నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా దెబ్బతీస్తూ, భారతీయ జనతా పార్టీకి కొమ్ముకాస్తున్న వీ6 ఛానల్, వెలుగు దినపత్రికలను బహిష్కరించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజాస్వామంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సదరు మీడియా సంస్థలు భారతీయ జనతా పార్టీ జేబు సంస్థలుగా మారి అబద్ధాలు, అసత్యాలు, కట్టుకథలతో బీఆర్‌ఎస్ పార్టీపై, తెలంగాణ రాష్ట్రంపైన విషం చిమ్మడమే ఏకైక ఎజెండాగా పని చేస్తున్నాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ మీడియా సమావేశాలకు వీ6, వెలుగు మీడియా సంస్థలను అనుమతించకూడదని నిర్ణయించింది. దాంతో ఈ సంస్థలు నిర్వహించే చర్చలతో సహా ఎలాంటి కార్యక్రమాల్లోనూ పార్టీ ప్రతినిధులు ఎవరూ పాల్గొనకూడదని నిర్ణయం తీసుకుంది. బీజేపీ గొంతుకగా మారి, విశ్వసనీయత కోల్పోయిన ఈ మీడియా సంస్థల అసలు స్వరూపాన్ని, ఎజెండాను తెలంగాణ ప్రజలు గ్రహించాలని బీఆర్‌ఎస్ విజ్ఞప్తి చేసింది.
బహిష్కరణ సరికాదు : టీడబ్ల్యూజేఎఫ్
వీ6 న్యూస్‌ఛానల్, వెలుగు దినపత్రికలను బహిష్కరించాలనే బీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయాన్ని టీడబ్ల్యూజేఎఫ్ ఖండించింది. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. మంగళవారం ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, బి.బసవపున్నయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్‌ఎస్ నిర్ణయం అప్రజాస్వామికమని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను నిరంతరం చైతన్యం చేసిన మీడియాపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం, అవహేళన చేయటం సరిగాదని పేర్కొన్నారు. ప్రశ్నను అడ్డుకోవడం ఎవరివల్లా సాధ్యం కాదని స్పష్టం చేశారు.