– భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం
– బీఆర్‌ఎస్ లీగల్ సెల్ రాష్ట్ర ప్రతినిధుల సమావేశంలో తీర్మానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ తీర్మానించింది. శనివారం తెలంగాణ భవన్ లో సీనియర్ న్యాయవాది, రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ భరత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశానికి 33 జిల్లాల నుంచి న్యాయవాదులు హాజరయ్యారు న్యాయవాదుల సంక్షేమం కోసం గతంలో ప్రకటించిన రూ.100 నిధికి అదనంగా మరో రూ.200 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 25,000 వేల మంది న్యాయవాదులకు అమలు చేస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్‌ను మరో 10,000 వేల మంది న్యాయవాదులకు కూడా వర్తింప చేయాలని కోరుతూ తీర్మానం చేశారు. ఇండ్లు లేని న్యాయవాదులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలనీ, టెన్యుర్ పీ.పీ.లను కొనసాగించాలనీ, పీ.పీ, జీ.పీ., ఏ.జీ.పీ.ల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
సీఎం దృష్టికి తీసుకెళ్తా : బోయినపల్లి
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ సమావేశంలో తీర్మానించిన అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు. రాష్ట్ర ఆవిర్భావ సమయం 2014లో 7,778 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి స్థాయి ఉండగా, స్వరాష్ట్రం తెలంగాణ సిద్ధించిన తర్వాత ప్రస్తుతం 18,000 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నదని తెలిపారు. రానున్న కొద్ది నెలల్లోనే 25,000 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి స్థాయికి రాష్ట్ర చేరుకుంటుందని వివరించారు. ఆసరా పెన్షన్లు, ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు వెయ్యి గురుకుల పాఠశాల ఏర్పాటు, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, మిషన్ కాకతీయ వంటి అనేక కార్యక్రమాలను అమలు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కొనియాడారు. ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాదులు గండ్ర మోహన్ రావు, సహౌదర రెడ్డి, గణేష్, తిరుమల రావు, వెంకటేశ్వర్లు, దేవేందర్ రెడ్డి, రమణా రెడ్డి, అంజయ్య, రాజ్‌కుమార్, మధుసూదన్‌రావు, కళ్యాణ్‌రావు, లలితారెడ్డి, 33 జిల్లాల న్యాయవాదులు పాల్గొన్నారు.