బరిలో అన్నదమ్ములు

– ఒకరు కాంగ్రెస్‌.. మరొకరు బీజేపీ !
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
సొంత అన్నదమ్ములు వారిద్దరు. రెండు వేర్వేరు ప్రధాన పార్టీల నుంచి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడుతున్నారు. జిల్లా సంగారెడ్డి. కాకపోతే నియోజకవర్గాలు వేర్వేరు. వాళ్లెవరో కాదు.. మాజీ ఉపముఖ్యమంత్రి సిలారపు దామోదర రాజనర్సింహ, సిలారపు రాంచందర్‌. వీరి తండ్రి సిలారపు రాజనరసింహ ఆందోల్‌ ఎమ్మెల్యేగా 1967, 1972, 1978లో వరుసగా మూడుసార్లు కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించారు. ఇక దామోదర రాజనర్సింహ 1989, 2004, 2009లో మూడుసార్లు గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఈసారి కూడా కాంగ్రెస్‌ తరపున ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికల పోటీలో ఉన్నారు. ఆయన సోదరుడు రాంచందర్‌ జహిరాబాద్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల్లోకి అడుగుపెట్టారు. అన్నదమ్ములిద్దరూ వేర్వేరు పార్టీలు, వేర్వేరు నియోజకవర్గాల నుంచి రంగంలో ఉండటం ఆసక్తిరేపుతున్నది.