– మంత్రి శ్రీధర్‌బాబు ఆవేదన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు శాసనసభ స్పీకర్‌ను అవమానిస్తున్నాయని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్త్తూ నిబంధనలను, సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మెన్ చట్టసభలను నిర్వహిస్తారని తెలిపారు. అంతేగానీ ఏక్షపక్షంగా వ్యవహారాలు చేయరని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ మీడియా హాల్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వ్యక్తులపై భిన్నాభిప్రాయాలున్నప్పటికీ ప్రతి ఒక్కరూ వ్యవస్థను గౌరవించాల్సిందేనని చెప్పారు. సభాపతి ఒక ప్రక్రియ ప్రకారం అసెంబ్లీ కమిటీలను ఏర్పాటు చేస్తారని తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ఎవరూ మాట్లాడేందుకు లేదని చెప్పారు. బీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీ వ్యవహారాలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని పాలించేందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు లేకుండా చేశారని తెలిపారు.ఆ పార్టీని ప్రజలు జీరో చేసినప్పటికీ బీఆర్‌ఎస్ నేతల్లో మార్పు రాలేదని విమర్శించారు. అధికారం కోల్పోయామన్న బాధతో బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలరాసిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను తారుమారు చేసి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లు భట్టి విక్రమార్కను ఇబ్బంది పెట్టారని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు కాకుండా పీఏసీ పదవి ఎవరికిచ్చారని ప్రశ్నించారు.