకుపోతున్న పసిపాపల్ని తెచ్చి పెంచుకోవడం హిందూపురాణాల్లో చూస్తుంటాం. భారతంలో కుంతీపుత్రుడు గంగపాలయిన వాడేకదా? ఈ దురా చారాన్ని రూపుమాపడానికి బ్రిటీషు ప్రభుత్వం-శిశు హత్యానిషేధ చట్టం(1804) తీసుకొచ్చింది. దీన్నే ఆడపిల్లను గంగలో పడేసే ఆచార నిషేధ చట్టం అని కూడా అన్నారు. సత్యస్థాపన కోసం క్రైస్తవ మత న్యాయస్థానాలు విధించిన శిక్షలు అనుభవించి ప్రాణత్యాగాలు చేసిన వైజ్ఞానికులు యూరోప్ దేశాలలో కొంతమంది ఉన్నారు. వాళ్లు వేళ్ల మీద లెక్కించగలిగిన కొద్దిమందే- అయినా, వారి త్యాగానికి అర్థం ఉంది. మరి ఇక్కడీ ఈ బ్రాహ్మణిజ ఆధిపత్యపు వికృతానందం కోసం ఏండ్లకేండ్లు లక్షల మంది మహిళలు సజీవంగా అగ్నికి ఆహుతై దగ్ధమయ్యారు. ఏ సత్యమూ ఇక్కడ ఆవిష్కరింపబడలేదు. పైగా ఆ మహిళల త్యాగానికి విలువ కూడా లేకుండాపోయింది.
పెండ్లయిన ప్రతి శూద్రవధువు బ్రాహ్మణుడితో మొదటిమూడు రాత్రులు గడపాలనడం ఆనాడు బ్రాహ్మ ణిజం అమలుపరిచిన దుర్మార్గమైన ఆచారం. బ్రాహ్మణుల అహంకారం, ఆధిపత్యం ఇలా ప్రతివిషయంలోనూ కని పించేది. దీన్ని అడ్డుకోవడానికి నాటి బ్రిటీషు ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. శూద్ర వధువు బ్రాహ్మణుడితో మొదటి మూడురాత్రులు గడిపే ఆచార నిషేధ చట్టం (1819)తో పరిస్థితులు మారుతూ వచ్చాయి. శూద్ర మహిళలు తమ ఆత్మగౌరవం నిలుపుకోగలిగారు. లైంగిక సంబంధాల్లో నీతి బలపడింది.
పెద్ద పెద్ద కట్టడాల పునాదుల్లో ‘చరక పూజ’ పేరుతో అక్కడ… ఒక శూద్రుడిని సజీవంగా కాల్చేయడం ఉండేది. అలా ఒక్కొక్కటిగా 1837- 1852 సంవత్సరాల మధ్య కాలంలో- అనేక సందర్భాల్లో జరిపే నర బలుల్ని బ్రిటీషు ప్రభుత్వం చట్టాలు చేసి అడ్డుకుంది. నరబలులు తగ్గాయి కానీ, జంతుబలులు కొనసాగుతూ వచ్చాయి. ఇప్పటికీ కొన్నిప్రాంతాల్లో, కొన్ని సందర్భాలో ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. యజ్ఞం, యాగాల పేరుతో పశువుల్ని బలివ్వడమనేది పూర్వం సనాతన హిందూ ధర్మకర్తలు ప్రారంభించారు. దానికి ‘బలి’ అని ఒక గొప్పపేరు పెట్టుకున్నారు గానీ, జంతువుల్ని చంపుకు తినడమే అక్కడ జరిగింది. ఇంద్రుడు, వరుణుడు అంటూ లేని దేవుళ్ల పేరు చెప్పి, తిని మదిర తాగి తందనాలాడడమే యజ్ఞులు చేయడమంటే-పైగా ఆ యజ్ఞయాగాలతో రాజ్యంలో శాంతి స్థాపించబడుతుందనీ, వాతావరణం శుభ్రపడుతుందనీ, కోరుకున్న కోర్కెలు తీరతాయనీ, సమాజం ఉద్ధరించబడు తుందని సనాతనవాదులు అబద్దాలు ప్రచారం చేశారు.
