– రూ.లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు 9నెలలూ పని చేయలేదు
– ప్రాజెక్టుల అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారించాలి : రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయప్రతినిధి
”కాళేశ్వరం ప్రాజెక్టులపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టగానే బీఆర్‌ఎస్ నేతల గుండెల్లో దడ పుడుతోంది. రూ.లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులు 9నెలలు కూడా పని చేయలేదు. ఆ ప్రాజెక్టుల్లో అక్రమాలపై త్వరలోనే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడతాం” అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం వాకర్స్‌తో సమావేశమై అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ను కాపాడేందుకు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ సచ్చీలుడు అయితే తనపై వచ్చిన ఆరోపణపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు. తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హితవు పలికారు. మరోవైపు తమ ప్రభుత్వం హామీ ఇచ్చిన గ్యారంటీ స్కీములపై ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించామని, వాటిని తాము చిత్తశుద్ధితో అమలు చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చి నెల మాత్రమే అవుతోందని, త్వరలోనే ఆ గ్యారంటీ స్కీములు అమలవుతాయన్నారు.