– వరద తాకిడికి నీట మునిగిన వరి పంట
– 200 ఎకరాల్లో నష్టం
నవతెలంగాణ-మునగాల
సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలో నాగార్జున సాగర్ ఎడమకాల్వ ఎస్‌కేప్‌కు అమర్చిన షెట్టర్స్ ఆదివారం రాత్రి విరిగిపోయాయి. దాంతో తూము నుంచి ప్రవహించే వరద తాకిడికి కోతకొచ్చిన వరి పంటలు నీట మునిగాయి. చివరి దశలో ఉన్న బావులు, బోర్ల కింద సాగు చేసిన వరి పంటలను కాపాడేందుకు అధికారులు ఈ నెల 17న 6200 క్యూసెక్కుల నీటిని కాల్వకు విడుదల చేశారు. దశాబ్దాల కాలంగా ఈ షెట్టర్స్‌కు మరమ్మతులు లేని కారణం అవి తుప్పు పట్టి విరిగిపోయినట్టు సమాచారం. ఈ ఏడాది సాగర్ ఎడమకాల్వకు నీరు విడుదల లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు షెట్టర్స్ బేరింగులు అపహరించుకుపోయారు. దాంతోనే అవి విరిగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటపొలాల మీదుగా వరదనీరు ప్రవహించడంతో పంటంతా నీట మునిగింది. మునగాల మండలంలోని మునగాలలో 30 ఎకరాలు, బరాఖత్ గూడెంలో50, ముకుందాపురం లో 50, చిలుకూరు మండలం పోలేనిగూడెంలో 50, బేతవోలులో 50ఎకరాల్లో పంట నీటమునిగింది. సమారు 200ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఈ నెల 25వరకు కాల్వకు నీటిని విడుదల చేయాలని ఆదేశాలు వున్నప్పటికీ షెట్టర్స్ విరిగిన కారణంగా అధికారులు నీటిని నిలిపేశారు. కాల్వలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇసుక మూటలు వేసి తాత్కాలికంగా నీటిని ఆపేందుకు చర్యలు చేపట్టారు.