శూద్రులకు, విద్యాహక్కు, సంపద హక్కు వంటివి ఏవీ బ్రాహ్మణవాద ఆధిపత్య సమాజంలో ఉండేవి కావు. పారపాటున ఏ శూద్రుడైనా వేద పఠనం చదువుకోవటానికి ప్రయత్నిస్తే నాలుక కోసేవారు. చాటుగా ఏ శూద్రుడైనా వింటే అతని చెవిలో సీసం పోసేవారు. కష్టపడి శూద్రులు ధనార్జన చేసినా, వాటి మీద హక్కు బ్రాహ్మణుడికే ఉండేది. ఈ పద్ధతిని మార్చడానికి నాటి బ్రిటీష్ ప్రభుత్వం బానిస నిషేధ చట్టం తెచ్చింది (1813) శూద్రులకు వారి సంపద మీద వారికి హక్కునిస్తూ అస్తిహక్కు చట్టం (1875) తెచ్చింది. మనుధర్మ శాస్త్ర ప్రకారం – ఎస్సీ,ఎస్టీ, బీసీ రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, మిగతా అన్ని కులాల వారు బ్రాహ్మణుడికి బానిసలే!
ఇకపోతే స్త్రీలందరూ శూద్రుల కిందే లెక్క! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య స్త్రీలకు మినహాయింపు ఏమీ లేదు. వారు కూడా శూద్రులే. శూద్రులకు విద్యాహక్కు, ఆస్తిహక్కు లేనట్లుగానే, స్త్రీలకు కూడా విద్యాహక్కు ఆస్తిహక్కూ లేదు. బ్రిటీషు వారి చట్టాలు అమలులోకి వచ్చిన తర్వాతనే, అన్ని వర్గాల్లోని మహిళలకు, శూద్రులకు, దళితులకు, ఆదివాసీలకు ఈ విషయాల్లో కొంత స్వేచ్ఛ లభించింది. సమాజంలో అతి కొద్ది శాతంగా ఉన్న పురుష బాహ్మణులకు మాత్రమే విద్యకు అర్హత ఉండేది. క్షత్రియ, వైశ్య వర్గాలు బ్రాహ్మణుల వద్దనే విద్యను అభ్యసించాల్సి వచ్చేది. ఆ విధంగా తమ ఆధిపత్యం కొనసాగించుకున్నారు. బ్రిటిషు ప్రభుత్వం హిందూ స్త్రీ ఆస్తి హక్కు చట్టం (1837) తెచ్చింది. దానితో స్త్రీలు-పురుషుడి ఆస్తిలో భాగం కాదు, ఆత్మగౌరవం గల వ్యక్తులుగా సమాజంలో భాగమని చెప్పినట్లయ్యింది. ఆంగ్ల విద్యా పద్ధతి చట్టం (1835) అందరికీ ప్రభుత్వ ఉద్యోగ చట్టం (1833) వంటివి రావడం (సమాజ స్వరూపం త్వరితగతిన మారుతూ వచ్చింది.
ఇక నేరాల విషయానికి వస్తే, చేసిన నేరాలు ఒకటే అయినా, మనుషుల కులాల్ని వర్గాల్ని బట్టి శిక్ష లుండేవి. మనుస్మతి రాసుకుంది బ్రాహ్మణార్హులే కాబట్టి, వారికి వారు తీవ్రమైనా శిక్షలు రాసుకోలేరుకదా? అందువల్ల బ్రాహ్మణులకు శిక్షలుండేవి కావు. ఉన్నా అతి తేలికపాటి శిక్షలు మాత్రమే ఉండేవి. శూద్రులకు, దళితులకు, ఆదివాసీలకు కఠినమైన శిక్షలుండేవి. ఈ పరిస్థితి మార్చడానికి బ్రిటీషు ప్రభుత్వం సమాన శిక్ష చట్టం (1817) అమలు చేసింది. అప్పటి నుండి నేరస్థుల పట్ల వివక్ష లేకుండా ఒనే రకం నేరానికి – ఒకే రకం శిక్ష విధించడం జరుగుతూ వచ్చింది. అంతకు ముందు బ్రాహ్మణుడు ఏ తప్పు చేసినా ఏ శిక్షా ఉండేది కాదు. సమాన శిక్ష చట్టం – మనుషులంతా సమానులే అని చెప్పినట్లయ్యింది. నిమ్న కులాలతో సహా అందరికీ విద్యాహక్కు చట్టం (1813) రావడంతో దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.
