బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది

– జీవన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి
– కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి  ముత్యాల సునీల్ కుమార్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి  ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక లోటును పూడుస్తూ క్రమ శిక్షణతో వ్యవహరిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. బుధవారం బాల్కొండ నియోజకవర్గం కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్, కోనసముందర్ గ్రామాలలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డితో కలిసి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్  మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లో ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేసామని, అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అందించే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు.200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తూ రూ.5 వందలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి క్వింటాలుకు 500 బోనస్ ఇస్తామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండి మచ్చలేని నాయకుడు జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.జీవన్ రెడ్డి  స్వయాన రైతు అని,  వ్యవసాయదారుల కష్టాలు వ్యవసాయదారుడుకి తెలుస్తాయన్నారు. పార్లమెంట్లో నిజామాబాద్ గళం బలం వినిపించడానికి నియోజకవర్గం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి జీవన్ రెడ్డిని పార్లమెంటుకు పంపించాలని విజ్ఞప్తి చేశారు.
రూ.40వేల ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి 
 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ పథకం ద్వారా 150 రోజుల పని దినాలు కల్పిస్తూ రోజుకు కనీస వేతనం రూ.400  వచ్చే విధంగా చూస్తామన్నారు. తద్వారా సంవత్సరానికి రూ.40వేల ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని అమలు చేస్తామని తెలిపారు అలాగే ప్రతి పేద మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయల సహాయం అందే విధంగా నారీ న్యాయ్ పేరుతో కాంగ్రెస్ గ్యారంటీ ఉందన్నారు. అలాగే రూ.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సునీల్ రెడ్డి ఉంటారని, ప్రభుత్వ పథకాలను అమలు చేసే బాధ్యత ఆయన పైనే ఉందని తెలిపారు. నియోజకవర్గంలో ఎవరికైనా అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందకుంటే సునీల్ రెడ్డిని సంప్రదించాలని ఆయన తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గల్ఫ్ కార్మికుల పట్ల ఉదారంగా వ్యవహరించి గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకు రూ.5లక్షల  ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని తెలిపారు. బిజెపి, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఓడగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. అలాగే దేశంలో నియంతల వ్యవహరిస్తున్న బిజెపిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, నియోజకవర్గ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని జీవన్ రెడ్డి  విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మండల అధ్యక్షుడు సుంకేట రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గస్థాయి నాయకులు పాల్గొన్నారు.