ఇంటర్‌బోర్డును లూటీ చేసిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

ఇంటర్‌బోర్డును లూటీ చేసిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం–  రూ.252 కోట్లు దారిమళ్లింపు
–  సమగ్ర విచారణ జరపాలి : ఇంటర్‌ విద్యాజేఏసీ చైర్మెన్‌ మధుసూదన్‌రెడ్డి డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇంటర్‌ బోర్డును లూటీ చేసిందని ఇంటర్‌ విద్యాజేఏసీ చైర్మెన్‌ పి మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. ఇంటర్‌ బోర్డుకు చెందిన సుమారు రూ.252 కోట్ల నిధులను దారిమళ్లించిందని ఆరోపించారు. గత ప్రభుత్వ నిర్ణయాలు, ఇంటర్‌ బోర్డు నిధులకు సంబంధించిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని డిమాండ్‌ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటర్‌ బోర్డులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లుగా ఉన్న రూ.150 కోట్లను గత ప్రభుత్వ ఖజానాకు దారిమళ్లించిందని చెప్పారు.
తెలుగు అకాడమికి ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.52 కోట్లను ఇంటర్‌ బోర్డు చెల్లించేలా ఆదేశాలిచ్చిందని అన్నారు. పలు జూనియర్‌ కాలేజీల్లో అదనపు తరగతి గదులు, మౌలిక వసతుల కల్పన, డీఐఈవో కార్యాలయాలకు కంప్యూటర్లు, ప్రింటర్ల సరఫరా, ఇంటర్‌ విద్యా కమిషనర్‌ కార్యాలయంలో సోలార్‌ రూఫ్‌ ప్యానెల్‌ ఏర్పాటు, ఇతర పనుల మరమ్మతులకు సుమారు రూ.50 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. ఇంటర్‌ బోర్డు నిధులను పరీక్షల నిర్వహణ, అధ్యాపకులకు శిక్షణ, అకడమిక్‌ అంశాలు, పాఠ్యాంశాల రూపకల్పన, డిజిటల్‌ తరగతి గదుల కోసం వినియోగించాలని చెప్పారు. ఇంటర్‌ బోర్డు ఏర్పడినప్పటి నుంచి నిధులను ఇతర అవసరాలకు వినియోగించిన పరిస్థితి లేదన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తరహాలో ఇంటర్‌ బోర్డు నిధులను కాంగ్రెస్‌ ప్రభుత్వం వినియోగించొద్దని కోరారు. ఇంకోవైపు గతేడాది ఇంటర్‌ వార్షిక పరీక్షల నిర్వహణ, స్పాట్‌ వాల్యుయేషన్‌లో పాల్గొన్న సుమారు 25 వేల మంది సిబ్బంది, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో పాల్గొన్న 15 వేల మంది కలిపి 40 వేల మందికి పూర్తిస్థాయిలో రెమ్యూనరేషన్‌ చెల్లించలేదని చెప్పారు. కొందరికి 80 శాతం ఇస్తే, ఇంకొందరికి 50 శాతం, మరికొందరికి ఏమీ ఇవ్వలేదని అన్నారు. బోర్డు నిధులు దారిమళ్లించడం వల్ల అధ్యాపకులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి గలిగిన సంస్థల నిధులను దారిమళ్లించి వాటిని బలహీనం చేయడం సరైంది కాదన్నారు. విద్యారంగాన్ని గత ప్రభుత్వం గాలికొదిలేసిందని చెప్పారు.
ఇంటర్‌ బోర్డు నుంచి రూ.252 కోట్లు ప్రభుత్వం తీసుకుంటే పదో షెడ్యూల్‌లోని ఇతర సంస్థలు, శాఖల నుంచి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నదోనని ఆరోపించారు. ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలను అందిస్తున్నట్టు గత ప్రభుత్వం చెప్పిందన్నారు. తెలుగు అకాడమికి రూ.52 కోట్లు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. అధ్యాపకులను రెమ్యూనరేషన్‌ను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.