బ్రాహ్మణారులు ప్రచారం చేసి, పాటించిన మరొక దురాచారం అస్పశ్యత! దీనితో వారు మనుషుల్ని బాగా విభజించగలిగారు. మనుషుల ఆకారాలు ఒకటే. శరీర ధర్మరీత్యా మనుషుల లక్షణాలన్నీ ఒకటే. పుట్టుక చావూ ఒకటే బ్రాహ్మణులకు, బహుజనులకూ మధ్య తేడాలున్నట్లు- ఏ వైజ్ఞానిక శాస్త్రం చెప్పలేదు. అందరిదీ ఒకే జాతి-హామోసేపియన్ల’నే చెప్పింది… ఈ కత్రిమ విభజనను చెరిపేయడానికి బ్రిటీష్ ప్రభుత్వం – బానిస నిషేధ చట్టం (1813) తీసుకొచ్చింది. సమానశిక్ష చట్టం (1817) తీసుకొచ్చింది. ఆధిపత్యం కోసం బ్రాహ్మణవాదం చేసిన గిమిక్కును తిప్పికొట్టింది. ఎవరి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా బ్రాహ్మణ పురోహితుడిని ఆహ్వానించి, అతనికి శక్తికి మించి దక్షిణలివ్వడం ఇష్టమున్నా లేకపోయినా పూజలో భాగంగా అతడి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం- వగైరా ఇప్పటికీ జరుగుతోంది. అన్ని మూఢనమ్మకాల వలె ఇది ఒక మూఢనమ్మకమే-ఇలా చేయాలని ఎవరు ప్రచారం చేశారూ? తమ స్వలాభం కోసం, తమ అధిపత్యం కోసం బ్రాహ్మణులే విధివిధానాలు రూపొందించి, బల వంతంగా బహుజనులతో చేయిస్తున్నారు. దేవుడే ఒక అబద్దమయితే…. ఆ అబద్దాన్ని ఒక బూచిగా చూపిస్తూ పూట గడుపుకుంటున్నదెవరో ఆలోచిస్తే నిజం తెలుస్తుంది. బ్రాహ్మణిజపు ఉక్కు పిడికిలిలోంచి బయటపడినవారికే జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. నేటి యువతరం ఆ పనిలోనే ఉన్నారు.
అన్యమతస్థులకు ఆస్తిహక్కు చట్టం (1856) చేసిన నాటి బ్రిటీషు ప్రభుత్వం 1830-37 సంవత్సరాల మధ్యకాలంలో థగ్గులను అణచివేసే చట్టాలు కూడా చేసింది. మనమిక్కడ బ్రాహ్మణవాదానికి సంబంధించి చర్సిస్తున్నాం కాబట్టి – చెరువు నీళ్లు తాగినందుకు.. గర్భిణులు, బాలింతలు, వద్ధులు, పిల్లలు అని చూడకుండా నిర్దాక్షిణంగా కొట్టి చంపడం బ్రాహ్మణవాద దుశ్చర్యల్లో ఒకటిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అస్పశ్యులను ఊరి బయటకు తరిమి మూతికి ముంత, నడుముకు చీపురు కట్టించి, చెప్పులు చేత పట్టించి ఉట్టి కాళ్లతో నడిపించిన ఘనత బ్రాహ్మణవాదానిదే-ఈ బ్రాహ్మణవాద విధానాలు ఎవరో కూర్చుని రాసినవి కావు. తమ అధిపత్యం కొనసాగించుకోవడానికి వేలఏండ్లలో కొందరు కాలక్రమంలో చేర్చుతూ వచ్చారు. అన్నింటినీ కలిపి ‘మనువు’ అనేవాడు రాశాడనీ – దాన్నే ‘మనుధర్మ శాస్త్ర’మని, ‘మనుస్మతి’ అనీ ప్రచారం చేశారు.
ఇప్పుడు మనకున్న రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, దాని స్థానంలో ఈ మనుస్మతిని నిలబెట్టాలని ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆరెస్సెస్- బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ పదేండ్లలో దేశాన్ని వేలఏండ్ల క్రితానికి తోసేసి, సమాజాన్ని వెనక్తి నడిపించే ఈ ప్రభుత్వ కుట్రని ఈ దేశప్రజలు ఛేదించాలి! ఎక్కడికక్కడ తిరస్కరిస్తూ ఉండాలి! హిందూమతమనే కాదు, అసలు ఏ మతంలోనూ ఎవరికి ఒరిగింది ఏమీలేదు. అందువల్ల మతాలను పక్కనపెట్టి, మానవీయ విలువలకు ప్రాధానమిచ్చే ప్రభుత్వాల్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో నీచమైన రాజకీయాలు చేసే మూర్ఖుల భరతం పడితే గాని, సమాజ ఆరోగ్యం బాగుపడదు!
– సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త (మెల్బోర్న్ నుంచి)
డాక్టర్ దేవరాజు మహారాజు