నవతెలంగాణ- మంగపేట
గురువారం వరదబాదితులను బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు వేర్వేరుగా పరామర్శించారు. గౌరారంవాగు పొంగిపొర్లడంతో సినిమా హాల్ వడ్డెర కాలనీలోకి వరదనీరు చేరి ఇళ్లు ముంపుకు గురి కాగా బీఆర్ఎస్ మండల పార్టీ అద్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ వారిని పరాయర్శించి ప్రభుత్వం ఆదుకుంటుందని బాదితులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా వరద ముంపు బాదితులైన వడ్డెరలు తాము ప్రతి ఏటా వరదలకు ముంపుకు గురవుతున్నామని తమను వరదల సమయంలోనే తప్ప తర్వాత పట్టించుకోవడంలేదని తమ కాలనీలో పక్కా గృహాలు, రోడ్డు, కరెంట్ వసతి కల్పించాలని లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని హెచ్చరించారు. బాదతుల గోడు విన్న లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని తప్పకుండా మీ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
గౌరారం వాగు ముంపుకు గురైన మిరప నారు రైతులను కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అద్యక్షుడు గుమ్మడి సోమయ్య ఆధ్వర్యంలోని పార్టీ నాయకుల బ్రుందం పరామర్శించింది. గౌరారంవాగు పాత బ్రిడ్జీ కొత్త బ్రిడ్జీ సమీపంలో వేసిన నారుమల్లు మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు నాయకులకు వివరించారు. 25 ఎకరాల్లో సుమారు కోటిన్నర వరకు రైతులు తీవ్రంగా నష్టపోయామని అకాలంగా జరిగిన నష్టంతో తాము వీధినపడ్డట్లు రైతులు తెలిపారు. ములుగు ఎమ్మెల్య సీతక్క తమ వైపు నుండి ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి తమను ఆదుకునేలా సహాకరించాలని రైతులు కాగ్రెస్ నాయకులను వేడుకున్నారు.