బ్రూక్‌ ట్రిపుల్‌, రూట్‌ డబుల్‌

Brook tripled, Root doubled– ఇంగ్లాండ్‌ బ్యాటర్ల శతకాల మోత
ముల్తాన్‌ (పాకిస్థాన్‌): ఇంగ్లాండ్‌ యువ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ (317, 322 బంతుల్లో 29 ఫోర్లు, 3 సిక్స్‌లు) ట్రిపుల్‌ సెంచరీతో చెలరేగగా.. స్టార్‌ ఆటగాడు జో రూట్‌ (262, 375 బంతుల్లో 17 ఫోర్లు ) డబుల్‌ సెంచరీతో కదంతొక్కాడు. జీవం లేని ముల్తాన్‌ పిచ్‌పై బ్రూక్‌, రూట్‌లు శతకాల మోత మోగించటంతో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. జాక్‌ క్రావ్లీ (78, 85 బంతుల్లో 13 ఫోర్లు), బెన్‌ డకెట్‌ (84, 75 బంతుల్లో 11 ఫోర్లు) సైతం రాణించగా 150 ఓవర్లలో 823/7 పరుగులకు ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్‌ ప్రకటించింది. పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 152/6తో ఎదురీదుతోంది. మరో 115 పరుగుల వెనుకంజలో నిలిచిన పాకిస్థాన్‌.. బ్యాటింగ్‌ లైనప్‌ను కోల్పోయింది. తొలి టెస్టులో నేడు ఆఖరు రోజు. ఉదయం సెషన్లోనే చివరి నాలుగు వికెట్లు పడగొట్టి మరోసారి బ్యాట్‌ పట్టే అవసరం లేకుండా విజయం సాధించాలని ఇంగ్లాండ్‌ భావిస్తోంది.