అడవీ బిడ్డల కష్టాలు తీర్చిన బీఆర్‌ఎస్‌

జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌
నవతెలంగాణ -మహాముత్తారం
అనేక ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో అభివద్దికి నోచుకోని అడవిబిడ్డల కష్టాలు తీర్చిన చరిత్ర బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని మంథని నియోజకవర్గ ఇన్‌చార్జి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. బుధవారం మహాముత్తారం మండలం నిమ్మగుడెం గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టిన కేశవపూర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. నాడు అధికారంలో ఉన్న గత పాలకులు అటవీ గ్రామాల అభివధ్దిని విస్మరించారని అన్నారు. ఎన్నికల సమయంలోనే గ్రామాల్లో పర్యటించి ప్రజలను మభ్య పెట్టి ఓట్లుదండుకున్నారే కానీ అక్కడి ప్రజల అవసరాలు, ఆకలి తీర్చాలనే ఆలోచన చేయలేదన్నారు. కాటారం, మహదేవ్‌పూర్‌, మహముత్తారం మండలాల్లోని అనేక వాగులు ఉప్పొంగితే నెలల తరబడి అడవిబిడ్డలు బాహ్యప్రపంచానికి దూరంగా ఉండేవారని అన్నారు. ఎంతో మంది అడవిబిడ్డలు వాగులు ఉప్పొంగి ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోలేదన్నారు. 40ఏండ్లలో తండ్రి కొడుకులు చేయలేని అభివద్దిని నాలుగేండ్లలో చేసి చూపించామని తెలిపారు. తూర్పు పల్లెలకు అనుసంధానంగా ఉండే వాగులపై వంతెనలు, నడవలేని స్థితిలో ఉన్న రోడ్లను మెరుగు చేసి రహదారులు నిర్మించామని గుర్తు చేశారు. మహాముత్తారం మండలం నిమ్మగూడెం పరిధిలో చేపట్టిన కేశవపూర్‌ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో వేగం పెంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో మండల అధ్యక్షులు కల్వచర్ల రాజు, నాయకులు పాల్గొన్నారు.